Idream media
Idream media
జాత్యహంకారం, వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. జార్జి ఫ్లాయిడ్ దారుణ హత్యకు వ్యతిరేకం గా అమెరికాలో ప్రారంభమైన ఈ నిరసనలు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాయి. ఈ ఆందోళనల్లో భాగంగా అమెరికాలో అనేక ప్రాంతాల్లో క్రిస్టోఫర్ కొలంబస్ విగ్రహల ను ధ్వంసం చేయడం ఈ ఆందోళనల తీవ్రతను వెల్లడిస్తున్నాయి.
అనేక ప్రాంతాల్లో కొలంబస్ విగ్రహాలను ధ్వంసం చేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. పాఠ్య పుస్తకాల్లో ‘కొత్త ప్రపంచం’ కనిపెట్టిన వ్యక్తిగా వర్ణించిన కొలంబస్ విగ్రహాలను ధ్వంసం చేయడం గమనార్హం.
వర్జినాయాలోని రిచ్‌మండ్‌లో మంగళవారం రాత్రి నిరసనకారులు సుమారు ఎనిమిది అడుగులు ఉన్న కొలంబస్ విగ్రహాన్ని కిందకు దింపి, నిప్పు పెట్టి తరువాత నదిలోకి విసిరివేశారు.
నగరంలోని బైర్డ్ పార్క్ వద్ద గుమిగూడిన నిరసనకారులు ముందుగా సుమారు రాత్రి 8:30 గంటలకు పీఠం నుంచి విగ్రహాన్ని కిందకు దింపి తరువాత రెండు గంటల్లోపే విగ్రహాన్ని నాశనం చేశారు.
‘మరణహోమానికి కొలంబస్ ప్రతీక’ అని ఆందోళనకారులు నినాదాలు చేశారు. రిచమండ్‌లో ఈ విగ్రహాన్ని 1927 డిసెంబరులో నెలకొల్పారు. బోస్టన్‌లోని కొలంబస్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసినట్టు నగర మేయర్ మార్టీ వ్లాష్ తెలిపారు.
నగరంలోని వాటర్‌ఫ్రంట్ పార్క్‌కు సమీపంలో ఉన్న కొలంబస్ విగ్రహాం తలను ధ్వంసం చేశారు. మిన్నెసోటా రాష్ట్ర రాజధాని సెయింట్ పౌల్‌లో కూడా అదే రోజు సాయంత్రం కొలంబస్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
గుంపుగా వచ్చిన ఆందోళన కారులు విగ్రహాన్ని కిందకు దింపి నేలపై పడవేసినట్టు అధికారులు తెలిపారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామి నగరంలో కూడా కొలంబస్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
జాత్యహంకార వ్యతిరేక ఆందోళనల్లో భాగంగా బ్రిటన్‌లో బ్రిస్టోల్ నగరంలో బానిస వ్యాపారి ఎడ్వర్డ్ కోల్స్టోన్ విగ్రహాన్ని ఆందోళనకారులు నీటిలో ముంచివేశారు. ఆందోళనకారులు ముందుగా విగ్రహం మెడకు తాళ్లు వేసి కిందకు లాగారు. తరువాత బ్రిస్టోల్ హర్బర్‌లో ముంచివేశారు.
జాత్యహంకారానికీ, అసమానతకు కోల్స్టోన్ విగ్రహం ప్రతీకగా ఉందని ఆందోళనకారులు తెలిపారు. 1636లో బ్రిటన్‌లో సంపన్న కుటుంబంలో జన్మించిన ఎడ్వర్డ్ రాయల్ ఆఫ్రికన్ కంపెనీ పేరుతో బానిస వ్యాపారం చేసేవాడు.
ఆఫ్రికా దేశాల నుంచి వేలాది మందిని ఇంగ్లండ్, అమెరికాకు తరలించి బానిసలుగా విక్రయించేవాడు. బానిసగా విక్రయించిన ప్రతీ వ్యక్తి ఛాతీ మీద తన కంపెనీ పేరును ముద్రించేవాడు. బ్రిటన్ పార్లమెంట్‌కు కూడా ఎడ్వర్డ్ ఎన్నికయ్యాడు.