Idream media
Idream media
తెలంగాణ కాంగ్రెస్ కు ఎప్పుడూ బలంగా ఉండే సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి కొద్దికాలంగా కంట్లో నలుసుగా మారారు. అడపాదడపా తన అసంతృప్తిని బయటపెడుతున్నారు. అలాగే.. పార్టీ మారతారనే సంకేతాలూ ఇస్తున్నారు. ఓ కార్యక్రమం నిమిత్తం సంగారెడ్డి వచ్చిన కేటీఆర్ తో అత్యధిక సన్నిహితంగా ఉంటూ.. టీఆర్ఎస్ లోకి జగ్గారెడ్డి? అనేలా మర్నాడు వార్తలు వచ్చేలా చేశారు. ఉత్తమ్ రాజీనామా అనంతరం తెలంగాణ చీఫ్ పదవికోసం పోటీపడ్డ వారిలో ఎంపీ కోమటిరెడ్డి, మధుయాష్కీ తదితరులతో పాటు జగ్గారెడ్డి కూడా ఉన్నారు. రేవంత్ ఎంపికయ్యాక కోమటిరెడ్డి తన అసహనాన్ని తీవ్రస్థాయిలో బహిరంగంగా వ్యక్తపరిచారు. ఆపై నిశ్శబ్దంగా ఉంటూ కాంగ్రెస్ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నారు.
జగ్గారెడ్డి మాత్రం అడపాదడపా తన అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆయన పార్టీకి పదవులకు రాజీనామా చేస్తానని ప్రకటించారు. శనివారం జగ్గారెడ్డి… కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. లేఖ రాసిన క్షణం నుంచి తాను పార్టీలో లేనన్నారు. సడన్‌గా వచ్చి లాబీయింగ్ చేస్తే ఎవరైనా పీసీసీ చీఫ్ కావొచ్చన్నారు ఎమ్మెల్యే. తనపై కోవర్ట్ అనే నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి పరువు కాపాడిన వ్యక్తిని తానే అన్నారు జగ్గారెడ్డి.
పార్టీ పరువు కాపాడిన నేను కోవర్టా ? అంటూ జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులు సరిదిద్దుకోమని చెబితే కోవర్ట్ అనే ముద్రవేస్తారా? అంటూ ఆగ్రహంతో మాట్లాడారు. గతంలో కూడా కాంగ్రెస్‌లో వర్గపోరు ఉండేదని.. అయితే అది ఎంతో హుందాగా ఉండేదన్నారు. కానీ ఇప్పుడు పార్టీలో అలాంటి పరిస్థితి లేదన్నారు. త్వరలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నుంచి చాలామంది బయటకు వెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు.
అయితే.. గతంలో కోమటిరెడ్డి చేసిన ఆరోపణలనే ఇప్పుడు జగ్గారెడ్డి చేయడం కొసమెరుపు. లాబీయింగ్ చేసి పీసీసీ తెచ్చుకున్నాడని రేవంత్ పై ఆరోపణలు చేశారు. మొత్తమ్మీద జగ్గారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ కాంగ్రెస్‌తో పాటు తెలంగాణ రాజకీయ వర్గాల్లో నెలకొంది. అయితే.. జగ్గారెడ్డి అధిష్ఠానానికి లేఖలు రాయడం ఇదే కొత్త కాదు. ఈ సంవత్సరం జనవరిలో కూడా జగ్గారెడ్డి లేఖ కాంగ్రెస్ లో దుమారం రేపింది. రైతులతో రచ్చబండ కార్యక్రమంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో చిచ్చు మొదలైంది.
కిసాన్ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ ఫాంహౌస్ ఉన్న ఎర్రవెల్లికి వెళ్తానని రేవంత్ ప్రకటించారు. జిల్లాకు చెందిన నేతలకు కనీస సమాచారం ఇవ్వకుండా, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తనకు తెలియకుండా పీసీసీ చీఫ్ ఎర్రవెల్లికి ఎలా వెళ్తారని జగ్గారెడ్డి బాహాటంగా నిలదీశారు. తర్వాత రేవంత్ వ్యవహారశైలి మార్చాలని, లేకుంటే పీసీసీ చీఫ్‌నే మార్చాలని కోరుతూ పార్టీ అధినేత్రి సోనియాకు లేఖ రాశారు. అయితే.. ఆ లేఖ మీడియాకు ఎలా లీకయిందో తనకు తెలియదని అప్పట్లో జగ్గారెడ్డి ప్రకటించారు.
పీసీసీ చీఫ్ కోసమో, రేవంత్ పై వ్యతిరేకతో తెలియదు కానీ.. ఇలా అడపాదడపా జగ్గారెడ్డి నిరసన స్వరం వినిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన నిరసన తీవ్రస్థాయికి చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. వాస్తవానికి ఏ పార్టీలోనూ నిలకడగా ఉన్న చరిత్ర జగ్గారెడ్డికి లేదు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ మూడు పార్టీలనూ మారి మళ్లీ 2014లో బీజేపీ అభ్యర్థిగా మెదక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2015లో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.
కెరీర్ ఆసాంతం పార్టీలు మారుతూ వచ్చిన జగ్గారెడ్డి.. కరడుగట్టిన కాంగ్రెస్ వాది వి.హనుమంతరావు లాంటి నేతలు ప్రాధేయపడినా మాటవినకపోవడం గమనార్హం. వీహెచ్ వెంట వెళ్లిన పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లి కిషన్ ఏకంగా జగ్గారెడ్డి కాళ్లు పట్టుకొని పార్టీలోనే ఉండాలని కోరినా ఫలితం రాలేదు. అయితే.. రాజీనామా చేస్తానని లేఖ రాశారు కానీ.. రాజీనామా చేయకపోవడం వెనుక మతలబు ఏంటో తెలియలేదు.
Also Read : చినజీయర్ కీలక వ్యాఖ్యలు.. శాంతి కల్యాణానికి కేసీఆర్ హాజరవుతారా?