రైతు ప్రభుత్వం.. మరోసారి నిరూపించిన జగన్‌

తనది రైతు ప్రభుత్వమని ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి నిరూపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌.. మద్ధతును నిరంతరం కొనసాగిస్తున్నారు. వైఎస్సార్‌ రైతు భరసా కేంద్రాల ద్వారా పంట వేయడం నుంచి అమ్ముకోవడం వరకు, ప్రకృతి వైపరీత్యాల వల్ల అనుకోని విధంగా నష్టం జరిగినప్పుడు.. ఇలా ప్రతి విషయంలోనూ రైతన్నకు జగన్‌ సర్కార్‌ అండగా ఉంటోంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే ఆ సీజన్‌లోనే నష్టపోయిన రైతులకు పరిహారం అందించే బృహతర్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్‌.. దాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఈ రోజు ఇన్‌పుట్‌ సబ్సిడీని జగన్‌ సర్కార్‌ అందిస్తోంది.

గత ఏడాది నవంబర్‌లో భారీ వర్షాలు రాయలసీమ, నెల్లూరు జిల్లాలను ముంచెత్తాయి. శతాబ్ధకాలంలో ఎన్నడూ చూడని విధంగా రాయలసీమలో వానలు కురిశాయి. ఫలితంగా వరదలు ముంచెత్తాయి. పెన్నా పరివాహక ప్రాంతం ఉగ్రరూపం దాల్చింది. కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. సోమశిల ప్రాజెక్టు ఉగ్రరూపం దాల్చింది. పంటలు కొట్టుకుపోయాయి. పొలాల్లో ఇసుక మేటలు వేసింది. వరద బాధితులకు తక్షణ సాయం, ఇసుక మేటలు తొలగించుకునేందుకు ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం.. తాజాగా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని ఇస్తోంది. 5,97,311 మంది రైతులకు 542.06 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో నేడు (మంగళవారం) సీఎం జగన్‌ జమ చేయనున్నారు. వీటితోపాటు 1220 రైతు గ్రూపులకు వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద 29.51 కోట్ల రూపాయల సబ్సిడీ నగదును కూడా లబ్ధిదారుల ఖాతాల్లో బటన్‌ నొక్కి జమ చేయనున్నారు.

రైతుకు అండ ప్రభుత్వం బాధ్యత..

రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండడం ప్రభుత్వం ప్రధాన బాధ్యత అనేలా వైసీపీ సర్కార్‌ పని చేస్తోంది. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే.. వెంటనే పరిహారం ఇచ్చే సాంప్రదాయాన్ని సీఎం జగన్‌ మొదలుపెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటను తు చ తప్పకుండా అమలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఐదుసార్లు 19.93 లక్షల మంది రైతులకు 1612.62 కోట్ల రూపాయల ఇన్‌పుట్‌ సబ్సిడీని అందించారు.

Also Read : సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ బదిలీ

Show comments