ఏపీకి “కొత్త” క‌ళ.. ఆస‌క్తిక‌ర అంశాలు..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌స్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 51 రెవెన్యూ డివిజన్లు, 670 మండలాలు ఉన్నాయి. పున‌ర్విభ‌జ‌న అనంత‌రం జిల్లాలు 26 కానున్నాయి. జిల్లా కేంద్రాలు, కార్యాల‌యాలు అన్నీ పెర‌గ‌నున్నాయి. ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌గా సేవ‌లు అంద‌నున్నాయి.

ఇదీ గ‌తం..

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇర‌వై మూడు జిల్లాలు ఉండేవి. అయితే.. ప్ర‌స్తుతం 160,205 km² విస్తీర్ణంలో ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌ద‌మూడు జిల్లాలు ఉన్నాయి. వాటిలో ప‌ద‌కొండు జిల్లాలు ఆంగ్లేయుల కాలంలోనే ఏర్ప‌డిన‌వే. అనంత‌రం రెండు జిల్లాలు కొత్త‌గా ఆవిర్భ‌వించాయి. సుమారు నాలుగు ద‌శాబ్దాల అనంత‌రం ఏపీలో పున‌ర్విభ‌జ‌న జ‌రుగుతోంది. ప్ర‌జ‌ల‌, భౌగోళిక, సామాజిక‌ అవ‌స‌రాల‌కు అనుగుణంగా జిల్లాల సంఖ్య పెరుగుతోంది.

స్వాతంత్య్రం వచ్చాక పరిపాలన సౌలభ్యం కోసం గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలతో ఒంగోలు కేంద్రంగా 1970 ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా ఆవిర్భవించింది. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో విజయనగరం కేంద్రంగా 1979 జూన్‌ 1న చివరిగా విజయనగరం జిల్లా ఏర్పాటైంది.

ప్ర‌స్తుతం ప్ర‌కాశ‌మే పెద్ద‌ది

ఇప్పుడు ఏర్ప‌డిన కొత్త జిల్లాల్లో 14, 322 చ.కి.మీల విస్తీర్ణంతో ప్ర‌కాశమే పెద్ద జిల్లా. ఆ త‌ర్వాతి స్థానాల్లో అల్లూరిసీతారామరాజు (12, 251 చ.కి.మీ), అనంతపురం (11, 359 చ.కి.మీ) జిల్లాలు నిల‌వ‌నున్నాయి. ఇక జ‌నాభా ప‌రంగా కర్నూలు అతి పెద్ద జిల్లాగా అవ‌త‌రిస్తోంది. ఆ జిల్లాలో 23.66 ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఆ త‌ర్వాత అనంత‌పురంలో 23.59 ల‌క్ష‌లు, నెల్లూరు జిల్లాలో 23.37 ల‌క్ష‌ల మంది జ‌నాభా ఉన్నారు.

అతి చిన్న‌ది విశాఖ‌ప‌ట్నం

పాల‌నా రాజ‌ధానిగా గ‌తంలో ప్ర‌భుత్వం ప్ర‌తిపాదించిన విశాఖ‌ప‌ట్నం ఇప్పుడు అతి చిన్న జిల్లాగా అవత‌రించ‌డం విశేషం. 928 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 18.13 ల‌క్ష‌ల జనాభా ఆ జిల్లా సొంతం. అతి తక్కువగా 9.54 లక్షల జనాభాతో అరకు చిన్న జిల్లాగా ఉంది. విశాఖ‌కు స‌మీపంలో కొత్త‌గా రెండు గిరిజన జిల్లాలు ఆవిర్భ‌వించాయి. అల్లూరి సీతారామ‌రాజు, మన్యం జిల్లాల పేరుతో కొత్త జిల్లాలు రానున్నాయి.

ఒకే మండ‌లం.. రెండు పార్ల‌మెంట్ ప‌రిధులు

కొన్ని మండలాలు రెండు పార్లమెంట్ ప‌రిధిల్లో కొన‌సాగ‌నున్నాయి. అలాగే అయిదు మండ‌లాలు రెండు జిల్లాల పరిధిలోకి వ‌స్తున్నాయి. అనంతపురం రూరల్‌ మండలం అనంతపురం, హిందూపురం పార్లమెంటు స్థానాల పరిధిలో ఉంది. విజయనగరం జిల్లా జామి మండలం విశాఖపట్నం, విజయనగరం లోక్‌సభ స్థానాల్లో ఉంది. విజయవాడ రూరల్‌ మండలం మచిలీపట్నం, విజయవాడ లోక్‌సభ స్థానాల్లో ఉంది. తిరుపతి రూరల్‌ మండలం చిత్తూరు, తిరుపతి లోక్‌సభ స్థానాల పరిధిలో ఉంది.పెదగంట్యాడ మండలం అనకాపల్లి, విశాఖ పార్లమెంటు స్థానాల పరిధిలో ఉంది.

ఈ మండలాలను ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానం ఉన్న జిల్లా పరిధిలోనే ఉంచనున్నారు. దీని ప్రకారం అనంతపురం రూరల్‌ మండలం అనంతపురం జిల్లాలో, జామి మండలం విజయనగరంలో, విజయవాడ రూరల్‌ విజయవాడలో, తిరుపతి రూరల్‌ మండలం తిరుపతిలో, పెదగంట్యాడ విశాఖ జిల్లాలో ఉంటాయి. దీంతో ఏ మండలమూ రెండు జిల్లాల పరిధిలో ఉండదు.

రెవెన్యూ డివిజన్లూ పునర్‌ వ్యవస్థీకరణ..

రాష్ట్రంలో ప్రస్తుతం 51 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె రెవెన్యూ డివిజన్‌ అతి పెద్దది. 33 మండలాలు ఇందులో ఉంటాయి. పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా 12 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న 51 రెవెన్యూ డివిజన్లలోనూ పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. మొత్తంగా రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్ల సంఖ్య 63కి చేరుకోనుంది.

కొత్త రెవెన్యూ డివిజన్లు ఇలా..
1. రాయచోటి
వైఎస్సార్‌ జిల్లాలోని రాయచోటి, సంబేపల్లి, చిన్నమండెం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాలు, మదనపల్లి డివిజన్‌లోని పీలేరు, గుర్రంకొండ, కలకడ, కేవీ పల్లె మండలాలతో ఈ డివిజన్‌ను ప్రతిపాదించారు.

2. బాపట్ల
తెనాలి డివిజన్‌లోని వేమూరు, కొల్లూరు, చుండూరు, భట్టిప్రోలు, అమృతలూరు, రేపల్లె, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాలతో ఈ డివిజన్‌ ఏర్పాటు కానుంది.

3. చీరాల
ఒంగోలు డివిజన్‌లోని చీరాల, వేటపాలెం, అద్దంకి, జె.పంగులూరు, సంతమాగులూరు, బల్లికురువ, కొరిశపాడు, పర్చూరు, యద్దనపూడి, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, మార్టేరు మండలాలతో ఈ డివిజన్‌ ఏర్పాటవనుంది.

4. పలమనేరు
మదనపల్లి డివిజన్‌లోని పలమనేరు, గంగవరం, బాలిరెడ్డిపల్లె, వి.కోట, పెద్దపంజని, కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం, రొంపిచర్ల, సోమల, చౌడిపల్లి, పుంగనూరు, సొదం మండలాలు, తిరుపతి డివిజన్‌లోని పులిచెర్ల మండలాలతో ఈ డివిజన్‌ ఏర్పాటుకానుంది.

5. డోన్‌
కర్నూలు డివిజన్‌లోని డోన్, బేతంచర్ల, పీపల్లె, నంద్యాల డివిజన్‌లోని బనగానపల్లి, అవుకు,కోయిలకుంట్ల, సంజామల, కొలిమిగుండ్ల మండలాలతో ఈ డివిజన్‌ను ప్రతిపాదించారు. 

6. ఆత్మకూరు
నంద్యాల డివిజన్‌లోని బండి ఆత్మకూరు, కర్నూలు డివిజన్‌లోని శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, నందికొట్కూరు, పగిడ్యాల, జె.బంగ్లా, కొత్తపల్లె, పాములపాడు, మిడుతూరు మండలాలు ఈ డివిజన్‌లోకి రానున్నాయి.

7. నందిగామ
విజయవాడ డివిజన్‌లోని నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలతో ఈ డివిజన్‌ను ప్రతిపాదించారు.


8. తిరువూరు

విజయవాడ డివిజన్‌లోని మైలవరం, జి.కొండూరు, నూజివీడు డివిజన్‌లోని రెడ్డిగూడెం, తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఎ.కొండూరు మండలాలతో ఈ డివిజన్‌ ఏర్పాటు కానుంది.

9. పుట్టపర్తి
కదిరి డివిజన్‌లోని కదిరి, తలుపుల, నంబులిపులికుంట, గండ్లపెంట, నల్లచెరువు, తనకల్లు, పుట్టపర్తి, నల్లమాడ, బుక్కపట్నం, కొత్త చెరువు, ఓడి చెరువు, అమడగుర్‌ మండలాలతో ఈ డివిజన్‌ను ప్రతిపాదించారు.

10. బొబ్బిలి
విజయనగరం డివిజన్‌లోని గజపతినగరం, దత్తిరాజేరు, మెరకముడిదం, పాలకొండ డివిజన్‌లోని రాజాం, వంగర, రేగిడి ఆముదాలవలస, సంతకవిటి, పార్వతీపురం డివిజన్‌లోని బొబ్బిలి, రామభద్రాపురం, బాదంగి, తెర్లాం మండలాలు ఈ డివిజన్‌లోకి రానున్నాయి.

11. భీమునిపట్నం
విశాఖ డివిజన్‌లోని భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, విశాఖపట్నం రూరల్, మహరాణిపేట మండలాలను ఈ డివిజన్‌లో ప్రతిపాదించారు.

12 . భీమవరం
కొవ్వూరు డివిజన్‌లోని తణుకు, అత్తిలి, ఇరగవరం, నరసాపురం డివిజన్‌లోని భీమవరం, వీరవాసరం, ఉండి, కాళ్ల, పాలకోడేరు, ఆకివీడు, ఏలూరు డివిజన్‌లోని తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాలు ఈ డివిజన్‌లో కలవనున్నాయి.

Show comments