Idream media
Idream media
“సాంబా రాస్కో.. వచ్చే ఎన్నికల్లో కూడా మేమే గెలుస్తాం. 95 నుంచి 105 సీట్లు సాధిస్తాం. మా దగ్గర అద్భుతమైన మంత్ర దండం ఉంది..” అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రకటించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఆర్నెళ్ల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడీ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్ అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెబుతున్నారు, ఆయన చేతిలో ఉన్న ఆ మంత్రదండం ఏంటనే దానిపై చర్చ జరుగుతోంది. ఆయన వ్యాఖ్యలు అధికారపార్టీకి ఉత్సాహాన్నిస్తే విపక్షాలను అయోమయంలో పడేశాయి.ఎందుకంటే.. గత ఎన్నికల్లో కూడా కేసీఆర్ చెప్పినట్లుగానే 2014 కంటే ఎక్కువ సీట్లలో టీఆర్ ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
తెలంగాణలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా రేగుతూనే ఉంది. కేంద్రంపై విసుర్లు వేస్తూ మళ్లీ ఇక్కడ అధికారంలోకి వచ్చేది తామేనని గంటాపథంగా చాటి చెప్పారు. ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది. ఆర్నెళ్ల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని కేసీఆర్ చెప్పారంటే ఏడాది ముందు నుంచే ఎన్నికల వేడి మొదలైనట్లే. అయితే, గత ఎన్నికల్లో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కేసీఆర్ మళ్లీ టికెట్లు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో మార్పులు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్లకు నామినేటెడ్ పదవుల ఆశ చూపి.. యువతకు ప్రాధాన్యం ఇస్తారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ 119 స్థానాలకు గాను కేసీఆర్ కేవలం అరవై మూడు స్థానాల్లో మాత్రమే టీఆర్ఎస్ సాధించింది. కాంగ్రెస్ ఇరవై రెండు స్థానాలకు గాను, టీడీపీ పదిహేను స్థానాలను కైవసం చేసుకుంది. మిగిలిన స్థానాల్లో ఇతర పార్టీలు గెలిచాయి. ఆ తర్వాత కేసీఆర్ తన ఆకర్షణతో టీడీపీని దాదాపు ఖాళీ చేశారు. కాంగ్రెస్, ఇతర పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ ఎస్ గూటికి చేరారు. దీంతో అనూహ్యంగా టీఆర్ ఎస్ బలం పుంజుకుంది. ఆ తర్వాతి ఎన్నికల్లో ఐదు స్థానాల్లో మినహా దాదాపు సిట్టింగ్ లకే టికెట్లు ఇచ్చి సంచలనం సృష్టించారు. గత ఎన్నికల కంటే మెజార్టీ స్థానాలను (88) సాధించుకున్నారు కూడా. ఆ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ 19 స్థానాలను పొందినా ఆ తర్వాత ఒక్కొక్కరు టీఆర్ ఎస్ గూటికి చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో పదిమంది శాసనసభ్యులు కూడా లేరు.
ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే 2023 ఎన్నికలకు పార్టీలన్నీ సిద్ధం అవుతున్నాయి. తాజాగా కేసీఆర్ అయితే అభ్యర్థుల ఎంపిక గురించి కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలు చాలా ఆసక్తిగా ఉంటాయని ముందే తెలిసిపోతుంది. గతంలో మాదిరిగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని మరో సారి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో నిజంగానే మంత్రం చేసినట్లుగానే ఓట్లను కొల్లగొట్టే కేసీఆర్.. మరోసారి మంత్ర దండం ప్రయోగిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి కేసీఆర్ ఏ మంత్రం వేస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
Also Read : ఏపీ రాజధాని పై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే..తేల్చి చెప్పిన కేంద్రం