పొట్టేలు బదులు మనిషి తల నరికివేతలో ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లి రూరల్‌ మండలం వలసపల్లె గ్రామంలో కనుమ పండుగ రోజున ఉత్సవంలో పొట్టేలు తల బదులు మనిషి తల నరికివేసిన ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. మద్యం మత్తులో పొట్టేలు తల బదులు పొరపాటున మనిషి తల నరికేశాడని భావించినా.. మరుసటి రోజున పోలీసుల విచారణలో అసలు నిజం వెలుగుచూసింది. మద్యం మత్తులో పొరపాటున ఈ ఘటన జరగలేదని, క్షణికావేశంలో తమ్ముడు వరసైన వ్యక్తిని కావాలనే నరికేశాడని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అసలు ఏం జరిగింది..?

వలసపల్లె గ్రామానికి చెందిన లక్ష్మన్న, గంగులమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. లక్ష్మన్న 8 ఏళ్ల క్రితం చనిపోయారు. అవివాహితుడైన చిన్న కుమారుడు తలారి సురేష్‌ (26) కూలి పని చేసుకుంటూ తల్లి వద్దే ఉంటున్నాడు. సురేష్‌కు వరుసకు పెద్దనాన్న కుమారుడైన తలారి చలపతి (55) కుటుంబంతో చిన్నపాటి గొడవలు నిత్యం జరుగుతూ ఉండేవి. సంక్రాంతి కనుమ పండగ సందర్భంగా అమ్మవారి ఉత్సవాల్లో జంతుబలి ఇచ్చే సమయంలో ఏటా తలారి చలపతి పొట్టేలు తల నరకడం ఆనవాయితి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా గ్రామంలో కనుమ సంబరాలు ఘనంగా సాగాయి. గ్రామస్తులు నడివీధిలోని రామాలయం మండపం వద్ద అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తూ పూజలు చేయడంలో నిమగ్నమయ్యారు.

ఉదయం నుంచి హతుడు తలారి సురేష్‌ మద్యం మత్తులో ఉన్నారు. తలారి చలపతి కూడా మద్యం సేవించి ఉన్నాడు. సంబరాల్లో భాగంగా అమ్మవారికి బలి ఇచ్చే పొట్టేలును ఊరంతా మేళతాళాల మధ్య ఊరేగించడం, ప్రతి ఇంటి వద్దకు తీసుకెళ్లి, పూజలు చేస్తూ.. నడివీధికి తీసుకురావడం ఆనవాయితీ. ఈ క్రమంలో రాత్రి 8.30 గంటల సమయంలో సురేష్‌ డప్పు వాయిద్యాలకు అనుగుణంగా డ్యాన్సులు వేస్తూ పొట్టేలు వెంట నడిచాడు. పొట్టేలు తల నరికే తలారి చలపతి కత్తి పట్టుకుని పొట్టేలును ఇంటింటికి తిప్పుతున్నారు. తలారి సురేష్‌ డ్యాన్సులు చేస్తూ తూలి చలపతిపై పలుమార్లు పడ్డాడు. ఆగ్రహించిన చలపతి.. అమ్మవారి పొట్టేలుకు చందా ఇచ్చే స్తోమత లేదుగానీ.. డ్యాన్సులు వేసేందుకు తక్కువ లేదంటూ విసుక్కున్నాడు. 

ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. చలపతి.. డప్పులు మోగించడం నిలిపివేయాలని వారిని ఆదేశించారు. తాను డ్యాన్సు వేయాల్సిందేనని, డప్పులు వాయించాల్సిందేనని సురేష్‌ పట్టుబట్టాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో.. విచక్షణ కోల్పోయిన తలారి చలపతి తనకు తమ్ముడు వరసైన తలారి సురేష్‌ మెడపై చేతిలోని కత్తితో ఒక్క వేటు వేశాడు. సురేష్‌ కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్పరిణామంతో భయకంపితులైన గ్రామస్తులు ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత.. కొంత మంది రక్తపుమడుగులో గిలగిలా కొట్టుకుంటున్న సురేష్‌ను 108 అంబులెన్స్‌లో మదనపల్లి ఆస్పత్రికి తరలించారు. మెడ సగ భాగం వరకు తెగడం వల్ల తీవ్ర రక్తస్రావం కావడంతో ఆస్పత్రికి చేరేలోపు సురేష్‌ మరణించాడు.

Also Read : అమ్మో, పొట్టేలు తలనుకుని మనిషి తల నరికేశాడు

Show comments