Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి జగన్ రాజీలేని పోరాటం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల అమలు కోసం అవకాశం వచ్చినప్పుడల్లా పట్టుపడుతూనే ఉన్నారు. తాజాగా ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయి ఏపీ అభివృద్ధికి అవసరమైన కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి విజ్ఞాపన పత్రం కూడా ముఖ్యమంత్రి అందించారు. ప్రధానంగా ప్రత్యేక హోదా ఆవశ్యకతను ఆయనకు సవివరంగా వివరించినట్లు తెలుస్తోంది.
కీలక అంశాల ప్రస్తావన
రాష్ట్ర అభివృద్ధిలో తలసరి ఆదాయం కీలక పాత్ర పోషిస్తుంది. 2015–16లో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.15,454 కోట్లు కాగా, ఏపీ తలసరి ఆదాయం రూ.8,979 కోట్లు మాత్రమే. ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయడానికి ఈ గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. అలాగే, భౌగోళికంగా చూస్తే తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ పెద్దది. ఇక్కడుండే జనాభా కూడా ఎక్కువ. ప్రజల అవసరాలను తీర్చాలంటే, వారికి సరైన సేవలు అందించాలంటే అంతే స్థాయిలో వ్యయం కూడా చేయాల్సి ఉంటుంది. విభజన వల్ల ఏపీ రాజధానిని కోల్పోయింది. మౌలిక సదుపాయాలను కోల్పోయింది. దీంతో రాష్ట్ర విభజన అనంతరం వాటి కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా హామీతోపాటు అనేక హామీలు ఇచ్చారు. వీటిని అమలు చేస్తే చాలా వరకు ఊరట లభిస్తుంది. వాటిలో చాలా హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. ఈ నేపథ్యంలో హోదా అవసరాన్ని మోడీకి జగన్ వివరించారు.
పోలవరం ప్రస్తావన
2013 నాటి భూసేకరణ చట్టం వల్ల పోలవరం ప్రాజెక్టు ఖర్చు గణనీయంగా పెరిగింది. ఏప్రిల్ 1, 2014 అంచనాల మేరకే పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ 2016లో తెలియజేసింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్టు వ్యయాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదు. అంతే కాకుండా అప్పటివరకూ ఇరిగేషన్ కాంపొనెంట్ రూపంలో చేసిన ఖర్చులనూ మినహాయించారు. దీని వల్ల పెరిగిన ప్రాజెక్టు అంచనాల భారం అంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్–90లో పేర్కొన్న స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ధం. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో వ్యయం కూడా పెరుగుతోంది. ప్రాజెక్టు ఖర్చులో అధిక భాగం 2013 నాటి భూసేకరణ చట్టం అమలుకే వ్యయం చేయాల్సి ఉంటుంది. చట్టం ప్రకారం ముంపు ప్రాంతాల నుంచి తరలించాల్సిన కుటుంబాలకు ప్యాకేజీలను కూడా విస్తరించాల్సి ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర భారం. ఈ క్రమంలో కేంద్రం అందించాల్సిన సాయంపై కూడా జగన్ మోడీతో చర్చించారు.
గతంలో ఇలా.. అందుకే..
అవశేష ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటును పూడుస్తామంటూ అప్పటి ప్రధానమంత్రి ఫిబ్రవరి 20, 2014న రాజ్యసభలో ప్రకటించారు. రాష్ట్ర విభజన జరిగే తేదీ నాటికి, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలు తేదీకి మధ్యనున్న రిసోర్స్ గ్యాప్‌ను 2014–15 కేంద్ర బడ్జెట్ ద్వారా భర్తీ చేస్తామని పేర్కొన్నారు. 2014 జూన్ నుంచి మార్చి 31, 2015 వరకూ ఉన్న రీసోర్స్ గ్యాప్ మొత్తం రూ.16,078.76 కోట్లని కాగ్ నిర్ధారించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రామాణిక వ్యయం పేరిట కొత్త పద్ధతిని తీసుకువచ్చింది. రీసోర్స్ గ్యాప్‌ను కేవలం రూ.4,117.89 కోట్లకు పరిమితం చేసింది. దీంతో నిధుల కొరత వల్ల 2014–15 ఆర్థిక సంవత్సరంలో చాలా బిల్లులను, పీఆర్సీ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేకపోయింది. 2014–15లో చెల్లించాల్సిన బిల్లులను, ఇతర బకాయిలను పరిగణలోకి తీసుకుంటే రెవిన్యూ లోటు రూ.22,948.76 కోట్లకు చేరింది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది కేవలం రూ.4,117.89 కోట్లు మాత్రమే. అందువల్ల చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న మిగిలిన రూ.18,830.87 కోట్లు చెల్లించి రాష్ట్రానికి అండగా నిలవాలని ప్రధానిని జగన్ కోరారు.
నిర్మలా సీతారామన్‌తో కూడా..
మోడీతో భేటీ తర్వాత కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా సీఎం జగన్ సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండింగ్ సమస్యలను సీఎం నివేదించారు. ఈ మేరకు విజ్ఞాపన పత్రం కూడా అందించారు. ప్రత్యేక హోదా, సవరించిన పోలవరం అంచనాలకు ఆమోదం, రెవిన్యూ లోటు భర్తీ, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, రుణపరిమితి, రాష్ట్రానికి ఇతోధికంగా ఆర్థిక సహాయం తదితర అంశాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చర్చించారు. నేడు కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా జగన్ సమావేశమై కీలక అంశాలపై చర్చించనున్నారు.
Also Read : ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ