లోకేష్ టీం మీద మహిళల ఆరోపణలు

పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఓటమి చూసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌.. మరోసారి మంగళగిరి నియోజకవర్గం నుంచే అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. గత ఏడాది స్థానిక ఎన్నికలు, ఇటీవల కుప్పం మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల తర్వాత.. చంద్రబాబుతోపాటు లోకేష్‌ కూడా అప్రమత్తమయ్యారు. మంగళగిరిలో కార్యకర్తలను పరామర్శించే పేరుతో పలుమార్లు పర్యటించారు. నియోజకవర్గం మారుతారనే ఊహాగానాల నేపథ్యంలో.. తాను మంగళగిరిలోనే పోటీ చేస్తానని ఆ పర్యటనల సందర్భంగా స్పష్టతనిచ్చారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానంటూ ప్రకటనలు చేశారు.

ఇలా పని చేస్తూ మంగళగిరిలో ఈసారైనా గెలిచేందుకు యత్నిస్తున్న నారా లోకేష్‌కు కాలం ఏ మాత్రం కలిసి రావడం లేదు. తాజాగా లోకేష్‌ మంగళగిరి పీఏ సాంబశివరావుపై ఆ పార్టీ మహిళా నేత దాసరి కృష్ణవేణి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. మహిళా కార్యకర్తలను సాంబశివరావు లైంగికంగా వేధిస్తున్నాడని, బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా నేతలను పార్టీలో ఎదగనీయకుండా చేస్తున్నారంటూ ఆమె తన అనునూయులతో కలిసి మంగళగిరి పార్టీ కార్యాలయం ముందు ధర్నాకు దిగడం సంచలనమైంది. ఈ విషయాలపై ప్రశ్నిస్తే.. తమను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారని కృష్ణవేణి లోకేష్‌ పీఏపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సాంబశివరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. పార్టీ కార్యాలయం ముందు భైటాయించి నినాదాలు చేశారు.

మంగళగిరికి చెందిన పాలేటి కృష్ణవేణి, పాలేటి రాజ్ కుమార్ దంపతులు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ కుమార్ వారిని సస్పెండ్ చేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత పాలేటి రాజ్ కుమార్, సతీమణి కృష్ణవేణి వరుసగా పోస్ట్ లు పెట్టి తమకు పార్టీలో అన్యాయం జరిగిందని, పార్టీలో లోపాలను ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడి పై కూడా ఆరోపణలు చేశారు.లోకేష్ ను అభిమానించే వారు కొందరు కృష్ణవేణి దంపతులను వ్యక్తిగతంగా విమర్శించడం మొదలుపెట్టడంతో వివాదం మరింతగా ముదిరింది. ఇక వారం క్రితం దంపతులు ఇద్దరూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాము పార్టీకి విధేయులం అని ప్రకటించారు. 

తమపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేస్తే పార్టీకి సేవ చేస్తామని విజ్ఞప్తి చేసినా సరే పార్టీ పట్టించుకోలేదు అనే ఆరోపణలు వచ్చాయి. దీనితో నేడు పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. తమపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని, లోపాలను ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అంటూ నిరసన కార్యక్రమం చేశారు. అలాగే నియోజకవర్గంలో జరుగుతున్న తప్పులను ప్రస్తావించారు. దళితులకు నియోజకవర్గంలో ఒక్క విభాగంలో కూడా అధ్యక్ష పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. వాస్తవానికి టీడీపీ చరిత్రలో అగ్రనేతల వ్యక్తిగత కార్యదర్శులపై ఈ తరహా ఆరోపణలు రాలేదు. దీనితో ఇది ఏ మలుపు తిరగబోతుంది, ఈ దంపతుల సస్పెన్షన్ వ్యవహారం లోకేష్ మెడకు చుట్టుకుంటుందా అనేది చూడాలి.

Also Read : రెచ్చగొట్టేందుకు ఇంతలా దిగజారాలా అశోక్‌బాబు..?

Show comments