వలంటీర్లపై ఎమ్మెల్యే జ‌క్కంపూడి ఔదార్యం

ఏపీలో వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. ప‌లు రాష్ట్రాలు కూడా ఏపీ బాట‌ను అనుస‌రిస్తున్నాయి. యాభై ఇళ్ల‌కో ప్ర‌భుత్వ‌ ప్ర‌తినిధి ఆలోచ‌న‌కు ప్ర‌ముఖులు సైతం ఫిదా అవుతున్నారు. వ‌లంటీర్లు అందుబాటులోకి వ‌చ్చాక ప్ర‌జ‌లు చాలా సుల‌భంగా ప్ర‌భుత్వ సేవ‌ల‌ను పొందుతున్నారు. క‌రోనా ఉధృతంగా ఉన్న స‌మ‌యంలో కూడా వ‌లంటీర్లు ఎక్క‌డా వెనుక‌డుగు వేయ‌లేదు. ప్ర‌భుత్వం సూచించిన విధంగా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ ప్ర‌జ‌ల‌కు త‌మ సేవ‌లు అందించారు. అందిస్తూనే ఉన్నారు. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఇత‌ర రాష్ట్రాలు, జిల్లాల్లో ఉండిపోయిన ల‌బ్దిదారుల‌కు వ‌ద్ద‌కు వెళ్లి మ‌రీ పింఛ‌ను డ‌బ్బులు, ఇత‌ర సేవ‌ల‌ను అందిస్తున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు మ‌హ‌మ్మారి బారిన ప‌డినా త‌గిన చికిత్స అందుకుని మ‌ళ్లీ విధుల్లో నిమ‌గ్న‌మ‌వుతున్నారు.

ప్ర‌భుత్వంపైన‌, జ‌గ‌న్ పైన ప్ర‌జ‌లు విప‌రీత‌మైన ఆద‌ర‌ణ చూప‌డానికి వ‌లంటీర్ వ్య‌వ‌స్థ కూడా ఓ కార‌ణం. అలాంటి వ‌లంటీర్ల విష‌యంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జక్కంపూడి రాజా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఓ వ‌లంటీర్ కుటుంబానికి త‌లెత్తిన ఆప‌ద‌ను దృష్టిలో పెట్టుకుని సొంత డబ్బుతో ప్రమాద భీమా  కల్పించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా వినూత్నంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని తాజాగా ప్రారంభించారు. వలంటీర్లకు  భీమా బాండ్లు అందజేశారు.

ఆ ఆలోచ‌న‌కు కార‌ణం ఇదే..

నియోజకవర్గంలోని సీతానగరం మండలం వంగలపూడి గ్రామ వలంటీర్‌ కోడెల్లి నీలారాణి గత నెలలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ప్ర‌స్తుతం ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అటువంటి దుస్థితి మరో వలంటీర్‌ కుటుంబానికి ఎదురుకాకూడదనే ఆలోచనతో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ ప్రమాద భీమా పథకానికి అంకురార్పణ చేశారు. ఈ పథకం ద్వారా సీతానగరం, కోరుకొండ, రాజానగరం మండలాల్లో 1,475 మంది గ్రామ వలంటీర్లకు ప్రమాద భీమా కల్పిస్తున్నారు. ఇందుకుగాను భీమా కంపెనీకి చెల్లించాల్సిన ప్రీమియాన్ని జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్‌ చెల్లిస్తుంది.

మ‌నోధైర్యం

ఇటువంటి కార్య‌క్ర‌మాలు వలంటీర్లకు మనోధైర్యాన్ని అందిస్తాయ‌ని కలెక్టర్‌ కొనియాడారు. పథకం ద్వారా ప్రమాదవశాత్తు మరణించినా లేదా అంగవైకల్యం ఏర్పడినా వలంటీర్లకు రూ.లక్ష పరిహారం అందుతుంది. అవయవాన్ని కోల్పోతే రూ.50 వేల పరిహారం ఇస్తారు. క‌ష్టాల్లో ఉన్న కుటుంబానికి కాస్తో, కూస్తో భీమా అండ‌గా ఉంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే చొర‌వ‌కు వ‌లంటీర్లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. బాండ్లు తీసుకుంటూ ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు.

Show comments