జిల్లా, మండల ప్రజా పరిషత్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాల చైర్మన్ పదవులు రెండూ మహిళలకే దక్కాయి. దీంతో ఒక్కసారిగా పార్టీల అంచనాలు తలకిందులయ్యాయి. దీన్నుంచి తేరుకున్న పార్టీలు ఇప్పుడిప్పుడే అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించాయి. ఇంకో రెండు మూడురోజుల్లో అభ్యర్థిత్వాలపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలో రిజర్వేషన్ల తీరుతెన్నులు… గత మూడు ఎన్నికల్లో జిల్లా, మండల్ పరిషత్ పీఠాలను దక్కించుకున్న పార్టీలు, అభ్యర్థుల గురించి ఒకసారి చూద్దాం…
పశ్చిమ గోదావరి.. విలీన రగడ…
తుది రిజర్వేషన్లు పశ్చిమలోని విలీన మండలాల్లో మంటలు రేపాయి. వేలేరుపాడు జెడ్పీటీసీ పదవి గతంలో జనరల్ మహిళకు రిజర్వ్ కాగా, ప్రస్తుతం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. కుక్కునూరు జెడ్పీటీసీ స్థానం గతంలో బీసీ మహిళకు కేటాయించగా, ప్రస్తుతం జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లోని సీట్లను ఇతరులకు ఎలా కేటాయిస్తారంటూ అక్కడివారు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయా మండలాల్లో ఎంపీపీ రిజర్వేషన్ల విషయంలో రగడ సాగుతోంది. జెడ్పీ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ మహిళా రిజర్వేషన్లకు 2011 జనాభా లెక్కలను, బీసీలకు సామాజిక ఆర్థిక సర్వేను పరిగణలోకి తీసుకుని ఆయా స్థానాలను రిజర్వ్ చేసినట్లు అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధానాల మేరకే స్థానాలను కేటాయించినట్టు పేర్కొంటూ.. గతం కంటే భిన్నంగా రిజర్వేషన్ల ప్రక్రియ సాగిందనే వాదనను కొట్టిపారేస్తున్నారు. మరోవైపు జిల్లా చైర్మన్ పదవిని బీసీ మహిళకు కేటాయించడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. కీలకమైన ఆ పదవిని దామాషా పద్ధతిలో ఎస్సీలకు కేటాయించాల్సింది పోయి… నిబంధనల మేరకు బీసీలకు కేటాయించారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పంచాయతీలు…
జిల్లాలో 909 పంచాయతీలకు రిజర్వేషన్లు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది. రెండు, మూడు రోజుల్లో ఆయా వివరాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే మండల పరిషత్ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు చేయడంతో.. ఆ దామాషా పద్ధతిలోనే గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం ఏలూరు, భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెంలల్లో గ్రామ పంచాయతీలను మనిసిపాలిటీల్లో విలీనం చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందుంది. అక్కడ ప్రజాభిప్రాయం పూర్తయిన తర్వాత విలీన ప్రక్రియను ఓ కొలిక్కి తీసుకురానున్నారు. అయినప్పటికీ ఆయా గ్రామాల రిజర్వేషన్లను యథాతథంగా పూర్తి చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బట్టి తుది నిర్ణయం ఉండనుంది. అదే సమయంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉండాలని మునిసిపల్ సిబ్బందికి ఆదేశాలు అందాయి. ఇందులో భాగంగా వార్డుల విభజన, కొత్త వార్డుల రూపకల్పన, ఏలూరు కార్పొరేషన్‌లో డివిజన్లను పునర్వ్యవస్థీకరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం ఇలా…
సుదీర్ఘ కసరత్తు అనంతరం మండల, జిల్లా పరిషత్‌ల రిజర్వేషన్లు ఖరారైన సంగతి తెలిసిందే. వీటిని పరిశీలిస్తే ఈసారి జిల్లాలో బీసీలకు ప్రాధాన్యం దక్కిందని చెప్చొచ్చు. కీలకమైన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పదవి.. బీసీ మహిళకు ఖరారైంది. జిల్లాలో 920 ఎంపీటీసీ, 48 ఎంపీపీ, 48 జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ వివరాలు కింది విధంగా ఉన్నాయి….
920 ఎంపీటీసీ స్థానాలు….
ఎస్టీలకు మొత్తం 30 ఎంపీటీసీ స్థానాలు రిజర్వ్ చేశారు. వీటిలో మహిళలకు 18, జనరల్‌కు 12 కేటాయించారు. ఎస్సీలకు మొత్తం 206 ఎంపీటీసీ స్థానాలు ఖరారవ్వగా, మహిళలకు 115, జనరల్‌కు 91 స్థానాలు దక్కాయి. బీసీలకు అత్యధికంగా 285 స్థానాలు కేటాయించగా మహిళలకు 149, జనరల్‌కు 136 స్థానాలు దక్కాయి. అన్‌రిజర్వ్‌డ్ కింద 399 స్థానాలు కేటాయించగా వీటిలో మహిళలకు 192 కేటాయించారు. మొత్తంగా చూస్తే మహిళలకు 474, జనరల్‌కు 446 స్థానాలు దక్కాయి.
ఎంపీపీ స్థానాలు….
ఎస్టీలకు నాలుగు ఎంపీపీ స్థానాలు రిజర్వ్ అయ్యాయి. వీటిలో రెండింటిని మహిళలకు కేటాయించారు. ఎస్సీలకు 13 ఎంపీపీ స్థానాలు రిజర్వ్ చేశారు, వీటిలో మహిళలకు 7 కేటాయించారు. బీసీలకు 15 ఎంపీపీలు ఖరారవ్వగా, ఇందులో మహిళలకు 8 రిజర్వ్ అయ్యాయి. అన్‌రిజర్వ్‌కు 16 స్థానాలు కేటాయించగా, వీటిలో 8 మహిళలకు కేటాయించారు. మొత్తంగా 48 స్థానాల్లో 25 మహిళలకు దక్కితే..23 స్థానాలు జనరల్‌కి దక్కాయి.
జెడ్పీటీసీ స్థానాలు….
ఎస్టీలకు రెండు స్థానాలు రిజర్వ్ అవ్వగా… అందులో ఒకటి మహిళకు ఖరారైంది. ఎస్సీలకు 11 జెడ్పీటీసీలు రిజర్వ్ అవ్వగా, మహిళలకు 6 స్థానాలు దక్కాయి. బీసీలకు 15 స్థానాలు కేటాయించగా, మహిళలకు 7 సీట్లు దక్కాయి. 20 స్థానాలను అన్ రిజర్వ్‌డ్‌గా ప్రకటించగా, వీటిలో మహిళలకు 10 స్థానాలు దక్కాయి. మొత్తంగా 24 మహిళలకు, 24 జనరల్‌కు దక్కాయి.
మార్పులు ఇలా…
రిజర్వేషన్లు ఖరారు కాకముందు జెడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు ఖరారవుతుందనే అంచనాలు సర్వత్రా నెలకొన్నాయి. అయితే అనూహ్యంగా బీసీ మహిళకు ఖరారైంది. దీంతోపాటు జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల పరంగానూ పార్టీల అంచనాలు తారుమారయ్యయి. దీంతో పార్టీల్లో ఆందోళన మొదలైంది. గతంలో పోలవరం జెడ్పీటీసీ ఎస్టీ మహిళకు రిజర్వ్ కాగా, ఇప్పుడు ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఏలూరులో ఎంపీపీ స్థానం గతంలో బీసీ మహిళ, జెడ్పీటీసీ ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా, ఇప్పుడు జెడ్పీటీసీ స్థానం బీసీ మహిళకు, ఎంపీపీ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది.
గత ఎన్నికల్లో జిల్లాలో బీసీలకు 15 స్థానాలు జెడ్పీ రిజర్వ్ కాగా, ఇప్పడూ అదే సంఖ్య కొనసాగింది. కీలకమైన జెడ్పీ చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. చివరిసారిగా బీసీ వర్గం నుంచి ప్రస్తుత తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావు జెడ్పీ చైర్మన్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ కారుమూరి ఎంపికలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఎస్టీలకు గతంలో పోలవరం స్థానం మాత్రమే రిజర్వ్ కాగా, ఇప్పుడు చింతలపూడి(ఎస్టీ మహిళ), టి.నరసాపురం స్థానాలు రిజర్వ్ అయ్యాయి. ఎస్సీల్లో గతం కంటే రెండు స్థానాలు పెరిగాయి. ప్రస్తుతం అభ్యర్థి ఎంపికలో డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నానిదే తుది నిర్ణయం కావొచ్చు. ఎమ్మెల్యేలు అబ్బయ్య చౌదరి, పుప్పాల వాసుబాబు, కొట్టు సత్యనారాయణ, గ్రంథి శ్రీనివాస్ లు ఆళ్లనానితో సన్నిహితంగా మెలుగుతున్నారు. ఈ విషయంలో జిల్లాలో మరో మంత్రయిన చెరుకువాడ శ్రీరంగనాథ రాజు, జిల్లా పార్టీ సారథి తెల్లం బాలరాజులది పరిమిత పాత్రే అని చెప్పొచ్చు.
గత మూడు ఎన్నికలు ఇలా…
2001లో తెలుగుదేశం నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొక్కిరిగడ్డ జయరాజు జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎంపికయ్యారు. ఆ ఎన్నికల్లో 46 స్థానాలకు గానూ 20 స్థానాలను కాంగ్రెస్, 26 స్థానాలను తెలుగుదేశం కైవసం చేసుకుంది. బీఈడీ చేసి ఆటో నడుపుకుంటున్న జయరాజుకి ఎలమంచిలి టిక్కెట్టు దక్కడం, అనూహ్యంగా చైర్మన్ పదవి లభించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. 2006లో ప్రస్తుతం వైఎస్సాఆర్ సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు కాంగ్రెస్ నుంచి చైర్మన్‌గా ఎంపికయ్యారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం 21 స్థానాలను, కాంగ్రెస్ 25 స్థానాలను కైవసం చేసుకుంది. ద్వారకాతిరుమల నుంచి ఎన్నికైన కారుమూరి నాగేశ్వరరావుకి చైర్మన్ గిరీ దక్కింది.
2014 ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గానికి చెందిన ముళ్లపూడి బాపిరాజు చైర్మన్‌గా ఎంపికయ్యారు. ఆ ఎన్నికల్లో 46 స్థానాలకు గానూ 43 స్థానాలను తెలుగుదేశం కైవసం చేసుకుంది. బుట్టాయిగూడెం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన కరాటం సీతాదేవి, నిడదవోలు నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన ముళ్లపూడి శ్రీకృష్ణ సత్య, వీరవాసరం నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రదీప్ మానుకొండలు మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిచారు.
మండల పరిషత్…
2001లో 13 మండల పరిషత్‌లను కాంగ్రెస్ సొంతం చేసుకోగా, 29 మండలాలను తెలుగుదేశం కైవసం చేసుకుంది. బుట్టాయగూడెం నుంచి వి.భారతి, పోలవరం నుంచి డి.వెంటక సత్యనారాయణరాజు, పెనుగొండ నుంచి కృష్ణవలీ, పెంటపాడు నుంచి పద్మావతి ఇండిపెండెంటులుగా ఎంపీపీలయ్యారు. 2006లో 22 ఎంపీపీ స్థానాలను తెలుగుదేశం, 24 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. 2014లో 43 స్థానాలను తెలుగుదేశం గెలుపొందగా, వీరవాసరం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన కావూరు శ్రీనివాస్, గుంటూరు నుంచి అన్ రిజర్వ్ మహిళ కేటగిరీ నుంచి గుంటూరు వాణి, నిడదవోలు నుంచి బీసీ సామాజికవర్గానికి చెందిన మన్నెం సూర్యనారాయణ వైఎస్సార్ కాంగ్రెస్ తరపున ఎంపీపీలుగా గెలుపొందారు.
తూర్పుగోదావరి..
జిల్లా పరిషత్ చైర్మన్ సీటు జనరల్ కేటగిరీలో మహిళకు రిజర్వ్ అయ్యింది. 62 జెడ్పీటీసీ స్థానాల్లో మహిళలకు 31, ఇతరులకు 31 స్థానాలు కేటాయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి 38 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. జనరల్ స్థానాలు 24. వీటిలోనూ బీసీ జనాభా ఎక్కువ ఉన్న చోట వారికే అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. జెడ్పీ చైర్మన్ జనరల్ మహిళకు కేటాయించడంతో జనరల్ స్థానాల్లో మహిళలు కూడా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.
గత ఎన్నికల్లో ఇలా…
2001లో తెలుగుదేశం నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దున్నా జనార్థనరావు జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 26 స్థానాలను, తెలుగుదేశం 33 స్థానాలను గెలుపొందగా, ప్రత్తిపాడు నుంచి మాదేపల్లి రంగబాబు ఇండిపెండెంట్‌గా గెలిచారు. కాజులూరు నుంచి ఎంపికైన దున్నా జనార్థనరావుకి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కింది. 2006లో కాంగ్రెస్ నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ చైర్మన్‌గా ఎంపికయ్యారు. ఆ ఎన్నికల్లో 58 స్థానాలకు ఎన్నికలు జరగ్గా తెలుగుదేశం 20 స్థానాలను, కాంగ్రెస్ 37 స్థానాలను గెలుపొందాయి. బిక్కబోలు నుంచి పెడల వెంకట రామారెడ్డి ఇండిపెండెంట్‌గా గెలిచారు. మలికిపురం నుంచి ఎన్నికైన వేణుగోపాలకృష్ణకి చైర్మన్ పీఠం దక్కింది.
2014లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో జనరల్ కేటగిరీ నుంచి రాంబాబు నామన చైర్మన్‌గా ఎంపికయ్యారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం 47 స్థానాలను, వైఎస్సార్ కాంగ్రెస్ 9 స్థానాలను దక్కించుకున్నాయి. పి.గన్నవరం నుంచి ఎంపికైన రాంబాబు నామనకి చైర్మన్ గిరీ దక్కింది. మండల పరిషత్ ఎన్నికల విషయానికొస్తే 2001లో కాంగ్రెస్ 21 ఎంపీపీలను, 31 ఎంపీపీలను గెలుపొందాయి. 2006 తెలుగుదేశం 25 స్థానాల్లో, ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలుపొందగా మిగిలిన మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 2014లో తొమ్మిది ఎంపీపీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, 54 ఎంపీపీలను తెలుగుదేశం గెలుచుకుంది.
జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థి ఎంపికకు సంబంధించి అధికార పార్టీలో ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే మంత్రి కన్నబాబు కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. కన్నబాబుతోపాటు జిల్లా నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్ లు మంత్రులుగా ఉన్నప్పటికీ వారి అభిప్రాయాలను ఏమేరకు పరిగణలోకి తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే కాకినాడ రురల్ నుంచే అభ్యర్థిత్వం ఖరారవుతుందనే ఊహాగానాలు చెక్కర్లు కొడుతున్నాయి. మరో వైపు తెలుగుదేశం విషయంలోనూ స్పష్టత లేదు. ఆ పార్టీలో చినరాజప్ప, బుచ్చయ్య చౌదరి, యనమల తదితరులు కీలకంగా వ్యవహరించనున్నారు. జనసేన నుంచి కందుల దుర్గేష్, పంతం నానాజీలు పార్టీ వ్యవహారాలను చూస్తున్నారు. తుది సమరంలో ఏ పార్టీ అధిక సీట్లను గెలుచుకుంటుందో…చూడాలి !