ఏపీ మూడ్‌ మారిందా..? సీ ఓటర్‌ – ఇండియా టుడే సర్వే ఏం చెప్పింది..?

అధికార వైసీపీ పార్టీ శ్రేణలకు ఇది నిజంగా శుభవార్త. అదే సమయంలో టీడీపీ శ్రేణులకు చేదు వార్త. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. తిరిగి వైసీపీనే అధికారం వరిస్తుందని సీ ఓటర్‌ – ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వేలో తేటతెల్లమైంది. ఫోన్‌ ద్వారా చేసిన సర్వేలో ప్రజల అభిప్రాయాలు స్వీకరించిన సదరు సంస్థలు.. ఏపీ ప్రజలు మళ్లీ జగన్‌కే జై కొట్టేందుకు సిద్ధమయ్యారని వెల్లడించాయి. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజాదరణ మరింత పెరిగిందని సర్వేలో తేలింది. గత లోక్‌ సభ ఎన్నికల్లో వైసీపీ 22 సీట్లు గెలుచుకోగా.. టీడీపీ మూడు చోట్ల నెగ్గింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. వైసీపీ మునుపటి కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తుందని పేర్కొంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల పరిస్థితి ఎప్పటి మాదిరిగానే ఉందని తెలిపింది.

ఇందుకే జగన్‌కు జై కొడుతున్నారు..

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలకే కోవిడ్‌ రూపంలో పెను సవాల్‌ ఎదురైంది. ఇప్పటికీ కోవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. లాక్‌డౌన్, ఆంక్షలతో ప్రజల ఆదాయం, ప్రభుత్వ రాబడి తగ్గిపోయాయి. అయినా కూడా సీఎం జగన్‌.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేశారు. నగదు బదిలీ పథకాల వల్ల కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు తమ రోజు వారీ అవసరాలను పూడ్చుకున్నారు. ఎవరూ ఆర్థికంగా ఇబ్బంది పడలేదు. పథకాలతోపాటు  విప్లవాత్మక పరిపానలను సీఎం జగన్‌ అందిస్తున్నారు. వ్యవసాయం, పాడి పరిశ్రమలకు ఊతం ఇచ్చేలా.. రైతు భరోసా కేంద్రాలు, ప్రజల సమయం, ధనం ఆదా అయ్యేలా ప్రభుత్వ సేవలు గ్రామాల్లోనే అందేలా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు.

Also Read : దేశం మూడ్‌ ఎలా ఉంది..? సీ ఓటర్‌ – ఇండియా టుడే సర్వే ఏం చెబుతోంది..?

వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాల్లోనే ప్రాథమిక వైద్యం అందేలా చర్యలు చేపట్టారు. నాడు – నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టారు. ఈ నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలు పిల్లల విద్యపై పెట్టే ఖర్చు పూర్తిగా తగ్గిపోయింది. పైగా అమ్మ ఒడి రూపంలో ప్రతి ఏడాది 15 వేల రూపాయలు అందుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 1.30 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. వలంటీర్‌ వ్యవస్థ ద్వారా పింఛన్‌ ఇంటి వద్దకే పంపుతున్నారు. సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా.. అర్హత ఆధారంగా అందిస్తుండడంతో… వైఎస్‌ జగన్‌కు ప్రజాదరణ మరింతగా పెరుగుతోంది. 

పట్టించుకోని టీడీపీ అనుకూల మీడియా..

సీ ఓటర్‌ – ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వేలో.. కేంద్రం, వివిధ రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితి పై ప్రజల అభిప్రాయాలు తేటతెల్లం అయ్యాయి. కేంద్రంలో మళ్లీ బీజేపీ వస్తుందని వెల్లడైంది. ఏపీలో మళ్లీ జగన్‌కే ప్రజలు పట్టం కడతారని తేలింది. దీంతో ఈ సర్వే ఫలితాలను టీడీపీ అనుకూల మీడియాగా పిలుస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఏ మాత్రం పట్టించుకోలేదు. సర్వే ఫలితాలను ప్రచురించలేదు. గతంలో మొదటి పేజీలో ప్రచురించే ఈ పత్రికలు.. ఈసారి కనీసం లోపలి పేజీలోనూ వేయలేదు. గత సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత మళ్లీ నిలదొక్కుకునేందుకు టీడీపీ అష్టకష్టాలు పడుతున్నా.. ఆ పార్టీ పరిస్థితి ఏ మాత్రం మెరుగవలేదని సర్వేలో తేలిపోయింది. మూడేళ్ల సమయం ముగుస్తున్నా.. అధికార పార్టీపై వ్యతిరేకత రాకపోగా.. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆదరణ మరింత పెరుగుతుండడం టీడీపీతోపాటు ఆ పార్టీని అధికార పీఠంపై కూర్చొపెట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్న అనుకూల మీడియాకు సీ ఓటర్‌ – ఇండియా టుడే సర్వే ఏ మాత్రం మింగుడుపడడంలేదని అర్థమవుతోంది.

Also Read : హామీలను జగన్‌ అమలు చేయడంలేదంటున్న బీజేపీ నేత

Show comments