Idream media
Idream media
ఆఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ నూతన వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికించింది. ఇంతకు ముందు వచ్చిన వేరియంట్ల కన్నా.. ఇది అత్యంత వేగంగా వ్యాపించడంతో.. ప్రపంచ దేశాలలో రోజు వారీ కేసులు గరిష్టసంఖ్యలో నమోదయ్యాయి. ముఖ్యంగా ఆఫ్రికా, యూరప్, అమెరికా, ఇంగ్లాండ్, కెనడా దేశాలు ఒమిక్రాన్ దెబ్బకు విలవిలలాడాయి. అమెరికాలో ఒక్క రోజులోనే 25 లక్షల కేసులు నమోదవడం ఒమిక్రాన్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో చూపించింది. ఒమిక్రాన్ భయం భారతదేశాన్ని కూడా వెంటాడింది. కరోనా థర్డ్ వేవ్ ఒమిక్రాన్‌తో మొదలవుతుందని, రోజువారీ కేసులు 16 నుంచి 20 లక్షల మధ్య నమోదవుతాయని నిపుణులు అంచనాలు వేయడంతో ప్రజలు, ప్రభుత్వాలు ఆందోళన పడ్డాయి.
అనుకున్నట్లుగానే నూతన ఏడాది ప్రారంభంలోనే ఒమిక్రాన్ దేశంలో జూలు విదిల్చింది. విదేశీ ప్రయాణికుల నుంచి దిగుమతి అయిన ఒమిక్రాన్.. దేశంలో వేగంగా వ్యాపించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ కరోనా ఆంక్షలు విధించాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాలలోనూ ఆంక్షలు, నైట్ కర్ఫ్యూలు మొదలయ్యాయి. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు సంక్రాంతి సెలవులను పలుదఫాలుగా జనవరి నెలాఖరు వరకు పొడిగించింది. ఏపీలోనూ పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా.. పిల్లల చదువులు, ఒమిక్రాన్ వైరస్‌పై అవగాహన, ఎదుర్కొనేందుకు సిద్ధమవడంతో ప్రభుత్వం పాఠశాలలను కొనసాగించేందుకే మొగ్గుచూపింది.
దేశంలో రోజువారీ కరోనా కేసులు డిసెంబర్‌లో ఐదారువేలు ఉండగా.. జనవరి ప్రారంభం నుంచి ఎక్కువగా నమోదవడం ప్రారంభమయ్యాయి. రోజుల వ్యవధిలోనే ఆ సంఖ్య లక్ష దాటింది. జనవరి నెలలో కరోనా కేసులు గరిష్టంగా మూడు లక్షల మార్క్‌ను చేరుకున్నాయి. ఆ తర్వాత మెల్లగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రోజు వారీ కేసులు రెండు నుంచి రెండున్నర లక్షల మధ్య నమోదవుతున్నాయి. ఒమిక్రాన్‌ను నిర్థారించే ల్యాబ్‌లు దేశంలో ఎక్కువగా లేకపోయినా.. మొత్తం నమోదయ్యే కేసుల్లో దాదాపు 80 శాతం ఒమిక్రాన్‌వే అని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.
రెండో వేవ్‌లో వచ్చిన డెల్టా వేరియంట్ కంటే.. ఒమిక్రాన్ చాలా బలహీనమైన వైరస్ కావడంతో.. ఇది సోకిన వారు కనిష్టంగా మూడు గరిష్టంగా ఐదు రోజుల్లో కోలుకుంటున్నారు. తేలికపాటి లక్షణాలు కనిపిస్తుండడంతో.. ఒమిక్రాన్ సోకిన వారు ఎలాంటి ఇబ్బంది పడడం లేదు. ఆస్పత్రికి వెళ్లే అవసరం కూడా లేకుండాపోయింది. వ్యాక్సిన్ తీసుకోవడం కూడా ఒమిక్రాన్ నుంచి వేగంగా బయటపడేందుకు ఓ కారణమైంది. మొత్తం మీద కరోనా భయాలు దేశంలో తగ్గిపోయాయి. తెలంగాణ సర్కార్ ఈ రోజు పాఠశాలలను తిరిగి ప్రారంభించడం ఇందుకు నిదర్శనం. ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకుంటోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా అన్నారు. అందుకు ఆమె జనవరి నెల జీఎస్టీ వసూళ్లను చూపారు. జీఎస్టీ చరిత్రలో తొలిసారి ఒక నెలలో 1.43 లక్షల కోట్ల రూపాయలు వసూలవడం విశేషం. కరోనా థర్ట్ వేవ్ విజృంభించిన జనవరి నెలలోనే ఈ స్థాయిలో పన్ను వసూళ్లు కావడం కరోనా భయాల నుంచి దేశం బయటపడినట్లుగానే భావించవచ్చు.
Also Read : థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఏపీ సిద్ధమైందిలా..!