వ‌చ్చే నెల‌లోనే మార్కోట్లోకి ఎల్ ఐ సీ?

ప్ర‌భుత్వ ఆస్తుల విక్ర‌యం, సంస్థ‌ల ప్రైవేటీక‌ర‌ణకు కేంద్రం వ‌డివ‌డిగా ముందుకు వెళ్తున్నట్లు తాజా బడ్జెట్ కూడా తెలియ‌జేస్తోంది. కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌సంగంలో ఆదాయ మార్గాల‌పై ప్ర‌భుత్వం ప్ర‌ధానంగా దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అందుకు ప్ర‌భుత్వ సంస్థ‌ల‌పైనే ఆధార‌ప‌డ్డ‌ట్లుగా క‌నిపిస్తోంది. దీనిలో భాగంగా ఇప్ప‌టికే ఎయిర్ ఇండియా అమ్మ‌కం పూర్తయిన‌ట్లు సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. అతిపెద్ద ప్ర‌భుత్వ రంగ భీమా సంస్థ అయిన ఎల్ ఐ సీ ని ప్రైవేటీక‌రించేందుకు రెండేళ్లుగా కేంద్రం ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు దానిపై క‌స‌ర‌త్తు పూర్తి చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. అతి త్వ‌ర‌లోనే ఐపీఓ ద్వారా ఎల్ ఐ సీని ప్రైవేటీక‌రించ‌నున్న‌ట్లు తాజాగా నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు. ఎల్‌ఐసీలో వాటా విక్రయం ద్వారా రూ.లక్ష కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిన భారత జీవిత భీమా.. ప్రైవేటు చేతుల్లోకి వెళ్తే ఎటువంటి ఒడిదుడుకుల‌కు లోన‌వుతుంద‌నే సందేహాలు చాలా మందిని వెంటాడుతున్నాయి. 1956, సెప్టెంబరు 1 న భీమా రంగాన్ని జాతీయం చేయడం కోసం పార్లమెంటులో చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఈ సంస్థ‌కు అంకురార్పణ జరిగింది. సుమారు 245 భీమా సంస్థలు, ప్రావిడెంట్ సంస్థలను క‌లుపుకుని లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గా ఏర్పడింది. ఇప్పుడు ఈ సంస్థ పబ్లిక్‌ ఇష్యూ కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

మార్కెట్‌ నియంత్రణా సంస్థ (సెబీ) అనుమతి కోసం సమర్పించాల్సిన ప్రాథమిక పత్రాల రూపకల్పనలో నిమగ్నమైనట్లు ‘పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ’ విభాగం కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే గ‌త నెల‌లోనే ప్ర‌క‌టించారు. ఫిబ్రవరి మొదటి వారంలో సెబీకి సమర్పించబోయే ఈ పత్రాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు సెబీతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ఒకసారి పత్రాలు అందజేసిన తర్వాత సెబీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతో ఐపీఓ ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇప్పుడు సీతారామ‌న్ ప్ర‌క‌ట‌న ద్వారా దాదాపు వ‌చ్చే నెల‌లోనే ఎల్ ఐ సీ ఐపీఓ ప్రారంభం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అదే జ‌రిగితే భారత్‌లో అతిపెద్ద ఐపీఓగా ఎల్‌ఐసీ చరిత్ర సృష్టించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని నిపుణులు భావిస్తున్నారు. ఎల్‌ఐసీ ఐపీఓకి వీలుగా లైఫ్‌ ఇన్స్యూరెన్స్  కార్పొరేషన్‌ చట్టానికి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మార్పులు చేసింది. అవన్నీ గత ఏడాది జూన్‌ 30 నుంచే అమల్లోకి వచ్చాయి. ఎక్స్ఛేంజీల్లో నమోదు కావడానికి అనువుగా, లిస్టింగ్‌ నిబంధనలు అనుసరించి బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లను నియమించింది. ఛైర్మన్‌ పదవీ విరమణ వయసు నిబంధనలనూ సవరించింది. మరోవైపు ఐపీఓ పరిమాణంలో 10 శాతం వరకు పాలసీదార్లకు కేటాయించనుంది. ఐపీఓలో పాల్గొనాలనుకునే పాలసీదార్లు పాన్‌ ను అప్‌డేట్‌ చేయాలని కోరింది.

Also Read : బడ్జెట్‌ 2022–23 : తొలిసారి ప్రకృతి వ్యవసాయం మాట

Show comments