బీజేపీ టార్గెట్‌గా సీపీఎం ఎజెండా

కమలానికి, కమ్యూనిజానికి ఎప్పుడూ వారే. కమ్యూనిస్టులు ఏ పార్టీతో కలిసినా కాషాయపార్టీని మాత్రం ఎప్పుడూ ద్వేషిస్తూనే ఉంటారు. తాజాగా.. హిందూత్వ అజెండాతో దేశం నలుమూలలకూ బీజేపీ చొచ్చుకుపోతోందని, ఆ పార్టీని నిలువరించేందుకు కలిసొచ్చే పార్టీలు, సంస్థలను, శక్తులను కలుపుకునిపోవాలని సీపీఎం భావిస్తోంది. రాజ్యాంగ సంస్థలను, స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తూ భవిష్యత్తులో మనుధర్మాన్ని ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్న బీజేపీని ప్రధాన శత్రువుగా ప్రకటించాలని ప్రతిపాదించింది.

కమలం పార్టీకి వ్యతిరేకంగా రాజకీయంగా, సాంస్కృతిక పరంగా ఎదురుదాడి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురావాలని పేర్కొంది. ఈ మేరకు ప్రతిపాదనను సీపీఎం కేంద్ర కమిటీ ముందు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చర్చకు పెట్టారు. కేరళలోని కన్నూరులో ఏప్రిల్‌ 6, 7, 8 తేదీల్లో సీపీఎం జాతీయ మహాసభలు జరగనున్న నేపథ్యంలో రానున్న మూడేళ్లకుగాను అనుసరించాల్సిన రాజకీయ విధానానికి సంబంధించిన ముసాయిదాపై చర్చించేందుకుగాను ఆ పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఆదివారం వరకు జరిగే ఈ సమావేశాల్లో రాజకీయ విధానం ముసాయిదాతో పాటు త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపైనా చర్చించనున్నారు.

సమావేశంలో ఏచూరితో పాటు కేరళ సీఎం పినరయి విజయన్‌, త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌, పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌కరత్‌, బీవీ రాఘవులు, బృందా కరత్‌ తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బీజేపీని ప్రధాన శత్రువుగా ప్రకటించాలని అందులో ప్రతిపాదించారు. బీజేపీని వ్యతిరేకించే సంస్థలు, పార్టీల కార్యక్రమాలకు సహకరించాలనుకున్నారు. ఎన్నికల పొత్తులు, సర్దుబాట్లు అన్నది ఎన్నికల సమయంలోనే నిర్ణయించాలనుకున్నారు. యూపీ ఎన్నికల్లో బీజేపీని పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్న సమాజ్‌వాదీ పార్టీకి, ఆర్జేడీకి మద్దతుగా ఉండాలని ప్రతిపాదించారు. తెలుగు రాష్ట్రాల్లో పొత్తులకు సంబంధించి ఎన్నికల సమయంలో పరిస్థితులను బట్టి నిర్ణయించాలన్న అభిప్రాయంతోనే ఉన్నట్లు తెలుస్తోంది.

పార్టీ 23వ జాతీయ మహాసభలు కేరళలో జరగనున్న నేపథ్యంలో రాజకీయ ముసాయిదాపై కేంద్ర కమిటీలో చర్చిస్తామని ఏచూరి తెలిపారు. కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సమావేశాల్లో రూపొందించిన రాజకీయ ముసాయిదాను ప్రజలకు విడుదల చేస్తామన్నారు. ముసాయిదాకు సంబంధంచిన సూచనలు, సవరణలు, అభిప్రాయాలను తమ పార్టీ సభ్యులంతా కేంద్ర కమిటీకి తెలపవచ్చునన్నారు. ఇందుకోసం వారికి నెల రోజుల పాటు గడువూ ఇవ్వనున్నట్లు చెప్పారు.

Also Read : యూపీ ఎటో ‘వీటో’ తేల్చేసింది..!

Show comments