Idream media
Idream media
26 ఏళ్ల క్రితం తిరుపతి తిలక్ రోడ్‌లో మార్నింగ్ వాక్ వెళుతుంటే దూరంగా షామియాన కనిపించింది. దగ్గరికెళితే ఫూలదండలు, అగర్బత్తీల మధ్య NTR ఫోటో, అక్కడ మౌనంగా కొందరు కన్నీళ్లతో వున్నారు. మెదడంతా శూన్యం. ఒక యంత్రంలా నడుస్తూ ఇల్లు చేరాను. కొన్ని గంటలు నిశ్శబ్దంగా వుండిపోయాను.
NTR, ఆ పేరు ఎప్పుడు విన్నానో గుర్తు లేదు. బహుశా అమ్మానాన్న అవ్వాతాతలతో పాటు పలకడం నేర్చుకుని వుంటాను. ఊహ వచ్చేసరికి భామా విజయం, పిడుగురాముడు చూసినట్టు గుర్తు. బళ్లారిలో వరకట్నం చూశాను. ఏం గుర్తు లేదు కానీ NTR కొడితే విలన్ మేడపై నుంచి దూకేస్తాడు. అది మాత్రం గుర్తు.
గండికోట రహస్యంలో ఆయన వేలితో ముక్కుని నొక్కే మానరిజాన్ని అనుకరించే ప్రయత్నంలో చీమిడి కార్చుకున్న సందర్భాలున్నాయి. భలే తమ్ముడులో రఫీ ముక్కుతో పాడిన ఎంతవారలైనా పాటని స్కూల్‌లో ఇమిటేట్ చేసేవాన్ని. కోడలుదిద్దిన కాపురంలో సత్యసాయిబాబాని ఎగతాళి చేశాడని వూళ్లో అందరూ అనుకునేవాళ్లు.
NTR కొడితే ఎంత పహిల్వాన్ అయినా మట్టి కరవాల్సిందే. చాలాసార్లు కొట్టడు, వూరికే చెయ్యి విదిలిస్తాడు. ఒక చెయ్యి వెనక్కి పెట్టుకుని కత్తి యుద్ధం చేస్తే రాజనాల రెండు చేతులూ పని చేయవు. దుర్యోధనుడిగా వేస్తే విలన్‌ని కూడా ప్రేమించాం. రావణాసురుడిగా కనిపిస్తే దుర్మార్గుల్లో కూడా మంచితనం వుంటుందని నమ్మాం. పురాణ జ్ఞానమంతా ఆయన సినిమాల పుణ్యమే.
దీక్ష, వాడేవీడు, అదృష్టజాతకుడు లాంటి పరమ బోర్ సినిమాల్ని కూడా భరించాం. నేల మీద, బెంచీల్లో ఇరుక్కుని , నల్లులు పిర్రల్ని పీక్కుతింటుంటే సిగరెట్ పొగల మధ్య దగ్గుతూ, క్యూలో కిందామీదా , నోరెళ్ల బెట్టి మరీ చూశాం.
ఇంటర్ క్లాసుల్ని ఎగ్గొడుతూ అడవిరాముడులో డబ్బులన్నీ పారేసుకున్నాం. యమగోలలో ఈ వయసులో ఇవేం స్టెప్పులని తిట్టుకుంటూనే ముచ్చటగా చూశాం. సర్దార్‌పాపారాయుడు, బొబ్బిలిపులిలో ఆవేశంగా వూగిపోయాం.
లాయర్ విశ్వనాథ్ కటౌట్‌కి మిత్రుడు ఉపేంద్రరెడ్డి పాలాభిషేకం చేశాడు (NTR వీరభక్తుడైన ఈయన తర్వాత రోజుల్లో కాంగ్రెస్ తరపున రాయదుర్గం మున్సిపల్ చైర్మన్ కావడం విచిత్రం). అనంతపురం త్రివేణి టాకీస్ ఆవరణలో పాలధారల్లో ఒకరిద్దరు జారి కూడా పడ్డారు.
ఎన్‌కౌంటర్ , కమెండోల్లో కాంగ్రెస్‌ని ఏకిపారేస్తుంటే , కొంచెం కొంచెం రాజకీయాలు అర్థమవుతున్న దశలో NTR పార్టీ పెట్టాడు. దొంగ ఓట్లు వేసి వేయించాం. ఆయన ముఖ్యమంత్రి అయినపుడు సొసైటీ మొత్తం సినిమాల్లో జరిగినట్టు మారిపోతుందని నమ్మాం.
పిచ్చి నిర్ణయాల్ని కూడా అయిష్టంగానే సమర్థించాం. 84లో ఆయన్ని దింపేసినపుడు అనంతపురం ఒక రణరంగం. ఓల్డ్‌టౌన్, పోస్టాఫీస్ దగ్గర కాల్పులు జరుగుతున్నాయని తెలిసి చూడడానికి వెళ్లిన కుర్రతనం. కళ్ల ముందే లేపాక్షి ఎంపోరియం , సూపర్‌బజార్ లూఠీలు జరిగాయి. పోలీస్ బూట్ల చప్పుడు కింద జీవితం ఎలా వుంటుందో తెలిసింది. మళ్లీ ముఖ్యమంత్రి అయినపుడు సంబరాలు.
85లో ఎన్నికలు. పాలనాపరంగా ఎన్నో తప్పులు, వైఫల్యాలు. అంత్యక్రియలకి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్‌ని బతికించాడు. 89 నుంచి 94 వరకూ కాంగ్రెస్ తన స్టయిల్‌ని రిపీట్ చేసుకుంది.
మేజర్‌చంద్రకాంత్ ఊరేగింపు చూడడానికి వేలాది మంది మధ్య తిరుపతి ద్వారకా హోటల్ వద్ద ఎదురు చూశాను. నగ్మాని చూడాల్సిన వయసు. కానీ NTRనే ఎక్కువ సేపు చూశాను. ఆయన ఆకర్షణ అది. ఆంధ్రజ్యోతి నైట్ షిప్ట్‌లో మేజర్ చంద్రకాంత్ వార్త కోసం ఎదురుచూస్తూ వుండగా లక్ష్మీపార్వతి అనే మహిళని NTR పరిచయం చేశాడనే కొత్త ట్విస్ట్.
1994లో లక్ష్మీపార్వతితో కలిసి NTR ఎన్నికల ప్రచారానికొస్తే తిరుపతి అంతా జనసముద్రం. మళ్లీ అధికారం. తరువాత చంద్రబాబు వెన్నుపోటు.
తమ్ముళ్లే ఆయన మీద చెప్పులు విసిరారు. అవమానంతో కుంగిపోయాడు. ఒక ఉజ్వలమైన యుగం, ఒక దురదృష్టకాలం రెండింటిని చూశాడు.
తెలుగు జీవితాల్లో , రాజకీయాల్లో NTR ఒక పచ్చబొట్టు. చెరపడం, మరిచిపోవడం కష్టం.