కొత్త పార్టీ ఆలోచ‌న‌లో జ‌గ్గారెడ్డి?

టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఏం చేయాల‌నుకుంటున్నారు, కాంగ్రెస్ కు రాజీనామా చేస్తారా, రాజీనామా చేస్తే ఇత‌ర పార్టీల్లో చేర‌తారా లేక స్వ‌తంత్రంగానే ఉంటారా, వేరే పార్టీలో చేరాలంటే ఒక్క ఫోన్ కాల్ చాలు.. కానీ నాకు సింగిల్ ఆటంటే ఇష్టం.. తెలంగాణలో పార్టీ పెట్టేందుకు స్పేస్ ఉంద‌న్న వ్యాఖ్య‌ల వెనుక ఉద్దేశం ఏంటి.. అస‌లు కొంత కాలంగా జ‌గ్గారెడ్డి చేస్తున్న రాజ‌కీయాల ల‌క్ష్యం ఏంటి.. అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

జ‌గ్గారెడ్డి ఇప్పుడు రాజ‌కీయంగా హాట్ టాపిక్ గా మారారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీల‌కు ఆయ‌న నిన్న రాసిన లేఖ సారాంశం తెలిసిందే. ఈ లేఖ రాసిన‌ప్ప‌టి నుంచే తాను కాంగ్రెస్ లో లేన‌ట్లేనని చెప్పుకుంటూనే త్వ‌ర‌లో రాజీనామా విష‌యం వెల్ల‌డిస్తాన‌ని చెప్పారు. ఇప్పుడు తాజాగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌ను క‌లిసి త‌న ఆవేద‌న‌ను వెలిబుచ్చుతాన‌ని చెబుతున్నారు. నిన్న‌టి ఆగ్ర‌హం నేటి ఆవేద‌న‌గా మారింది. కాంగ్రెస్ కు రాజీనామా చేసి స్వ‌తంత్రంగా స‌త్తా చాటుతాన‌న్న అంశంపై వెన‌క్కి మళ్లిన‌ట్లా అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనపై కూడా స్పందిస్తూ ఆ సీఎం కాంగ్రెస్ తోనే ఉన్నారు క‌దా.. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌తో కేసీఆర్ క‌ల‌యిక త‌మ‌కు మంచిదే అన్న‌ట్లుగా వ్యాఖ్యానించారు.

యూపీయే కూటమి చీల్చాలి అని కేసీఆర్ అనుకున్నా అది అయ్యేపని కాదు. యూపీయే అనుబంధ పార్టీలతో కేసీఆర్ కలవడంతో బీజేపీ మనిషి అనే ముద్ర పోగొట్టుకోవాలి అని చూస్తున్నారన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సోనియా..రాహుల్ ల నిర్ణయం మేరకే పీసీసీలు పనిచేయాలి. బీజేపీ తో స్ట్రెయిట్ గా కొట్లాడుతున్నది కేవలం స్టాలిన్..మమతా బెనర్జీలే అంటూ మ‌రో ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. దమ్మున్న వాడు ఎవడు పార్టీ పెట్టినా తెలంగాణ‌లో స్పేస్ ఉంది అన్నారు. టీఆర్ఎస్‌లో చేరాలి అని అనుకుంటే సింగిల్ ఫోన్ చాలు అన్నారు జగ్గారెడ్డి. నా గేమ్ స్టార్ట్ అయ్యింది. సింగిల్ ఆట నాకు ఇష్టం. నా ఆట చూపిస్తానన్నారు జగ్గారెడ్డి. అంటే అన్ని పార్టీల‌నూ చూసిన జ‌గ్గారెడ్డి సొంత పార్టీ పెడ‌తార‌ని అనుకోవాలా అనే అనుమానాలూ క‌లుగుతున్నాయి.

భేటీలు ఇంకా ఏం లేవు. నాతో లొల్లి ఎందుకు..అందుకే బయటకు పంపండి అని అంటున్నా… అంటూనే అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీల అప్పాయింట్ మెంట్ ఇప్పిస్తే వాళ్ళకే నా ఆవేదన చెప్తా.. అప్పాయింట్ మెంట్ ఇప్పించకపోతే 15 రోజుల తర్వాత నా నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు.. ఇవ‌న్నీ ప‌రిశీలిస్తే జ‌గ్గారెడ్డి రాజ‌కీయాలు ఏంటో తెలియ‌డం లేదు. రాజ‌కీయంగా ఎలా ముందుకు వెళ్లాల‌నుకుంటున్నారో ఆయ‌న‌కైనా క్లారిటీ ఉందా అనే సందేహాలు కూడా వెలువ‌డుతున్నాయి. మ‌రి ఈ నేప‌థ్యంలో మున్ముందు ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి.

Also Read : జ‌గ్గారెడ్డి అల‌క పీసీసీ చీఫ్ కోస‌మా.. రేవంత్ పై వ్య‌తిరేక‌తా?

Show comments