ఏపీ సీఎంకు వీర్రాజు లేఖ.. ఏం పేర్కొన్నారంటే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు నిత్యం వార్త‌ల్లో ఉండేందుకు కొంతకాలంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అమిత్ షా రాష్ట్రానికి వ‌చ్చి వెళ్లిన‌ప్ప‌టి నుంచీ కాస్త దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఆల‌యాల ప‌ర్య‌ట‌న‌లు, ప్రాంతాలవారీగా స‌మీక్ష‌లు, స‌భలు, స‌మావేశాల‌తో పాటు ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లతో హ‌డావిడి చేస్తున్నారు. తాజాగా లేఖ‌లు కూడా మొద‌లుపెట్టారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి మ‌రో లేఖ రాశారు. నిర్ణ‌యించిన స‌మ‌యం ప్ర‌కారం పేద‌లకు ఇళ్లు క‌ట్టించాల‌ని డిమాండ్ చేశారు. పేదల ఇళ్ల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాలు చెల్లించడం లేద‌ని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లింపుల్లో జాప్యం చేస్తుండడమే పేదల పాలిట శాప‌మైందంటూ విమ‌ర్శ‌లు చేశారు. , పేదల ఇళ్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం నయాపైసా ఇవ్వ‌డం లేద‌న‌డం మ‌రోవిశేషం. తొలి దశలో నిర్మించాల్సిన 15.75 లక్షల ఇళ్లు పునాది రాళ్లకే పరిమితం అయ్యాయ‌ని సీఎంకు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు.

నిర్మాణాలు స‌రే.. నాడు ప్ర‌శంస‌లేవీ..

ఏపీ ప్ర‌భుత్వం ఒకేసారి ముఫ్పై ల‌క్ష‌ల మంది పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు పంపిణీ చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకుంది. ఎన్న‌డూలేని రీతిలో పేద‌లు అడ‌గ‌కుండానే, కార్యాల‌యాలు చుట్టూ తిరిగే ప‌రిస్థితి లేకుండానే అర్హుల‌ను ఎంపిక చేశారు. స్థ‌లాల‌ను సిద్ధం చేశారు కూడా. ఇంత భారీ స్థాయిలో పేద‌ల‌కు ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మం జ‌రిగితే వైసీపీ స‌ర్కారుకు ఇక తిరుగు ఉండ‌ద‌నే దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీ నేత‌లు దీనిపై కోర్టుకెక్కారు. కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌కుండా ద‌ఫ‌ద‌ఫాలుగా అడ్డుకున్నారు. అయితే స‌ర్కారు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి వివాదాలు లేని స్థ‌లాల పంపిణీకి శ్రీ‌కారం చుట్టింది. చారిత్ర‌క కార్య‌క్ర‌మంపై దేశంలోని ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపించారు. జ‌గ‌న్ చిత్త‌శుద్ధిని కొనియాడారు. కానీ.. నాడు వీర్రాజు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ప్ర‌భుత్వ సంక‌ల్పం నెర‌వేరేందుకు స‌హ‌క‌రించ‌క‌పోగా.. ఆ కార్య‌క్ర‌మంపై రాళ్లు వేశారు. ఇప్పుడు ఇళ్లు ఏవీ అంటూ లేఖ‌లు రాయ‌డంపై వైసీపీ వ‌ర్గాలు ప్ర‌శ్నిస్తున్నాయి.

నిర్మాణాల‌పై స‌ర్కారు చిత్త‌శుద్ధి..

జ‌గ‌న్ స‌ర్కారు నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల పథకం అమలు చేస్తోంది. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని కూడా ప్రారంభించింది. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు కూడా పూర్త‌య్యాయి. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఖర్చు చేస్తోంది. అంతేకాకుండా లబ్ధిదారుల వెసులుబాటు కోసం పావలా వడ్డీకే రూ.35 వేల చొప్పున రుణాలు ఇప్పిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు త్వరితగతిన రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఇప్పటికే 2.12 లక్షల మందికి రూ.735.61 కోట్ల మేర పావలా వడ్డీ రుణాలు ఇచ్చాయి. ఈ రుణాలు మంజూరును మరింత వేగవంతం చేస్తున్నారు. చాలా జిల్లాల్లో బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. రుణాల మంజూరులో వెనుకబడిన జిల్లాల్లో ప్రత్యేకంగా బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి రుణాలు ఇచ్చేలా జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. తరచూ జిల్లా స్థాయిలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి, త్వరితగతిన రుణాలిప్పించాలని కలెక్టర్లకు సూచించారు. ఇప్పటివరకు ఉన్న పెండింగ్‌ బిల్లులు రూ. 934.26 కోట్లను, సామాగ్రి సరఫరా బిల్లు రూ. 42.22 కోట్లను చెల్లించేసినట్లు చెప్పారు. ఐదారు నెల‌ల్లో ఇళ్లు అందుబాటులోకి వ‌చ్చేలా స‌ర్కారు చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తోంది.

Show comments