బాబు ఇంకా గతంలోనే ఉన్నారా..?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో జీవిస్తున్నారా..? అనే సందేహాలు ఆయన చేసిన వ్యాఖ్యల ద్వారా కలుగుతున్నాయి. టీడీపీ నేత కంభంపాటి రామ్‌మోహన్‌ రావు రచించిన ‘నేను- తెలుగుదేశం’ పుస్తక ఆవిష్కరణలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయి. ‘‘నష్టపోయిన ఏపీని పునర్మించాల్సింది టీడీపీనే. రానున్న కాలంలో నేను గురుతర బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది’’ అంటూ మాట్లాడిన చంద్రబాబు కొత్త సందేహాలకు తెరతీశారు.

వచ్చేది 2014 కాదు.. 2024..

నష్టపోయిన ఏపీని పునర్నిర్మించాల్సింది టీడీపీనే. ఆ శక్తి టీడీపీకే ఉంది. ముఖ్యమంత్రిగా పనిచేసిన నాకు ఆ అనుభవం ఉంది.. అంటూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేశారు.విభజన వల్ల ఏపీ నష్టపోయిందని,రాజధాని కూడా లేదని, ఈ సమయంలో అనుభవజ్ఞుడునైన తనకు అధికారం ఇస్తే.. రాష్ట్రాన్ని పునర్మిస్తానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.రైతు,డ్వాక్రా రుణాల మాఫీ, ఇంటికోఉద్యోగం, కాపులను బీసీల్లో, రజకులను ఎస్సీల్లో చేరుస్తామంటూ.. దాదాపు 650 హామీలతోపాటు అనుభవజ్ఞుడు అనే కార్డ్‌ కూడా చంద్రబాబు గెలిచేందుకు దోహదపడింది. ఇది ఎనిమిదేళ్ల క్రితం జరిగిన తంతు. 2024 ఎన్నికలు సమీపిస్తున్నాయి. అయితే మళ్లీ ఇప్పుడు చంద్రబాబు.. నష్టపోయిన ఏపీని పునర్నిర్మించాల్సింది టీడీపీనే అంటూ 2014 ఎన్నికల్లో పాడిన పాటనే మళ్లీ పాడుతుండడంతో ఆయన ఇంకా గతంలోనే ఉన్నారా..? అని అనిపించకమానదు.

గురుతరబాధ్యతగా అప్పుడు..

రానున్న కాలంలో తాను గురుతరబాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది.. అంటూ కూడా చంద్రబాబు మాట్లాడడం విచిత్రంగా తోస్తోంది. విభజన తర్వాత రాజధాని కూడా లేని రాష్ట్రం బాధ్యతను అనుభవజ్ఞుడను అని చంద్రబాబు చెప్పిన మాటలను విశ్వసించి ఆయనకు అప్పజెప్పారు. అయితే అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు రాజధాని నిర్మాణం పేరిట గ్రాఫిక్స్‌ చిత్రాలు చూపి కాలక్షేపం చేశారు. దేశాలుతిరుగుతూ .. ఆయా దేశాల రాజధానుల పేర్లు చెబుతూ ఏపీ రాజధాని ఈ తరహాలో ఉంటుంది అంటూ అరచేతిలో అమరావతిని చూపారు.తెరవెనుక వేల ఎకరాలు తన బినామీలు, అనుచరుల చేత కొనిపించి.. ఆ తర్వాత రాజధానిగా అమరావతిని ప్రకటించి.. భూములు ఇచ్చిన రైతులను, ప్రజలను మోసం చేశారు.

జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంను కేంద్రం నిర్మించి ఇవ్వాల్సి ఉండగా.. తాను కడతానంటూ తీసుకుని అటకెక్కించారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి, యువతకు ఉద్యోగ కల్పనకు అతి ముఖ్యమైన ప్రత్యేకహోదాను వదిలేశారు.రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కన్నా.. ఐదేళ్లలో చంద్రబాబు పాలన వల్ల జరిగిన నష్టం పూడ్చలేనిది. అవకాశం ఉన్న చోట అప్పులు చేసి ఖాళీ ఖాజానాను మిగిల్చారు. ఈ తరహాలో పని చేసిన చంద్రబాబు.. ఇకపై గురుతర బాధ్యతగా వ్యవహరిస్తాను అంటే మళ్లీ ప్రజలు నమ్ముతారా..?

Show comments