విట్రియో రెటీనా ఐ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

రాయలసీమ ప్రజలకు నాణ్యమైన ఉచిత కంటి వైద్యం అందుబాటులోకి వచ్చింది. కడప నగరంలో అత్యాధునిక వైద్య పరికరాలు, సాంకేతికతో కూడిన విట్రియో రెటీనా ఐ ఇన్‌స్టిట్యూట్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదివారం ప్రారంభించారు. అందరికీ అందుబాటులో ఉండేలా కడప రిమ్స్‌ వద్ద ఈ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేశారు.

ఈ ఇన్‌స్టిట్యూట్‌లో 15 కన్సల్టెంట్‌ గదులు ఉన్నాయి. పేద ప్రజలకు వైద్యం అందించేందుకు ప్రత్యేకంగా 150 గదులను ఏర్పాటు చేశారు. ఆరోగ్యశ్రీ, వివిధ రకాల హెల్త్‌ కార్డుల ద్వారా ఈ ఇన్‌స్టిట్యూట్‌లో వైద్యం చేయనున్నారు. చిన్నపాటి కంటి సమస్యల నుంచి తీవ్రమైన సమస్యల వరకూ ఇక్కడ వైద్యం అందించనున్నారు. ఇప్పటి వరకు రాయలసీమ వాసులు నాణ్యమైన కంటి వైద్యంకోసం ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. ఇకపై సీమ వాసులకు కడపలోనే మంచి కంటి వైద్యం తక్కువ వ్యయానికే లభించబోతోంది.

కడప నగరానికి చెందిన డాక్టర్‌ విశ్వనాథ్‌ విట్రియో రెటీనా ఐ ఇన్‌స్టిట్యూట్‌ స్థాపించారు. హైదరాబాద్‌లోని సరోజిని కంటి వైద్యశాలలో చిరకాలం సేవలు అందించిన డాక్టర్‌ విశ్వనాథ్‌.. తన ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేసి ఈ ఇన్‌స్టిట్యూట్ ను నెలకొల్పారు. ఇప్పటికే ఈ సంస్థ విజయనగరంలో కంటి వైద్య సేవలు అందిస్తోంది. 

నూతన వధూవరులకు దీవెనలు..

కడప పర్యటనలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌.. డిప్యూటీ సీఎం అంజాద్‌ బాష కుమార్తె వివాహ వేడుకకు హాజరుకానున్నారు. మరి కాసేపట్లో వివాహవేదిక అయిన జయరాజ్‌ గార్డెన్‌కు సీఎం రాబోతున్నారు. నూతన వధూవరులకు దీవెనను అందించిన తర్వాత సీఎం జగన్‌.. తిరిగి తాడేపల్లికి బయలుదేరనున్నారు.

Also Read : కోవిడ్ వేళ విస్తృత సేవలు.. వైసిపి ఎంపీకి లోక్ సభ స్పీకర్ ప్రశంసలు

Show comments