చెప్పకపోయినా ఈబీసీ నేస్తం.. అందుకే – సీఎం జగన్‌

పేదవాళ్లు ఎక్కడ ఉన్నా పేదవాళ్లే.. అందుకే అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు కూడా మంచి చేయాలనే ఎన్నికల ప్రచారంలో చెప్పకపోయినా ఈబీసీ నేస్తం పథకం తెచ్చామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌.. అనంతరం మాట్లాడారు.

‘‘ అంబేద్కర్‌ కలలుగన్న రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన చేస్తున్నాం. అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు కాబట్టి.. ఈబీసీ నేస్తం పథకం తెచ్చాం. ఈ పథకం ద్వారా 45–60 మధ్య వయస్సులో ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమ తదితర అగ్రవర్ణ అక్కచెల్లెమ్మలకు ఏడాదికి 15 వేల చొప్పున మూడేళ్లపాటు 45 వేల రూపాయలు అందిస్తున్నాం. ఇది ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ కాదు. అగ్రవర్ణాల్లోనూ పేదలు ఉన్నారు. పేద వాళ్లు ఎక్కడ ఉన్నా పేదవారే. వారికి కూడా మంచి చేయాలనే బాధ్యతను తీసుకుంటూ ఈబీసీ నేస్తం పథకం అమలు చేస్తున్నాం.

ఇప్పటికే వైఎస్సార్‌ చేయూత పథకం కింద.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఏడాదికి 18,750 రూపాయల చొప్పన నాలుగేళ్లపాటు 75 వేల రూపాయలు అందిస్తున్నాం. వివిధ కంపెనీలు, బ్యాంకులతో అనుసంధానం చేసి వారు వ్యాపారం చేసుకుని నిలదొక్కుకునేలా చర్యలు చేపట్టాం. కాపునేస్తం పేరుతో కాపు, బలిజ, ఒంటరి సామాజికవర్గాల్లోని అక్కచెల్లెమ్మలకు ఏడాదికి 15 వేల రూపాయల చొప్పన ఐదేళ్లపాటు ఇస్తున్నాం.

ఈబీసీ పథకం ద్వారా దాదాపు నాలుగు లక్షల మందికి ఆర్థిక సహాయం అందిస్తున్నాం. 45 నుంచి 60 మధ్య వయస్సులోని ప్రతి అక్కచెల్లెమ్మలకు మన ప్రభుత్వం అండగా నిలబడుతోంది. దాదాపు 32 లక్షల మందికి ఈ పథకాల వల్ల మంచి జరుగుతోంది. 60 ఏళ్లు దాటితే పింఛన్‌ ఇస్తున్నాం. పింఛన్‌ రూపంలో ఏడాదికి 30 వేల రూపాయలు అందుతున్నాయి.

అమ్మ ఒడి పథకం ద్వారా 13 వేల కోట్ల రూపాయలు రెండు దఫాల్లో ఇచ్చాం. వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా 75 లక్షల మంది డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు నాలుగేళ్లలో 25 వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఇప్పటికే రెండు విడతల్లో 12,700 కోట్ల రూపాయలు ఇచ్చాం. వైఎస్సార్‌ జగనన్న కాలనీల పేరుతో 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇళ్లు కట్టించి ఇవ్వబోతున్నాం. ఇళ్లు పూర్తయితే.. ఐదు నుంచి 10 లక్షల రూపాయల ఆస్తి ప్రతి ఒక్కరి చేతికి వస్తుంది. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వడ్డీలేకుండా రుణాలు అందిస్తున్నాం. జగనన్న విద్యా, వసతి దీవెనల ద్వారా పిల్లల ఉన్నత చదవుల బాధ్యతలను తీసుకున్నాం.

రాజకీయంగా మహిళలకు పెద్దపీట వేస్తున్నాం. తొలిసారి శాసనమండలిలో ఉప చైర్మన్, ఉప ముఖ్యమంత్రి ఉన్నారు. రాష్ట్ర తొలి దళిత హోం మంత్రి ఉన్నారు. రాష్ట్ర మహిళా తొలి చీఫ్‌ సెక్రటరీగా నీలం సాహ్నిని నియమించాం. రాష్ట్ర ఎన్నికల తొలి మహిళ కమిషనర్‌గా నీలం సాహ్ని ఉన్నారు. ఇవి గాక.. నామినేటెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్, ఇతర పదవుల్లో 50 శాతం ఇచ్చేలా చట్టం తెచ్చాం. 102 చైర్మన్‌ పదవులు, 586 డైరెక్టర్‌ పదవులు అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని మేయర్, చైర్మన్‌ పదవుల్లోనూ సగానికిపైగా మహిళలకే ఇచ్చాం. 202 వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో 101 మంది అక్కచెల్లెమ్మలే ఉన్నారు. జిల్లా పరిషత్‌ అధ్యక్షుల్లో.. ఏడుగురు మహిళలు ఉన్నారు. 26 వైస్‌ చైర్మన్‌ పదవులు ఉంటే.. 15 మంది అక్కచెల్లెమ్మలే ఉన్నారు. మహిళల రక్షణకు దేశంలోనే మెరుగైన చర్యలు చేపట్టాం. ఇదంతా ప్రతి అక్కచెల్లెమ్మ బాగుండాలని చేశాం.

గొప్ప వాళ్ల జీవిత చరిత్రలు మాత్రమే గొప్పవి కావు.. ప్రతి అక్కచెల్లెమ్మ జీవిత చరిత్ర కూడా గొప్పవే. వారు సంతోషంగా ఉంటేనే ప్రతి ఇళ్లు బాగుంటుంది’’ అని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభిలషించారు.

Also Read : నేడు వైఎస్సార్ ఈబీసీ నేస్తం అమలు

Show comments