Yerragondapalem Ex MLA, Palaparthi David Raju, TDP – నమ్మలేని నిజం.. టీడీపీలో చేరేందుకు ఏడాది నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రయత్నాలు..!

నిజంగా ఇది విచిత్రమే. ఓ మాజీ ఎమ్మెల్యే, పైగా సీనియర్‌. అధికార పార్టీకి రాజీనామా కూడా చేశారు. టీడీపీలో చేరేందుకు ఏడాది నుంచి ఎదురుచూస్తున్నారు. వాస్తవంగా టీడీపీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో.. ఎవరు వచ్చినా.. వెంటనే చేర్చుకుంటుంది. కానీ ఆ మాజీ ఎమ్మెల్యే విషయంలో మాత్రం కథ మరోలా జరుగుతోంది. చంద్రబాబును కలుస్తున్నారు.. బొకేలు ఇస్తున్నారు.. శాలువాలు కప్పుతున్నారు. కానీ పార్టీలోకి ఎంట్రీ మాత్రం లభించడం లేదు. ఈ విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరో కాదు.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌ రాజు.

గత ఏడాది ఇదే వారంలో పాలపర్తి డేవిడ్‌ రాజు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఇంతవరకు అది జరగలేదు. అలాగని టీడీపీ డేవిడ్‌రాజును దూరంగా పెట్టడం లేదు. అయితే సైకిల్‌పై ఎక్కించుకోవడం లేదు. నేను.. పార్టీలో చేరతాను.. అంటూ డేవిడ్‌ రాజు పదే పదే చెబుతున్నా.. చంద్రబాబును కలుస్తూ.. విన్నవిస్తున్నా.. ఆయనకు మాత్రం లైన్‌ క్లియర్‌ అవ్వడం లేదు. తాజాగా మరోసారి డేవిడ్‌ రాజు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. మరి నా సంగతేంది సర్‌.. అంటూ అడిగారు. అయినా పార్టీలో చేరే విషయంలో బాబు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదు. చూద్దాం.. అనే రీతిలోనే బాబు మాట్లాడారు. త్వరలో జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నామని, అప్పుటి వరకు ఆగాలంటూ వాయిదా వేశారు. బాబు చెప్పిన దాన్ని బట్టీ డేవిడ్‌ రాజు చేరిక జిల్లా నేతలపై ఆధారపడి ఉందని స్పష్టమవుతోంది.

ఎందుకీ పరిస్థితి..?

డేవిడ్‌రాజు సాగించిన రాజకీయ పయనం ఆయన్ను రెంటికీ చెడ్డరేవడిలా మార్చింది. 1999లో టీడీపీ తరపున సంతనూతలపాడు నుంచి అసెంబ్లీకి ఎన్నికైన డేవిడ్‌రాజు.. ఆ తర్వాత 2014 వరకు గెలుపుముఖం చూడలేదు. వైసీపీ ఆవిర్భావం తర్వాత పార్టీలో చేరి యర్రగొండపాలెం కో ఆర్డినేటర్‌గా పని చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరినా.. ఇచ్చిన మాట ప్రకారం డేవిడ్‌రాజుకే వైఎస్‌ జగన్‌ సీటు ఇచ్చారు. ఆదిమూలపు సురేష్‌ను సంతనూతలపాడు పంపారు.

నమ్మిన వారిని నట్టేట ముంచి..

డేవిడ్‌ రాజుకు వైఎస్‌ జగన్‌ ఇంత ప్రయారిటీ ఇచ్చినా.. 2017లో టీడీపీలోకి ఫిరాయించారు. చంద్రబాబు కాళ్లు మొక్కి.. అభివృద్ధి కోసం చేరుతున్నానంటూ ప్రకటించారు. దాదాపు మూడేళ్లు టీడీపీలోనే ఉన్నారు. అయితే ప్రజా తీర్పునకు విరుద్ధంగా డేవిడ్‌రాజు వ్యవహరించడంతో.. చంద్రబాబు కూడా డేవిడ్‌ రాజుకు హ్యాండ్‌ ఇచ్చారు. 2019లో టిక్కెట్‌ నిరాకరించారు. 2014లో పోటీ చేసి ఓడిపోయిన బూదాల అజితకు మరోసారి టిక్కెట్‌ఇచ్చారు. వైసీపీ తరపున ఈ సారి ఆదిమూలపు సురేష్‌ పోటీ చేసి గెలిచారు. డేవిడ్‌రాజు ఎన్నికలకు ముందు మళ్లీ వైసీపీలో చేరారు. అయితే ఆయన చేరిన విషయం నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలకు కూడా తెలియదు.

విశ్వాసంతో ఉన్న గూడూరికి ఛాన్స్‌..

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. తనకు పదవి ఇవ్వలేదంటూ డేవిడ్‌ రాజు అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీలు మారే వారికి ప్రాధాన్యత ఉండదంటూ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుండబద్ధలు కొట్టారు. దీంతో వైసీపీలో తనకు భవిష్యత్‌లేదని గ్రహించిన డేవిడ్‌ రాజు.. మళ్లీ టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. అయితే స్థానిక టీడీపీ కేడర్‌ తీవ్రంగా వ్యతిరేకించడంతో డేవిడ్‌రాజు ముందరి కాళ్లకు బంధం పడింది. యర్రగొండపాలెం టీడీపీ ఇంఛార్జిగా టీడీపీలో ఆది నుంచి విశ్వాసంగా కొనసాగుతున్న కనిగిరి నియోజకవర్గానికి చెందిన లిడ్‌ క్యాప్‌ మాజీ చైర్మన్‌ గూడూరి ఎరిక్సన్‌ బాబుకు దక్కింది. డేవిడ్ రాజు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది.

Also Read :  కుప్పం కాపాడుకోవడమే ఇప్పుడు బాబు ప్రథమ కర్తవ్యం

Show comments