‘స్వర్ణమూర్తి’ శిలాఫలకంపై కేసీఆర్‌ పేరు కానీ…

స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీగా పేర్కొంటున్న శ్రీరామానుజాచార్యుల భారీ విగ్రహావిష్కరణ శిలాఫలకంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరు లేకపోవడం తీవ్ర దుమారం రేపింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మరో వార్‌కు దారి తీసింది. అతిపెద్ద విగ్రహావిష్కరణకు ముందు క్షేత్రాన్ని సందర్శించిన కేసీఆర్‌.. ప్రారంభోత్సవానికి మాత్రం వెళ్లలేదు. ఆ తర్వాత కూడా అటువైపు చూడలేదు. తాజాగా ఆదివారం రాష్ట్రపతి ఆవిష్కరించిన స్వర్ణమూర్తి విగ్రహావిష్కరణ ఫలకంపై మాత్రం సీఎం పేరు కనిపించింది. అయినప్పటికీ కేసీఆర్‌ ముచ్చింతల్‌కు రాలేదు.

శ్రీరామానుజా సహస్రాబ్ది సమరోహ వేడుకలు సీఎం కేసీఆర్‌కు,ఆయన అమితంగా ఇష్టపడే చిన జీయర్‌స్వామి, మైహోం సంస్థల అధినేత హోం రామేశ్వరావు మధ్య దూరాన్ని పెంచినట్లుగా కనిపిస్తోంది. దీన్ని తగ్గించేందుకే అన్నట్లు దివ్యక్షేత్రానికి విచ్చేసిన కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ వద్ద సీఎం కేసీఆర్‌ పేరును చినజీయర్‌ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయన చొరవ కారణంగానే ఇక్కడ ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయని చెప్పారు. అయినా కేసీఆర్‌ అసంతృప్తిగానే ఉన్నట్లు ఆదివారం జరిగిన పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఆదివారం ఈ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు విచ్చేసిన రాష్ట్రపతి కోవింద్‌కు స్వాగతం పలికేందుకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు కేసీఆర్‌ వచ్చారు. అక్కడ నుంచి కొవింద్‌తో పాటు ముచ్చింతల్‌కు మాత్రం వెళ్లలేదు.

శ్రీరామానుజాచార్యుల 120 కిలోల బంగారు విగ్రహ ఆవిష్కరణ అనంతరం శిలాఫలకంపై కోవింద్‌, కేసీఆర్‌, చినజీయర్‌ పేర్లు కనిపించాయి. దీంతో వివాదం సద్దు మణిగినట్లే అని చాలామంది భావించారు. అలాగే ఎలాగైనా సహస్రాబ్ది ముగింపు వేడుకలకు సీఎం కేసీఆర్‌ను లేదా మంత్రి కేటీఆర్‌ను తీసుకురావాలని చినజీయర్‌, రామేశ్వరావు ప్రయత్నించినట్లు తెలిసింది. కానీ ముగింపు ఉత్సవాలకు కూడా కేసీఆర్ దూరంగానే ఉన్నారు.

Show comments