ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

దేశంలో మరో మినీ ఎన్నికల సమరానికి నగారా మోగింది. 2024 సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల శాసన సభల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. షెడ్యూల్‌ వివరాలను, కోవిడ్‌ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించబోతున్న తీరును కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సుశీల్‌ చంద్ర మీడియాకు వెల్లడించారు.

వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో.. కరోనా సేఫ్‌ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు సుశీల్‌ చంద్ర పేర్కొన్నారు. కరోనా వ్యాప్తిపై అధ్యయనం చేశామని, ఎన్నికల నిర్వహణపై రాజకీయపార్టీల అభిప్రాయాలు తీసుకున్నామని తెలిపారు. ఐదు రాష్ట్రాలలో మొత్తం 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో 403 స్థానాలు, పంజాబ్‌ 117, గోవాలో 40, మణిపూర్‌లో 60, ఉత్తరాఖండ్‌లో 70 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. 18.34 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారని సుశీల్‌ చంద్ర తెలిపారు. పంజాబ్, గోవా, మణిపూర్‌ల శాసన సభాకాలం మార్చితో ముగియనుండగా.. ఉత్తరప్రదేశ్‌ శాసనసభ కాలపరిమితి మే 14తో ముగుస్తుంది.

మార్చి 10న ఫలితాలు..

ఐదు రాష్ట్రాల ఎన్నికలను మొత్తం ఏడు దశల్లో పూర్తి చేయనున్నామని సుశీల్‌ చంద్ర వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో, మణిపూర్‌లో రెండు దశల్లో, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలలో ఒకే దశలో ఎన్నికలు జరపనున్నామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ఈ నెల 14వ తేదీ నుంచి మొదలుకానుంది. తొలి దశ నోటిఫికేషన్‌ ఈ నెల 14వ తేదీన వెల్లడికానుంది. తొలి దశలో ఉత్తరప్రదేశ్‌లో మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో దశ నోటిఫికేషన్‌ ఈ నెల 22న వెలవడనుంది. ఈ దశలో ఉత్తరప్రదేశ్‌తోపాటు పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్‌లలో ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఉత్తర ప్రదేశ్‌లో చివరి దశ ఎన్నికలకు ఫిబ్రవరి 10వ తేదీన నోటిఫికేషన్‌ వెల్లడిస్తారు. మార్చి 7వ తేదీన పోలింగ్‌ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు, ఫలితాలు మార్చి 10వ తేదీన వెల్లడిస్తారు.

Also Read : ప్రస్తుతానికి ముందుకే.. రేపు ఎలా ఉంటుందో..?

ఇదీ షెడ్యూల్‌..

మొదటి దశ : 

ఎన్నికలు జరిగే రాష్ట్రం: ఉత్తరప్రదేశ్‌
నోటిఫికేషన్‌/నామినేషన్ల స్వీకరణ : జనవరి 14
నామినేషన్ల తుది గడువు : జనవరి 21
నామినేషన్ల పరిశీలన : జనవరి 22
నామినేషన్ల ఉపసంహరణ : జనవరి 27
పోలింగ్‌ : ఫిబ్రవరి 10

రెండో దశ :

ఎన్నికలు జరిగే రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌
నోటిఫికేషన్‌/నామినేషన్ల స్వీకరణ : జనవరి 22
నామినేషన్ల తుది గడువు : జనవరి 28
నామినేషన్ల పరిశీలన : జనవరి 29
నామినేషన్ల ఉపసంహరణ : జనవరి 31
పోలింగ్‌ : ఫిబ్రవరి 14

మూడో దశ:

ఎన్నికలు జరిగే రాష్ట్రం: ఉత్తరప్రదేశ్‌
నోటిఫికేషన్‌/నామినేషన్ల స్వీకరణ : జనవరి 25
నామినేషన్ల తుది గడువు : ఫిబ్రవరి 01
నామినేషన్ల పరిశీలన : ఫిబ్రవరి 02
నామినేషన్ల ఉపసంహరణ : ఫిబ్రవరి 04
పోలింగ్‌ : ఫిబ్రవరి 20

నాలుగో దశ :

ఎన్నికలు జరిగే రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్
నోటిఫికేషన్‌/నామినేషన్ల స్వీకరణ : జనవరి 27
నామినేషన్ల తుది గడువు : ఫిబ్రవరి 03
నామినేషన్ల పరిశీలన : ఫిబ్రవరి 04
నామినేషన్ల ఉపసంహరణ : ఫిబ్రవరి 07
పోలింగ్‌ : ఫిబ్రవరి 23

ఐదో దశ:

ఎన్నికలు జరిగే రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్, మణిపూర్‌
నోటిఫికేషన్‌/నామినేషన్ల స్వీకరణ : ఫిబ్రవరి 05
నామినేషన్ల తుది గడువు : ఫిబ్రవరి 08
నామినేషన్ల పరిశీలన : ఫిబ్రవరి 09
నామినేషన్ల ఉపసంహరణ : ఫిబ్రవరి 11
పోలింగ్‌ : ఫిబ్రవరి 27

ఆరో దశ:

ఎన్నికలు జరిగే రాష్ట్రం : ఉత్తరప్రదేశ్‌, మణిపూర్‌
నోటిఫికేషన్‌/నామినేషన్ల స్వీకరణ : ఫిబ్రవరి 04
నామినేషన్ల తుది గడువు : ఫిబ్రవరి 11
నామినేషన్ల పరిశీలన : ఫిబ్రవరి 14
నామినేషన్ల ఉపసంహరణ : ఫిబ్రవరి 16
పోలింగ్‌ : మార్చి 03

ఏడో దశ:

ఎన్నికలు జరిగే రాష్ట్రం: ఉత్తరప్రదేశ్‌
నోటిఫికేషన్‌/నామినేషన్ల స్వీకరణ : ఫిబ్రవరి 10
నామినేషన్ల తుది గడువు : ఫిబ్రవరి 17
నామినేషన్ల పరిశీలన : ఫిబ్రవరి 18
నామినేషన్ల ఉపసంహరణ : ఫిబ్రవరి 21
పోలింగ్‌ : మార్చి 07

ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి : మార్చి 10

Also Read : థర్ట్‌ వేవ్‌ మొదలైంది.. భారత్‌ సిద్ధమైందా..?

Show comments