కూల్ డ్రింక్ లో బల్లి.. మెక్ డొనాల్డ్స్ కు రూ.లక్ష జరిమానా, ఔట్ లెట్ మూసివేత

గుజరాత్ లోని అహ్మదాబాద్ మెక్ డొనాల్డ్స్ ఔట్ లెట్ లో ఇద్దరు కస్టమర్లు కూల్ డ్రింక్ కొనుగోలు చేసి తాగుతుండగా.. ఒకరి కూల్ డ్రింక్ లో బల్లి కనిపించడంతో కస్టమర్ గొడవ చేశాడు. కస్టమర్లలో ఒకరైన భార్గవ జోషి దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దాని గురించి మెక్‌డొనాల్డ్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారని, అయితే అతను పెద్దగా పట్టించుకోలేదని విమర్శించారు. కూల్ డ్రింక్ లో బల్లి ఉంటే.. కూల్ డ్రింక్ కొనుగోలు చేసిన డబ్బు మాత్రమే ఇస్తామని మేనేజర్ చెప్పినట్లు కస్టమర్ వివరించాడు. మే 25న సోషల్ మీడియాలో పోస్ట్ అయిన ఆ వీడియో.. నెట్టింట వైరల్ అయింది.

ఈ ఘటన గురించి తెలుసుకున్న అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు మెక్ డొనాల్డ్స్ ఔట్ లెట్ లో తనిఖీలు చేపట్టారు. కస్టమర్లకు అందించే ఫుడ్, కూల్ డ్రింక్స్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించడంలేదని పేర్కొంటూ.. ఆ ఔట్ లెట్ కు సీల్ వేశారు. అలాగే మున్సిపల్ అధికారులు మెక్ డొనాల్డ్స్ ఔట్ లెట్ కు రూ.లక్ష జరిమానా విధించారు. మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేకుండా ఔట్ లెట్ ను తెరవరాదని అధికారులు తెలిపారు.

Show comments