Idream media
Idream media
బలమైన రాజకీయ కుటుంబం… అధినేత దగ్గర పూర్తి స్వేచ్ఛ, ముఖ్యమంత్రి వద్దకు నేరుగా వెళ్ళే స్వాతంత్ర్యం, సొంత జిల్లాతో పాటుగా రాయలసీమలో బలమైన అభిమాన అనుచరగణం, ప్రత్యర్థులు కూడా ఆప్యాయంగా అన్నా పిలిచే మంచితనం… ఇలా ఏపీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి గురించి ఎన్ని చెప్పినా తక్కువే. పార్టీలో అయినా ప్రభుత్వంలో అయినా సరే ఒక్క అధినేతకే కాదు సీనియర్లు అందరికి సమానం గౌరవం ఇస్తూ అన్నా అని పిలుస్తూ తనదైన ముద్ర వేసిన గౌతం రెడ్డి… నేడు కన్నుమూయడం అందరిని విస్మయానికి గురి చేసింది.
ఎంతో హుషారుగా, అన్ని విధాలుగా క్రమశిక్షణ తో ఉండే మంత్రి… ఇలా గుండెపోటు తో కన్నుమూయడం అనేది విస్మయానికి గురి చేసింది. రాజకీయాల్లో ఎంత బలమైన కుటుంబమైనా ప్రజలకు అందుబాటులో ఉంటేనే రాజకీయ భవిష్యత్తు అని నమ్మి ప్రజాసేవతో ముందుకు వెళ్ళిన గౌతం రెడ్డి మరణ వార్తతో ప్రతిపక్షాలు కూడా షాక్ కి గురయ్యాయి. నియోజకవర్గ ప్రజలు అయినా జిల్లాలో ఎవరు అయినా సరే… ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అయినా మంత్రిగా ఉన్నప్పుడు అయినా తన ఇంటికి వెళ్తే వెంటనే పని పూర్తి చేయించే వారు.
సొంత పార్టీ నేతలకు కాస్త ఆలస్యమైనా… ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు గాని స్థానిక నాయకులుగానీ వస్తే మాత్రం వెంటనే పని పూర్తయ్యేది. అలాగే నియోజకవర్గ ప్రజలకు తాను అందుబాటులో లేకపోయినా సరే తనతో అత్యంత సన్నిహితంగా ఉండే వారికి బాధ్యతలు అప్పగించే వారు. ఇక మీడియా మైకులకు కూడా ఆయన దూరంగా ఉండేవారు. అనవసర రాజకీయ విమర్శలు చేయడం గాని వివాదాలకు వెళ్ళడం గాని ఎక్కడా కనపడదు. ఇక నియోజకవర్గంలో అయినా జిల్లాలో అయినా ఏదైనా కార్యక్రమానికి ఆహ్వానిస్తే… హాజరయ్యే వారు.
తొలి కేబినేట్ లో అనుభవం లేకపోయినా సరే సిఎం జగన్… మేకపాటి గౌతం రెడ్డికి కీలక శాఖ అప్పగించారు. గత ప్రభుత్వ తప్పుల మీద ఏ విమర్శలు లేకుండా ముందుకు వెళ్తూ పరిశ్రమల శాఖను నష్టాల నుంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సిఎం జగన్ కూడా పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పెట్టుబడుల మీద సీరియస్ గా దృష్టి సారించారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూనే మంత్రిగా తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్న గౌతం రెడ్డి… ఇక ఆయన మరణం పట్ల టీడీపీ సోషల్ మీడియా సైతం సంతాపం వ్యక్తం చేస్తుంది.
ఆయన మరణానికి పోస్ట్ కోవిడ్ సమస్యలే కారంణం అని అంటున్నారు. రెండు సార్లు కరోనా బారిన పడినా ఆయన వెంటనే కోలుకున్నారు. అయితే జిమ్ కాస్త ఎక్కువగా చేసే అలవాటు ఉన్న గౌతం రెడ్డి దాని కారణంగానే కన్ను మూసారనే మాట వినపడుతుంది. గత ఏడాది కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ సైతం ఇలాగే కన్నుమూసారు. ఇక ఆయన మరణం పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.