Idream media
Idream media
ఇప్పుడైతే ఇళ్లలోకి సినిమా వచ్చింది కానీ, ఒకప్పుడు సినిమా చూడ్డమంటే ఫుల్ డే ఎక్సర్‌సైజ్. ఫస్ట్ షోకి వెళ్లాలంటే, మార్నింగ్ నుంచి ఎదురు చూపులు మొదలయ్యేవి. ఆ రోజు సూర్యుడు మెల్లిగా తాబేలు లాగా నడుస్తాడు. సాయంత్రమే అయ్యేది కాదు.
కాళ్లుచేతులు టపటప కొట్టుకుని , కన్నీళ్లు కారిస్తే ఇంట్లో వాళ్లు ఒక రూపాయి నోటు చేతిలో పెట్టేవాళ్లు. దాంట్లో 75 పైసలు టికెట్, 15 పైసలు కలర్ సోడా, 10 పైసలు శనక్కాయలు. సాయంత్రం 5.30 గంటలకే థియేటర్ దగ్గరికి పరుగు. అప్పటికింకా థియేటర్ మైక్ నమోః వెంకటేశాయ పాట కూడా పాడేది కాదు.
థియేటర్ ముందు ఒక దుర్మార్గుడు, పిల్లల డబ్బులు తినడానికి పులి, ఏనుగు బల్ల పరిచి చేతిలో పేక ముక్కలతో ఉండేవాడు. ఆ బల్లపైన పులి, ఏనుగు, గుర్రం బొమ్మలుండేవి. పులి మీద 5 పైసలు పందెం కాస్తే ఆ పేక ముక్కలు తిరగేసినప్పుడు పులిబొమ్మ వస్తే 5 పైసలకి 5 పైసలిస్తాడు. ఆ పేక ఎక్కడ తయారయ్యేదో కానీ, వాటి వెనుక నంబర్లకు బదులు బొమ్మలుండేవి.
అప్పటికి భారతంలో ధర్మరాజు పాఠం ఎన్నిసార్లు చదివి ఉన్నా మాకు గుర్తు ఉండేది కాదు. పాఠం పాఠమే. జూదం జూదమే. 10 పైసల్‌కి మించి ఆడకూడదని ఫ్రెండ్స్ అంతా తీర్మానించుకుని పులి మీద 10 పైసల బిల్ల పెట్టేవాళ్లం.
అదేం ఖర్మో, పులికి కొడితే ఏనుగు వచ్చేది, ఏనుగు మీద ఆడితే గుర్రం వచ్చేది. తానొకటి తలిస్తే పేక ముక్క ఒకటి తలుస్తుందని, జీవితమంటే జూదమని చిన్న వయస్సులోనే నాకు ఈ ఆట నేర్పింది. జర్నలిజంలో అరకొర జీతాలతొ పనిచేస్తున్నప్పుడు ఈ ఫిలాసఫీ ఉపయోగపడుతుంది.
ఈ సారి గ్యారెంటీగా గెలుస్తామని నమ్మి అర్ధ రూపాయి వరకూ పోగొట్టేవాళ్లం. ఇక మిగిలింది కూడా పోతే సినిమా చూడలేం కాబట్టి, వివేకంతో, ఏడుపు మొహాలతో థియేటర్‌లోకి వెళ్లేవాళ్లం. (వివేకం ఎప్పుడూ ఏడుస్తూ వస్తుంది)
బెంచీలో కాలు మీద కాలేసుకుని నల్లులతో కుట్టించుకునే అదృష్టాన్ని పోగొట్టుకుని , జూదరులై నేలమీద తాంబూలం మరకల మధ్య కాసింత స్థలాన్ని వెతుక్కుని సినిమా చూసేవాళ్లం.
మా దరిద్రా న్ని ఎగతాళి చేయడానికి కంకణం కట్టుకున్న కలర్ సోడావాడు మా చుట్టూ తిరుగుతూ పదేపదే అరిచేవాడు. నాలుక చప్పరించుకుంటూ జీవితంలో ఎప్పుడూ జూదం ఆడకూడదని గట్టిగా ఒట్టు పెట్టుకునేవాళ్ళం.
మళ్లీ సినిమాకి వచ్చినప్పుడు, పోగొట్టుకున్న డబ్బులు తిరిగి సాధించాలనే కృతనిశ్చయంతో మళ్లీ ఆడి నేల టికెట్‌గా మిగిలిపోయేవాళ్లం.
ఒకరోజు మేము సినిమాకి వెళ్లేసరికి పులి ఏనుగువాన్ని పోలీసులు తంతున్నారు. మేము ఆనందంతో విజిల్ కొట్టాం. కలర్ సోడాలు పోగొట్టుకున్న కడుపు మంట అది!