iDreamPost
iDreamPost
ఎంత పెద్ద కొమ్ములు తిరిగిన నాయకుడైనా పోలీస్ పట్ల సంయమనంతోనే వ్యవహరిస్తుంటారు. వారిపై ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చినప్పుడు కూడా పదాలను క్రమపద్దతిలోనే వాడుతారు. ఎందుకంటే సమాజంలో పోలీస్‌కు ఉన్న విలువ దృష్ట్యా ఈ జాగ్రత్తలు పాటిస్తుండడం సహజం. తమకు కోపం వచ్చినప్పుడల్లా పోలీస్‌లపైనే విమర్శలు చేసే నేతలు, తీరా తమకేదైనా ఇబ్బంది తలెత్తితే మాత్రం మళ్ళీ ఆ పోలీస్‌వైపే చూస్తారనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి అంశాన్ని హైలెట్ చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు, నాయకులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు కులం, మతం, ప్రాంతం.. ఇలా దేన్నైనా వాడేస్తున్నారు. ప్రమాణాలు, నిరాహార దీక్షలు చేస్తున్నారు. హౌస్ అరెస్టు చేసేందుకు జూటూరు ఫాం హౌస్‌కు పోలీస్‌లు వచ్చినప్పుడు జేసీ దివాకర్‌రెడ్డి తన హద్దుదాటి ప్రవర్తించినట్లుగా విమర్శలు రేకెత్తుతున్నాయి. ట్రావెల్ బస్సుల గోల్‌మాల్ విషయం దగ్గర మొదలైన జేసీ కేసుల క్రమం నిన్నమొన్నటి వరకు కొనసాగుతూనే ఉంది. నిబంధనలు మీరి ఏదో ఒకటి చేయడం, ఆ తరువాత కేసుల్లో ఇరుక్కోవడం సహజంగా మారిపోయింది. ఈ క్రమంలోనే నేను మాట్లాడనబ్బా.. మాట్లాడితే కేసులు పెడతాండ్రు.. అంటూ జేసీ గతంలో పలు మీడియాల ముందు కూడా చెప్పడం కన్పించింది.
అయితే గతంలో తాను మాట్లాడిన మాటలకు భిన్నంగా తన ఫాంహౌస్‌లో ఇప్పుడు వ్యవహరించడం తీవ్రచర్చనీయాంశంగా మారింది. సదరు వీడియోలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ జేసీ చిందుతులతో పాటు నోటి దురుసు తగ్గించుకుని, పద్దతిగా మాట్లాడాలని డీఎస్పీ శ్రీనివాసులు చెప్పడం కూడా కన్పిస్తోంది. అధికారంలో లేనప్పుడే జేసీ పోలీస్‌లతో ఇలా ప్రవర్తిస్తున్నారంటే.. అధికారంలో ఉండగా ఎలా ఉండేవారో? నన్న చర్చకూడా సోషల్ మీడియా వేదికగా జోరుగానే నడుస్తోంది.
అయితే తాడిపత్రిలో జేసీకి, కేతిరెడ్డి పెద్దారెడ్డిల మద్య తలెత్తి వివాదం వేగంగా సర్దుమణగడానికి పోలీస్‌ల కార్యాచరణే కారణమన్న వాదనలు కూడా ఉన్నాయి. ఒక దశలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయేమోన్న స్థితి నుంచి పరిస్థితిని సాధారణంగా మార్చడంలో పోలీస్‌ల కృషికి అభినందనలు కూడా దక్కాయి. అయితే ఇటువంటివేమీ పట్టించుకోకుండా పోలీస్‌ల పట్ల జేసీ వ్యవహరించిన తీరును పలువురు ఆక్షేపిస్తున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీస్‌ల పట్లే ఇలా వ్యవహరిస్తే.. ఇక రక్షణ కల్పించాల్సింది ఎవరు? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజకీయాల్లో సీనియర్‌గా ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి మాత్రం ఈ విషయం విస్మరించినట్టున్నారంటున్నారు. పోలీస్‌లకు వ్యతిరేకంగానే జేసీ కూడా తాడిపత్రి తహసీల్దార్ కార్యాలయం వద్ద మౌనదీక్ష చేస్తానని ప్రకటించారు. దీంతో పోలీస్‌లు వారిని హౌస్ అరెస్టులో ఉంచారు.ఈ క్రమంలోనే ఫాంహౌస్ వద్ద ఉన్న పోలీస్‌లపై జేసీ దురుసు ప్రవర్తనకు తెరతీసారు.
ఏది ఏమైనా రాష్ట్రంలో పోలీస్‌లనే టీడీపీ నాయకులు టార్గెట్ చేస్తుండడం కూడా చర్చకు తెరతీస్తోంది. ఏ ఘటన జరిగినా దానికి సంబంధించిన ఆరోపణలు ప్రభుత్వం మీద, ఆ తరువాత నేరుగా పోలీస్‌ల మీదే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సంధిస్తున్నారు. ఇది ఒక రకంగా పోలీస్‌ల ఆత్మసై్థ్యర్యాన్ని దెబ్బతీయడంలో భాగంగానే ఈ వ్యవహారమంతా జరుగుతోందన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో జేసీ కూడా పోలీస్ పట్ల దురుసు ప్రవర్తనకు దిగారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనాప్పటికీ సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణలో శ్రమించే పోలీస్‌ల పట్ల టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరును మాత్రం సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలే వస్తున్నాయి.