Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలను పునర్విభజన చేస్తూ.. పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రాతిపదికన తీసుకుని 26 జిల్లాలు ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధమైన వేళ ఈ అంశం కూడా కోర్టుకు చేరబోతోందా..? అనే సందేహాలు ప్రతిపక్ష పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యల ద్వారా కలుగుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ఎవరి ప్రయోజనాల కోసం చేశారు, జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా లేదు.. అంటూ టీడీపీ నేతలు బోండా ఉమా, దేవినేని ఉమా, జీవీ ఆంజనేయులు సహా పలువురు నేతలు రకరకాల ప్రకటనలు చేస్తున్నారు.
జగన్ సర్కార్ తీసుకుంటున్న పలు విప్లవాత్మక నిర్ణయాల వల్ల రాజకీయంగా తాము ఇక పుంజుకోలేమనే భయంతో.. ఆయా నిర్ణయాలను అడ్డుకునేందుకు టీడీపీ ప్రత్యక్షంగా, పరోక్షంగా కోర్టుల్లో పిటీషన్లు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, పేదలకు ఇళ్ల నిర్మాణం, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మూడు రాజధానులు.. ఇలా అనేక అంశాలకు వ్యతిరేకంగా టీడీపీ కోర్టుల్లో పిటీషన్లు వేసింది. వీటి తరహాలోనే జిల్లాల ఏర్పాటును కూడా అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందా..? అనే సందేహాలు ఆ పార్టీ నేతల ప్రకటనల వల్ల కలుగుతున్నాయి.
కొత్త జిల్లాల ఏర్పాటు పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 26 కావడంతోపాటు.. కొత్తగా 15 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల జిల్లా కేంద్రాలు తమ ప్రాంతాలకు సమీపంగా ఉండడం వల్ల తమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధమైన వేళ.. నాణ్యమైన వైద్యం ఉచితంగా లభిస్తుందనే ఆకాంక్షతో ప్రజలున్నారు. జిల్లాల ఏర్పాటు వల్ల 26 జిల్లా కేంద్రాలుగా ఉండే పట్టణాల్లో మౌలిక వసతులు మెరుగుపడనున్నాయి. విద్య, వైద్యం, సేవలు, ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇవి అంతిమంగా ఆయా పట్టణాలు కాలక్రమేణా నగరాలుగా రూపుదిద్దుకునేందుకు బాటలు వేస్తాయి. ఇక రెవెన్యూ డివిజన్లుగా ఎంపికైన 15 పట్టణాల రూపురేఖలు కూడా మారనున్నాయి.
ఈ దిశగా ఆలోచిస్తున్న ప్రజలు.. పలు చోట్ల తమ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, తమ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలని, రెవెన్యూ డివిజన్‌గా మార్చాలని డిమాండ్లు చేస్తున్నారు. అనంతపురం జిల్లా హిందూపురం, వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట, ప్రకాశం జిల్లా మార్కాపురం వంటి ప్రాంతాల్లో జిల్లాల డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల అనేక ప్రయోజనాలు ఉండడంతో.. వీటి పట్ల ప్రజల్లో సానుకూలత లభిస్తోంది. అంతిమంగా ఈ నిర్ణయం జగన్ సర్కార్‌కు లాభిస్తోంది. ప్రజల్లో అధికార పార్టీకి మరింత బలం పెంచే కొత్త జిల్లాల ఏర్పాటును అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందనే అనుమానాలను అధికార పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే.. టీడీపీ మరింత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడం ఖాయం.
Also Read : జిల్లాలు పెంచితే ఎవరికి ప్రయోజనం ఉండాలి ఉమా?