Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి మందగించిందా, విపక్షాలు చేస్తున్న ప్రచారంలో నిజమెంత, భారీ స్థాయిలో ఏపీ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి.. అనే ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఆర్థిక సర్వే ద్వారా వెల్లడవుతున్నాయి. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విప్లవాత్మక విధానాలు కొన్ని అంశాల్లో ఏపీని అగ్రగామిగా నిలబెడుతున్నాయనేది స్పష్టమవుతోంది.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వే నివేదికను సమర్పించారు. ఆ నివేదికలోని కొన్ని అంశాలు ఏపీ ప్రగతిని చాటి చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా రాష్ర్టాల పురోగతికి సంబంధించి నీతి ఆయోగ్ 2020-21 సంవత్సరానికి వెల్లడించిన ఎస్‌డీజీ ఇండియా సూచీలో 72 పాయింట్లతో ఏపీ నాలుగో స్థానంలో నిలిచినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రం కంటే ఏపీ ముందు స్థానంలో నిలవడం గమనార్హం. కేరళ 75 పాయింట్లతో ప్రథమ స్థానం, తమిళనాడు 74 పాయింట్లతో తృతీయ స్థానంలో ఉన్నాయి. ఏపీతో సమానంగా ఉత్తరాఖండ్, గోవా, కర్ణాటక రాష్ర్టాలు 72 పాయింట్లతో ఫ్రంట్ రన్నర్లుగా నిలిచినట్టు నిర్మలాసీతారామన్ వివరించారు.
ఇంకో విషయం ఏంటంటే.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అటల్ పింఛన్ యోజన పథకం ఏపీలో అద్భుతంగా అమలవుతోంది. ఆంధ్రప్రదేశ్ తొలి పదకొండు రాష్ట్రాల్లో ఆరో స్థానంలో నిలిచింది. 2021 అక్టోబరు 12 నాటికి ఏపీలో 20.5 లక్షల ఖాతాలు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఆశ్చర్యకరం ఏంటంటే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ ఈ విషయంలో వెనుకబడింది. గుజరాత్‌లో అటల్ పింఛన్ ఖాతాలు 14.3 లక్షలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ రాష్ట్రం 10వ స్థానంలో నిలిచింది. అటల్ పింఛన్ యోజన పథకంలో అత్యధిక ఖాతాదారులు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.
అంతేకాకుండా.. దేశంలోని తొమ్మిది తీర ప్రాంత రాష్ర్టాల పురోగతికి సంబంధించి ఎస్‌డీజీ ఇండియా సూచీలో ఒడిసా 82 పాయింట్లతో ప్రథమ స్థానంలో ఉండగా, ఏపీ 79 పాయింట్లతో రెండో స్థానంతో ఫ్రంట్ రన్నర్‌గా పయనిస్తోంది. 60 పాయింట్లతో కర్ణాటక, 57 పాయింట్లతో గుజరాత్ ఉన్నాయి. ఈ విషయంలో కూడా గుజరాత్ ఏపీ కంటే వెనుకబడడం గమనార్హం. పశ్చిమబెంగాల్, తమిళనాడు చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. పొగాకు పంట మార్పిడి రాష్ర్టాల్లో ఏపీ, బీహార్,గుజరాత్, కర్ణాటక రాష్ర్టాలు ముందున్నట్టు నివేదికలో వివరించారు. పంట మార్పిడి(సీడీపీ) పథకం కింద హరితవిప్లవం సాధించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు.
వీటిని గమనిస్తే చాలా అంశాల్లో ఏపీ అద్భుత పనితీరును కనబరుస్తున్నట్లు స్పషం అవుతోంది. వనరులను సద్వినియోగం చేసుకుని ఇంకాస్త ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే అభివృద్ధిలో ఏపీ టాప్ ప్లేస్ లో ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.