CM YS Jagan, Jagananna Palavelluva – కృష్ణాలోనూ మొదలైంది.. ఇక మిగిలింది ఏడు జిల్లాలే..

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలైన వ్యవసాయం, పాడి రంగాలకు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. జోడు చక్రాల్లాంటి వ్యవసాయం, పాడి పరిశ్రమల ద్వారా రైతులకు మెరుగైన లాభాలు వచ్చేలా ప్రభుత్వం పరంగా అన్ని విధాలా చేయూతను ఇస్తోంది. దేశంలో ఎక్కడా లేని ఆర్‌బీకే వ్యవస్థను ఏర్పాటు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌.. వ్యవసాయం, పాడి రంగాలకు అవసరమైన సేవలను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏళ్ల తరబడి ప్రైవేటు డైరీల చేతిలో దోపిడికి గురైన పాడి రైతులకు అండగా ఉండేలా.. మళ్లీ సహకార వ్యవస్థను అమూల్‌ సంస్థ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. జగనన్న పాలవెల్లువ కార్యక్రమం పేరుతో.. రాష్ట్ర ప్రభుత్వం, అమూల్‌ సంస్థలు సంయుక్తంగా రైతుల నుంచి పాలు సేకరించే కార్యక్రమం ఏపీలో జిల్లాల వారిగా ప్రారంభమవుతోంది. అమూల్‌కు పాలుపోసే రైతులకు ప్రైవేటు డైరీల కన్నా ఎక్కువ ధర చెల్లిస్తున్న సదరు సంస్థ.. మార్కెట్‌లో పోటీని పెంచుతోంది. తద్వారా పాడి రైతులకు మెరుగైన ధర లభిస్తోంది.

తాజాగా జగనన్న పాల వెల్లువ కార్యక్రమం కృష్ణా జిల్లాలో ప్రారంభమైంది. ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్‌.. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లాలో మొదట 264 గ్రామాల్లో అమూల్‌ పాల సేకరణ ప్రారంభించనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఐదు జిల్లాలలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రకాశం జిల్లాలో 245 గ్రామాలు, చిత్తూరు జిల్లాలో 275 గ్రామాలు, వైఎస్సార్‌ కడప జిల్లాలో 149 గ్రామాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 174 గ్రామాలు, గుంటూరు జిల్లాలో 203 గ్రామాల్లో అమూల్‌ సంస్థ రైతుల నుంచి పాలను సేకరిస్తోంది. ప్రతి పది రోజులకు ఒకసారి రైతులకు నగదు చెల్లింపులు చేస్తోంది. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తోంది.

రైతులే ఓనర్లు..

అమూల్‌ సంస్థలో పాడి రైతులే ఓనర్లని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత మాట్లాడిన సీఎం జగన్‌.. పాడి రైతులకు మేలు చేసేందుకే ఈ కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. అమూల్‌ సంస్థ దేశంలో మొదటి స్థానంలో, ప్రపంచంలో ఏడో స్థానంలో ఉందని తెలిపారు. అమూల్‌ వల్ల రైతులకు మంచి ధర, ఆదాయం వస్తోందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దాదాపు 148.50 లక్షల లీటర్ల పాలను సేకరించారని, రైతులకు దాదాపు 71 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారని తెలిపారు. ఇతర డైరీలతో పోల్చుకుంటే రైతులకు పది కోట్ల రూపాయలు అదనంగా లబ్ధి చేకూరిందని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. త్వరలో మిగిలిన ఏడు జిల్లాల్లోనూ జగనన్న పాల వెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

Also Read : రోడ్లు నిర్మాణానికి కార్యాచరణ.. రూ.1,048.50 కోట్లతో టెండర్లు

Show comments