థర్ట్‌ వేవ్‌ మొదలైంది.. భారత్‌ సిద్ధమైందా..?

కోవిడ్‌ మహమ్మారి మూడో సారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే అమెరికా, యూరప్, యూకే, ఆఫ్రికా దేశాల్లో మూడో వేవ్‌ ప్రారంభం కాగా.. తాజాగా దేశంలోనూ థర్ట్‌ వేవ్‌ మొదలైందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,41,988 మంది వైరస్‌ బారిన పడడం తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. అదే సమయంలో వైరస్‌ నుంచి 40,895 మంది కోలుకోగా.. 285 మంది ప్రాణాలు కోల్పోయారు. 

కేవలం వారం రోజుల వ్యవధిలో కేసులు భారీగా పెరగడం భారత్‌లో రాబోయే రోజుల్లో కోవిడ్‌ వ్యాప్తి ఎలా ఉండబోతోందో తెలియజేస్తోంది. డిసెంబర్‌ 28వ తేదీన దేశంలో రోజువారీ కేసులు.. దాదాపు 8 వేలు నమోదవగా.. జనవరి 1వ తేదీ నుంచి ఆ సంఖ్య క్రమేపీ పెరుగుతూ వస్తోంది. గడిచిన నాలుగు రోజుల్లో కొత్త కేసులు.. వరుసగా.. 33 వేలు, 55 వేలు, 91 వేలు, 1.41 లక్షల చొప్పన కేసులు నమోదవడం వైరస్‌ వ్యాప్తి ఎంత వేగంగా సాగుతుందో అర్థమవుతోంది.

ఇక కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు దేశంలో ఇప్పటి వరకు 3.071 నమోదయినట్లు భారత వైద్య విభాగం చెబుతోంది. ఈ మొత్తం కేసులు 27 రాష్ట్రాలలో నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ సోకిన వారిలో రాజస్థాన్‌లో ఒకరు మృతి చెందగా.. ఇప్పటి వరకు 1,203 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. కొత్త వేరియంట్‌ కేసుల నమోదులో మహారాష్ట్ర (876) మొదటి స్థానంలో, ఢిల్లీ (513) రెండో స్థానంలో ఉన్నాయి.

భారత్‌ సిద్ధంగా ఉందా..?

ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన కరోనా వేరియంట్లలో.. ఒమిక్రాన్‌ అన్నిటికన్నా వేగంగా వ్యాపిస్తోందని తెలిసింది. ప్రస్తుతం భారత్‌లో నమోదైన కేసుల్లో కొవిడ్‌ కేసులు ఎన్ని..? ఒమిక్రాన్‌ కేసులు ఎన్ని..? అనే లెక్కలు వాస్తవ పరిస్థితికి తగినట్లుగా ఉన్నాయా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించే ల్యాబ్‌లు దేశంలో తక్కువగా ఉన్నాయి. జీనోమ్‌ సీక్వెన్సీ ల్యాబ్‌ల ద్వారానే ఒమిక్రాన్‌ను గుర్తించగలుగుతున్నారు. ల్యాబ్‌లు తక్కువగా ఉండడంతోపాటు.. ఫలితాలు వచ్చేందుకు రెండు రోజుల సమయం పడుతోంది. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చేవారికి మాత్రమే ఒమిక్రాన్‌ పరీక్షలు చేస్తున్నారు. దేశీయంగా కొవిడ్‌ సోకిన వారికి ఒమిక్రాన్‌ పరీక్షలు చేయడం లేదు. ఇది అంతిమంగా తీవ్ర ముప్పునకు దారితీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : ప్రస్తుతానికి ముందుకే.. రేపు ఎలా ఉంటుందో..?

కోవిడ్‌ అంతులేని విషాదాన్ని నింపింది.. ఇంకా నింపుతోంది. ఈ మహమ్మారి దేశంలోకి వచ్చి.. రెండేళ్లు కావస్తోంది. మొదటి వేవ్‌.. రెండో వేవ్‌లను దేశం చవిచూసింది. ఇప్పటి వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 3.53 కోట్ల మంది కోవిడ్‌ బారిన పడ్డారు. ఇందులో 4,83 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. 3.44 కోట్ల మంది కోలుకున్నారు. ఈ గణాంకాలకు అదనంగా పలు రెట్లు ఎక్కువగా దేశ జనాభా వైరస్‌ బారినపడి ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి. భారీ ప్రాణ నష్టం, లాక్‌డౌన్లతో జనజీవనం స్తంభించినా.. మొదటి రెండు వేవ్‌ల నుంచి కేంద్ర ప్రభుత్వం మేల్కొనలేదనే చెప్పాలి. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అప్పటికప్పడు తాత్కాలిక చర్యలు చేపట్టడం తప్పా.. శాశ్వత ప్రాతిపదికన భారత ప్రభుత్వం వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వాలు.. తమకు ఉన్న ఆర్థిక వనరులలోనే ప్రభుత్వ ఆస్పత్రులు, సిబ్బంది ద్వారా ప్రజలకు వీలైనంత సేవలు అందిస్తున్నాయి.

వైరస్‌ను అరికట్టడంలో కీలక పాత్ర బాధితులను గుర్తించడమే. వైరస్‌ సోకిన వారిని, వారితో కాంటాక్ట్‌ అయిన వారిని గుర్తించి, ఐసోలేషన్‌ చేయడం వల్ల వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుంది. అయితే కొత్త వేరియంట్‌ను గుర్తించేందుకు అవసరమైన జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ల ఏర్పాటుపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన దాఖలాలు లేవు. అందుకే పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమకు తాముగా ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇటీవల కేరళ ప్రభుత్వం జీనోమ్‌ సీక్వెన్సీ ల్యాబ్‌ను ఏర్పాటు చేయగా.. ఈ వారం మొదటలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విజయవాడలో ల్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చింది. రాబోయే రోజుల్లో ఒమిక్రాన్‌ పరీక్షలు ఎక్కువగా నిర్వహించేందుకు.. గుంటూరు, తిరుపతి, విశాఖల్లో మరో మూడు ల్యాబ్ లు ఏర్పాటు చేయతలపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా జీనోమ్‌ సీక్వెన్సీ ల్యాబ్‌లు వీలైనంత త్వరగా, ఎక్కువగా ఏర్పాటు చేయడం వల్ల మాత్రమే థర్ట్‌ వేవ్‌ను ఎదుర్కోగలం.

Also Read : థర్డ్ వేవ్.. ఏపీలో పాక్షిక లాక్ డౌన్.. మార్గదర్శకాలు విడుదల

Show comments