Idream media
Idream media
సినిమా టికెట్ల విక్రయాలపై ఏపీ తీసుకొచ్చిన నూతన విధానాన్ని ఎందరో స్వాగతిస్తుండగా.. కొందరు వ్యతిరేకిస్తున్నారు. విపక్షాలైతే దీన్ని పెద్ద రాద్దాంతం చేస్తున్నాయి. ఇంకొందరు ప్రభుత్వ తీరును తప్పుబడుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై తాజాగా హైకోర్టులో విచారణ జరిగింది. ఆన్‌లైన్ విధానంలో టికెట్లు విక్రయించడంలో తప్పేముందని ఈ సందర్భంగా ధర్మాసనం పిటిషనర్లను ప్రశ్నించింది. పన్ను ఎగవేతను నిలువరించేందుకే ఈ విధానమని పేర్కొంది. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, ఫిల్మ్ టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు నోటీసులు జారీ చేసింది. వ్యాజ్యంపై విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. ఆన్‌లైన్ విధానంలో సినిమా టికెట్లు విక్రయించేందుకు వీలుకల్పిస్తూ, టికెట్ల విక్రయాన్ని ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ కార్పొరేషన్‌కు అప్పగిస్తూ గత ఏడాది డిసెంబరు 17న ప్రభుత్వం జీవో 142ను జారీ చేసింది. అయితే, ఈ జీవోను సవాల్ చేస్తూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్ తరపున మంజీత్ సింగ్, మరొకరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది డి. ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు చట్టంలోని సెక్షన్ 5(ఏ)ను కొత్తగా చేర్చారని తెలిపారు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వ్యాజ్యం వేశామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఆన్‌లైన్ విధానంలో టికెట్లు విక్రయించడంలో తప్పేముందని ప్రశ్నించింది. పన్ను ఎగవేతను నిలువరించేందుకే ఈ విధానమని పేర్కొంది.
ప్రకాశ్ రెడ్డి బదులిస్తూ.. ప్రభుత్వమే సినిమా టికెట్లు విక్రయిస్తే గుత్తాధిపత్యానికి దారితీస్తుందన్నారు. ఇప్పటి వరకు థియేటర్ల వద్ద పారదర్శక విధానంలో నేరుగా టికెట్లు విక్రయిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం థియేటర్ యాజమాన్యాల ప్రాథమిక హక్కులను హరిస్తుందన్నారు. చాలా మంది ప్రేక్షకులకు ఆన్‌లైన్ విధానంలో టికెట్లు కొనుగోలు చేయడం తెలియదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఆన్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తే హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతుందని ప్రశ్నించింది. ప్రపంచమంతా ఆన్‌లైన్ విధానంలో పనిచేస్తోందని, సినిమా చూడాలనుకునేవారు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోగలరని వ్యాఖ్యానించింది. ఆన్‌లైన్ గురించి ప్రజలకు తెలియదు అనుకోవడం పొరపాటని పేర్కొంది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని తెలిపింది.
Also Read : ఏపీ బాటలోనే టికెటింగ్ వ్యవస్థ.. పాపం నోట్లో వెలక్కాయ పడ్డట్టుందే!