కందుకూరు ఎక్కడ నుంచి వచ్చిందో.. తిరిగి అక్కడికే..!

కొత్త జిల్లాల ఏర్పాటుకు ఏపీ సర్కార్‌ ముహూర్తం ఖరారు చేసింది. ఉగాది నుంచి కొత్త జిల్లాల కేంద్రంగా పాలన సాగబోతోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 26 కాబోతున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తున్న నేపథ్యంలో.. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల రాజకీయ, భౌగోళిక చరిత్ర పూర్తిగా మారిపోబోతోంది. ఇలాంటి నియోజకవర్గంలో ఒకటి ప్రకాశం జిల్లా కందుకూరు. ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా.. ఏడు ఒంగోలు లోక్‌సభ పరిధిలోనూ, నాలుగు గుంటూరు జిల్లా బాపట్ల లోక్‌సభ పరిధిలో ఉండగా.. కందుకూరు నెల్లూరు లోక్‌సభ పరిధిలో ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కందుకూరుకు ప్రకాశం జిల్లాతో ఉన్న బంధం ముగిసిపోనుంది.

ఎక్కడ నుంచి వచ్చిందో తిరిగి అక్కడికే..

స్కంధపురిగా పేరుగాంచిన కందుకూరు ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో భాగంగానే ఉండేది. 1970 ఫిబ్రవరి 2వ తేదీన ఒంగోలు (ప్రకాశం) జిల్లా ఆవిర్భవించింది. గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలలోని కొన్ని ప్రాంతాలను కలిపి ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా నుంచి అద్డంకి, ఒంగోలు, చీరాల తాలుకాలు, నెల్లూరు జిల్లా నుంచి కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి తాలుకాలు, కర్నూలు నుంచి మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు తాలుకాలను కలిపి ఒంగోలు కేంద్రంగా ఒంగోలు జిల్లాను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జిల్లాకు టంగుటూరి ప్రకాశం పంతులు పేరును 1972లో పెట్టారు. అర్థశతాబ్ధం తర్వాత మళ్లీ కందుకూరు నెల్లూరు జిల్లాలో భాగం కాబోతోంది.

భౌగోళికంగా కందుకూరుకు ఒంగోలు 45 కిలోమీటర్లు, నెల్లూరుకు 111 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ వల్ల.. ప్రజలకు అన్ని రకాల ప్రభుత్వ సేవలు తమ ప్రాంతాల్లోనే లభిస్తుండడంతో.. జిల్లా కేంద్రాలు దూరంగా ఉన్న పెద్ద సమస్య ఉండబోదు. జిల్లా కేంద్రం దూరమనే భావన అయితే ప్రజల్లో కొద్ది రోజుల పాటు ఉంటుంది.

కందుకూరు నెల్లూరు జిల్లాలోకి వెళ్లడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు మేలు, ప్రకాశం జిల్లాకు నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలో సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి అయిన ప్రస్తుత ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి ఇక పూర్తిగా ప్రకాశం జిల్లా రాజకీయాలకు దూరం కానున్నారు. అనుభవజ్ఞుడైన మహీధర్‌ రెడ్డి నెల్లూరు జిల్లాకు వెళ్లడం ప్రకాశం జిల్లాలో ఆ స్థానం భర్తీ కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రతిపాదిత రామాయపట్నం ఓడరేవు కూడా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలంలోనే ఉంది. ఈ ఓడరేవు కూడా నెల్లూరు జిల్లాకే సొంతంగా కానుంది. ఇప్పటికే ఎంతో వెనుకబడి ఉన్న ప్రకాశం జిల్లాకు ఈ పరిణామం తీరని నష్టం చేకూరుస్తుంది.

కందుకూరు నియోజకవర్గంలో సాగునీటికి ఏకైక ఆధారమైన రాళ్లపాడు ప్రాజెక్టుకు సోమశిల నుంచి నీరును తెచ్చుకోవడం ఇకపై సులువవుతుంది. రాళ్లపాడు కాలువకు నీళ్లు విడుదల చేయాలని ఒక హక్కుగా మహీధర్‌ రెడ్డి జిల్లా సమావేశాల్లో అడిగే అవకాశం లభిస్తుంది. లాభ, నష్టాలు ఎలా ఉన్నా.. కందుకూరుకు ప్రకాశం జిల్లాతో ఉన్న రాజకీయ, భౌగోళిక సంబంధం పూర్తిగా తెగిపోనుంది.

Show comments