రూ. 62వేలు ప్రజల విరాళాల ఖర్చుతో గెల్చిన ఎమ్మెల్యే ఇకలేరు

1978లో ప్రజలు విరాళాలుగా పోగేసి ఇచ్చిన రూ. 62వేలను ఖర్చుచేసి ఎమ్మెల్యేగా గెల్చిన పాటంశెట్టి అమ్మిరాజు మంగళవారం కన్నుమూసారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

సర్పంచ్‌ను నుంచి నేరుగా ఎమ్మెల్యే..

1972 నాటికి డిగ్రీ చదువుకున్న యువకుడు కావడంతో కడియపులంక గ్రామస్తులు ఈయన్ను ఆ గ్రామానికి సర్పంచ్‌ను చేసారు. రాష్ట్రంలోనే అతి పెద్ద నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న కడియం అప్పట్లో ఎస్సీకి రిజర్వుగా ఉండేది. రాజమహేంద్రవరం రూరల్‌ మండలంతో పాటు, కడియం, రాజానగరం మండలాలు, రాజమహేంద్రవరం సిటీలోని ఏడు వార్డులు కూడా కడియం నియోజకవర్గ పరిధిలో ఉండేవి. ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజనలో రాజానగరం ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది.

కాగా సర్పంచ్‌గా పనిచేస్తున్న అమ్మిరాజు నియోజకవర్గంలోని కులాల వారీ జనాభాలెక్కలు బైటకు తీసారు. సదరు లెక్కలతో అప్పట్లో ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసారు. దీనిపై విచారణ చేసిన ఎన్నికల కమిషన్‌ రిజర్వు స్థానం నుంచి కడియంను జనరల్‌కు మార్చారు. ఈ నేపథ్యంలో అదే సమయంలో జనతా పార్టీ నుంచి తనకు ఎమ్మెల్యే టికెట్టు ఇప్పించాల్సిందిగా అమ్మిరాజు దరకాస్తు పెట్టుకున్నారు. వారు టికెట్టు కేటాయించడంతో సర్పంచ్‌ నుంచి నేరుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

బత్తినపై విజయం..

మంత్రిగా పనిచేస్తూ, ఓటమి ఎరుగని నేతగా ఉన్న బత్తిన సుబ్బారావుపై 1978లో పాటంశెట్టి అమ్మిరాజు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మిరాజుకు మంచి గుర్తింపు వచ్చింది. అప్పట్లో తనకు జనతా పార్టీ టికెట్టు ఇచ్చిన విషయం కూడా న్యూస్‌పేపరు ద్వారా మాత్రమే తెలిసిందని అమ్మిరాజు చెబుతుండేవారు.

1980లో ముఖ్యమంత్రి మర్ని చెన్నారెడ్డి పట్టుబట్టడంతో అమ్మిరాజు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మొట్టమొదటగా తారు రోడ్లు వేయించింది అమ్మిరాజేనని చెబుతారు. ఆర్టీసీ జోనల్‌ సభ్యులుగా కూడా పనిచేసారు. అమ్మిరాజు మృతికి వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, పలు సంఘాల ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేసారు.

Show comments