వనమా కోసం వేట..!

భద్రాద్రి జిల్లా పాత పాల్వంచలో నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ప్రధాన నిందితుడైన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రరావు(రాఘవ) ఎక్కడ ఉన్నాడన్నది మిస్టరీగా మారింది. అతన్ని పాల్వంచ పోలీసులు గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో అరెస్టు చేశారని, కాదు.. కొత్తగూడెంలోనే అరెస్టు చేశారని ప్రచారం జరిగింది. కానీ, రాఘవను అరెస్టు చేయలేదని, అతని కోసం ఎనిమిది ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయని, ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తామని పేర్కొంటూ భద్రాద్రి ఎస్పీ గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఒక ప్రకటన విడుదల చేశారు.

రాఘవ అరెస్టుపై హైడ్రామా కొనసాగుతూనే ఉంది.

పోలీసులు మాత్రం అతని కోసం విశాఖపట్నం, ఏలూరు, హైదరాబాద్‌, రాజమండ్రి ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నట్టు చెబుతున్నారు. మరోవైపు రాఘవ ముఖ్య అనుచరులిద్దరిని గురువారం రాత్రి పాల్వంచ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఇంతకీ రాఘవ పరారీలో ఉన్నాడా? పోలీసులు అరెస్టు చేశారా? అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. పాల్వంచ ఫైనాన్స్‌ వ్యాపారి వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులో రాఘవ శుక్రవారం మణుగూరు ఏఎస్సీ ఎదుట హాజరు కావాల్సి ఉండగా.. అక్కడికి కూడా రాలేదు. 2021 జూలైౖ 30న చోటుచేసుకున్న వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులో రాఘవ ఏ1 నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

అయితే అప్పట్లో ఆ కేసులో కోర్టు నుంచి తెచ్చుకున్న నాట్‌ టు అరెస్టు ఆర్డర్‌తో.. అరెస్టు నుంచి అతడు తప్పించుకున్నాడు. అప్పటి నుంచి ఆ కేసు విచారణలో ఉంది. తాజాగా నాగరామకృష్ణ కుటుంబం మృతి ఘటనతో పాత కేసును కూడా పోలీసులు తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం అర్థరాత్రి పాత పాల్వంచలోని రాఘవ తండ్రి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నివాసానికి పోలీసులు నోటీస్‌ అంటించారు. ఫైనాన్షియర్‌ ఆత్మహత్య కేసులో విచారణకుగాను శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలలోపు మణుగూరు ఏఎస్సీ ఎదుట రాఘవ హాజరుకావాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు. కానీ, విచారణకు అతడు హాజరు కాలేదు.

టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెన్షన్‌‌

నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేంద్రను టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ సూచన మేరకు ఇందుకు సంబంధించి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్‌ నూకల నరేష్‌రెడ్డి ప్రకటన చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.

అరెస్ట్ అయ్యాడా?

అయితే ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ సరిహద్దు చింతలపూడి వద్ద అరెస్ట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది . దీనిపై పోలీసులు అధికారిక ప్రకటన చేయలేదు.

Also Read : కొందరి అధికారమదం..సామాన్యుల బలి

Show comments