తెలంగాణ‌లో పదవుల పందేరం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇటీవ‌లే నామినేటెడ్ ప‌ద‌వుల‌ను ప్ర‌క‌టించారు. సీఎం జ‌గ‌న్ సామాజిక న్యాయం పాటిస్తూ.. భారీ స్థాయిలో ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ప‌ద‌వులు అప్ప‌గించారు. దీంతో వైసీపీలో మ‌రింత జోష్ పెరిగింది. ఇక తెలంగాణ కూడా ఆయా పోస్టుల భ‌ర్తీపై దృష్టి సారిస్తోంది. ఈ మేర‌కు అధిష్ఠానం నుంచి సంకేతాలు వెలువడుతున్నాయి. వీలైతే హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు ముందే ప్ర‌క‌టించి పార్టీ నేత‌ల్లో జోష్ నింపే అకాశాలు ఉన్నాయి. దీంతో పార్టీకి చెందిన ఆశావహులు అప్రమత్తమయ్యారు. రేసులో చివరికి వరకు కొనసాగి, పదవి దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

తెలంగాణ‌ రాష్ట్రంలో చాలా కాలం నుంచి నామినేటెడ్‌ పదవులు భర్తీకి నోచుకోలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, టీఆర్‌ఎస్‌ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ ఎప్పటికప్పుడు ఈ ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. 2019 మొదట్లో పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు, తదుపరి పరిషత్‌ ఎన్నికలు.. ఇలా ఏదో ఒక కారణంతో పదవుల పంపిణీలో జాప్యం జరుగుతోంది. గడిచిన రెండున్నరేళ్లలో టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం అడపాదడపా కొన్ని నామినేటెడ్‌ పోస్టుల నియామకాలు, రెన్యువల్స్‌ తప్ప, ఒకేసారి పెద్దఎత్తున పదవుల భర్తీ చేపట్టిన దాఖలాలు లేవు. దీంతో పార్టీకి చెందిన ఎంతో మంది నాయకులు చకోర పక్షులయ్యారు. పదవులు దక్కుతాయని ఆశపడటం, చివరకు ఉసూరుమనడం వారికి షరా మామూలైంది.

భర్తీ చేయాల్సిన నామినేటెడ్‌ పదవుల్లో తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమిషన్లు వంటి కీలకమైన రాజ్యాంగబద్ధ సంస్థలూ ఉన్నాయి. ఇక, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు 54 వరకు ఉండగా, 40కిపైగా కార్పొరేషన్లు… పాలకవర్గాలు లేకుండా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిలో ఆర్టీసీ, ఎస్సీ, ఎస్టీ, బేవరేజెస్‌, ఆర్‌అండ్‌బీ, మిషన్‌ భగీరథ, టెక్నాలజీ సర్వీసెస్‌, ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌.. కీలకమైనవి. కొత్త నియామకాలు లేదా చైర్మన్ల పదవీకాలం పొడిగింపు జరిపిన కార్పొరేషన్లలో టీఎస్‌ఐఐసీ, పోలీస్‌ హౌసింగ్‌, వికలాంగుల అభివృద్ధి, సీడ్స్‌, మార్క్‌ఫెడ్‌, గిడ్డంగులు, సాంస్కృతిక, పౌరసరఫరాలు, అటవీ, పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధి తదితర సంస్థలు ఉన్నాయి.

వాస్తవానికి నిరుడే నామినేటెడ్‌ పదవుల భర్తీపై టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం దృష్టి సారించింది. అయితే, వరుసగా దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు, ఆ తర్వాత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడంతో ఈ ప్రక్రియ కొలిక్కి రాలేదు. ఇప్పుడు నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక(మే2 ఫలితం) పూర్తయ్యాక సమీప భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలు లేకపోవటం, వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లుసహా 11 మునిసిపాలిటీల ఎన్నికలు కూడా పూర్తి కావ‌డంతో నామినేటెడ్‌ పదవుల భర్తీకి టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది.

అలాగే జూన్‌లో 7 ఎమ్మెల్సీ (ఆరు ఎమ్మెల్యే కోటా, ఒకటి గవర్నర్‌ కోటా) పదవులు ఖాళీ అయ్యాయి. ఆ ఏడు పదవుల్లో నాలుగింటిని బీసీలకు కేటాయిస్తామని ఇప్పటికే టీఆర్‌ఎస్‌ చీఫ్‌, సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. మరోవైపు కమిషన్లు, కార్పొరేషన్ల వారీగా పదవులు ఇవ్వడానికి అర్హులైన వారు పార్టీలో, బయట ఎవరు ఉన్నారనే చిట్టాను మదించినట్లు సమాచారం. సామాజిక సమీకరణాల ప్రాతిపదికన ఈ కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్‌, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, మహమ్మద్‌ ఫరీదుద్దీన్‌, ఆకుల లలిత ప‌ద‌వీ కాలం గ‌త నెల 3తో పూర్త‌యింది.

సాధారణంగా గడువు ముగిసే సమయానికంటే ముందే ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈసీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తుంది. అయితే, దేశవ్యాప్తంగా కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తీవ్రత నేపథ్యంలో అప్పట్లో ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదని స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని ప్రకటించింది. దీంతో జూన్‌ 3 నుంచి ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. అయితే, ఈ ఎన్నికలు లాంఛన ప్రాయమే కానున్నాయి. అధికార పార్టీ ఆరు ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోనుంది. అత్యధిక ఎమ్మెల్యేలు కలిగిన టీఆర్ఎస్‌కు చెందిన వారే తిరిగి ఎన్నకయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కొవిడ్ ఉధృతి తగ్గి అన్ని రకాల కార్యకలాపాలూ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల నిర్వహణ విషయమై రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందినట్టు సమాచారం. రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల నిర్వహణపై అభిప్రాయం చెప్పాలని కోరినట్టు తెలిసింది. ఈసీ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాక ఎన్నికల నిర్వహణపై ఈసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Show comments