Idream media
Idream media
అస్థిర ప్రభుత్వాలు.. అంతకుమించి రాజకీయ మార్పులు చోటుచేసుకునే ఉత్తరాఖండ్, గోవాల్లో సోమవారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. రెండు రాష్ట్రాల్లో అన్ని సీట్లకూ ఒకే విడతలో ఓటింగ్ నిర్వహించనున్నారు. 70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో అన్ని పార్టీల నుంచి 632 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5 వరకు సాగనుంది. దేవ భూమిగా పేరుగాంచిన ఈ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ, ఎస్పీ, బీఎస్పీ కూడా బరిలో ఉన్నా.. అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.
రాష్ట్రం ఆవిర్భవించిన 20 ఏళ్లలో 11 మంది సీఎంలుగా వ్యవహరించిన చరిత్ర ఉత్తరాఖండ్‌ది. అంతేగాక ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి గెలుపొందలేదు. ఈ రికార్డును తిరగరాస్తూ మళ్లీ ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ భావిస్తోంది. పోలింగ్ చివరిరోజు సీఎం పుష్కర్ సింగ్ ధామి.. ఉమ్మడి పౌర స్మృతి అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇక కాంగ్రెస్ మాజీ సీఎం హరీశ్ రావత్ ఆధ్వర్యంలో అమీతుమీకి సిద్ధమైంది.
మరోవైపు 40 సీట్లున్న గోవాలో అన్ని పార్టీల తరఫున 301 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇక్కడ కూడా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యనే ముఖాముఖి సాగుతోంది. అయితే, కాంగ్రెస్.. గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ)తో, తృణమూల్ కాంగ్రెస్.. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ)తో కూటమి కట్టాయి. శివసేన.. ఎన్సీపీతో కలిసి, ఆప్ ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. కాగా, మాజీ సీఎం, దివంగత కేంద్ర మంత్రి మనోహర్ పర్రీకర్ కుమారుడు ఉత్పల్ పర్రీకర్ తమకు పట్టున్న పనాజీ స్థానం ఉంచి స్వతంత్రుడిగా పోటీకి దిగడం ఆసక్తి రేపుతోంది.
వీటితో పాటు, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో 55 స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రెండో దశ పోలింగ్ జరుగనుంది. 586 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాంపూర్, బరేలీ సహా 9 జిల్లాల్లోని ఈ సీట్లలో కొన్ని రోహిల్‌ఖండ్ ప్రాంతం పరిధిలోకి రానున్నాయి. సమాజ్‌వాదీ సీనియర్ నేత ఆజం ఖాన్ రాంపూర్‌లో, ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజం స్వార్‌లో పోటీ చేస్తున్నారు. అన్నింటికి మించి ఇది ఎస్పీ, ముస్లిం ప్రాబల్య ప్రాంతం. బీజేపీ హవా సాగిన గత ఎన్నికల్లో ఆ పార్టీ ఇక్కడ 38 సీట్లను గెల్చుకోగా, ఎస్పీ గట్టి పోటీ ఇచ్చి 15 (వీరిలో పదిమంది ముస్లింలే) సీట్లలో నెగ్గింది.
Also Read : అవసరమైతే జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ.. : కేసీఆర్