ఫ్ర‌స్టేష‌న్ తో ఫ‌లితాలు వ‌స్తాయా?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడుకు జీవ‌న్మ‌ర‌ణ స‌మస్య‌గా మారింది. శ‌ప‌థం ఓ వైపు.. త‌గ్గిపోతున్న పార్టీ ప్రాభ‌వం మ‌రో వైపు.. ఆయ‌న‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. తాజాగా పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో అనుబంధ విభాగాల అధ్యక్షులతో జ‌రిగిన‌ సమావేశం లో ఆయ‌న మాట్లాడిన తీరు, దీనిపై పార్టీ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌లే ఇందుకు నిద‌ర్శ‌నం.

ఎన్నికలకు ఇంకా దాదాపు రెండున్నరేళ్ల స‌మ‌యం ఉంది. అయితే.. పార్టీ ఘోరంగా దెబ్బ‌తినేందుకు కూడా రెండున్న‌రేళ్ల స‌మ‌య‌మే ప‌ట్టింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల లోపు మిగిలిన స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుని పార్టీని ప‌ట్టాలెక్కించాల‌ని తెగ తాప‌త్ర‌య‌ప‌డుతున్నారు చంద్ర‌బాబు. అయితే.. ఈ క్ర‌మంలో పార్టీలో లుకలుకలు బయటపడటం.. టీడీపీకి మూలిగే నక్కపై తాటిపండు చందంగా మారుతోంది. ఒక‌రిపై మ‌రొక‌రు ఫిర్యాదులు చేసుకోవ‌డం చంద్రబాబుకు కూడా తలనొప్పి అవుతోంది. దీంతో జగన్ బలాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి వ్యూహాలు రచించాలా.. పార్టీ నాయకులు, కార్యకర్తలను సముదాయించాలో తెలీని పరిస్థితి లో ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

ఆయ‌న తాజాగా పార్టీలోని 20 అనుబంధ విభాగాల బలోపేతంపై చర్చించారు. పార్టీ అనుబంధ కమిటీల పని తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా పోరాటాలు చేయాలని సూచించారు. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడకుండా పార్టీ కార్యాలయం చుట్టూ తిరిగి ఉపయోగం లేదన్నారు. ఒక‌రిపై మ‌రొక‌రు ఫిర్యాదులు మాని ప‌నిచేయాల‌న్నారు. అనుబంధ విభాగాల పని తీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తానని చెప్పారు.

ఎవరెవరు ఏమి పని చేస్తున్నారో తనకు మొత్తం తెలుసని, పదవులు తీసుకుని క్రియాశీలకంగా వ్యవహరించకుంటే చర్యలు తప్పవని వార్నింగ్ కూడా ఇచ్చారు. కొందరు పత్రికా ప్రకటనలకే పరిమితమవుతున్నారంటూ చంద్రబాబు మండిపడ్డారు. రెండు, మూడు విభాగాలు తప్ప మిగతా అనుబంధ కమిటీలు ప్రజల్లోకి వెళ్లలేక పోతున్నాయన్నారు.

ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు ఇచ్చిన వార్నింగ్ ల‌పై త‌మ్ముళ్లు చ‌ర్చించుకుంటున్నారు. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల్సింది పోయి.. ఇలా మాట్లాడుతుండ‌డం కొత్త‌గా అనిపిస్తోంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. మంచి ఫ‌లితాల సంగ‌తి అటుంచితే.. ఫ్ర‌స్టేష‌న్ లో మాట్లాడితే మ‌రింత న‌ష్టం వాటిల్లుతుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Also Read : పంచాయతీ ఎన్నికల్లో అరాచకాలు జరిగాయట!

Show comments