పరిటాల అనుచరుల భూదందా… వంద కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం

మాజీ మంత్రి పరిటాల సునీత అనుచరులు చేసిన భారీ భూదందా బట్టబయలు అయింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములను ఏ విధంగా ఆక్రమించి, సొమ్ము చేసుకున్నది అధికారుల విచారణలో వెల్లడైంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పరిటాల సునీత వర్గీయులు అనంతపురం జిల్లాలో సాగించిన అక్రమాలు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి చొరవతో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పరిటాల అనుచరులు అనంతపురం రూరల్‌ మండలంలో ఆక్రమించిన వంద కోట్ల రూపాయల విలువైన 40 ఎకరాల ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురం రూరల్‌ మండలం రాచానుపల్లి, ఇటుకలపల్లి, కరుగుంట్ల గ్రామాల పరిధిలో పరిటాల అనుచరులు 40 ఎకరాలను టీడీపీ ప్రభుత్వ హయాంలో కాజేశారు. ఇందుకోసం వారు మాజీ సైనికుల పేర్లను ఉపయోగించుకున్నారు. మాజీ సైనికుల పేరుతో భూములకు దరఖాస్తు చేయించి, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ భూములను కొల్లగొట్టారు. మాజీ సైనికుల పేరుతో భూములు మంజూరు చేయించుకున్న నెల రోజుల తర్వాత.. మళ్లీ వాటికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఇలా చేసుకున్న భూములతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు జేబుల్లో వేసుకున్నారు.

ఈ దందా విషయం తెలుసుకున్న రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి తన వద్ద ఉన్న ఆధారాలతో రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుపై అనంతపురం ఆర్డీవో మధుసూదన్‌ విచారణ ప్రారంభించారు. ఈ దందాపై కొంతకాలంగా లోతైన విచారణ చేసిన ఆర్డీవో మధుసూదన్‌.. భూములను కొల్లగొట్టిన వైనాన్ని బట్టబయలు చేశారు. అవి ప్రభుత్వ భూములని తేల్చారు. వాటిని మాజీ సైనికుల పేర్లతో ఎలా కొట్టేసింది దర్యాప్తు నివేదిక పొందుపరిచి ఉన్నతాధికారులకు అందజేశారు. ఆ భూముల సీజ్‌ చేశారు. మాజీ సైనికుల పేరుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వ భూములను కాజేసిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. భూ భాగోతం వెలుగులోకి రావడంతో టీడీపీ నేతలు కిమ్మనకుండా ఉన్నారు.

Also Read :కేంద్రం మొండిచేయి చూపితే రాష్ట్ర ప్రభుత్వంపై నిందలేంటి అచ్చెన్నా?

Show comments