Idream media
Idream media
క్రెడిట్ హైజాక్ చేసే రాజకీయ నేత చంద్రబాబు ఒక్కడే అనుకుంటే.. ఆయనుకు పోటీగా సోము వీర్రాజు కూడా వస్తున్నారు. క్రెడిట్ హైజాక్‌లో చంద్రబాబుతో పోటీ పడుతున్నారు. అదీ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాతే.. సోము ఈ తరహాలో వ్యవహరిస్తున్నారు. తాజాగా కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. అలా నిర్ణయం జరిగిందో లేదో.. ఇలా సోము లైన్‌లోకి వచ్చారు. జిల్లాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు అంశం తాము 2014 మేనిఫెస్టోలోనే పెట్టామని, మా ప్రణాళికను నేటి ప్రభుత్వం అమలు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అంతేకాదు దీనిని బట్టి పరిపాలన పట్ల బీజేపీకి ఉన్న దూరదృష్టిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా సోము వీర్రాజు కోరారు. పైగా జిల్లాల ఏర్పాటు కెడ్రిట్ మొత్తం తమదేనని చెప్పుకునేందుకు రెండేళ్ల క్రితమే బీజేపీ 26 జిల్లాలకు అధ్యక్షులను నియమించిందని గుర్తుచేస్తున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటు క్రెడిట్‌ను కొట్టేసే క్రమంలో సోము వీర్రాజు.. తమ రాజకీయ ప్రత్యర్థులకు విమర్శలు చేసేందుకు అవకాశం ఇస్తున్నారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలోనే కొత్త జిల్లాల ప్రణాళికను పెట్టామని చెబుతున్న సోము వీర్రాజు.. దాన్ని అప్పుడు ఎందుకు అమలు చేయలేకపోయారనే ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది. నాడు టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ టీడీపీ, బీజేపీలు ప్రభుత్వాలను నడిపాయి. ఇలా టీడీపీతో అధికారాన్ని పంచుకున్న బీజేపీ.. తాను ప్రకటించిన మేనిఫెస్టోలోని కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని ఎందుకు అమలు చేయలేదనే ప్రశ్నకు ఇప్పుడు సోము వీర్రాజు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ఇచ్చిన హామీ అమలు చేయలేకపోయినా.. కనీసం ప్రస్తావన అయినా నాడు ఎందుకు చేయలేదో.. నేడు క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్న సోము చెప్పగలరా..? అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తే ఏమని చెబుతారు..?
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే సీఎం జగన్‌మోహన్ రెడ్డి జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచనను ప్రజలకు చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి పార్లమెంట్‌ను ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు పార్టీ పరంగా నిర్ణయాలు కూడా తీసుకున్నారు. పార్లమెంట్‌ను జిల్లాగా తీసుకుని పార్టీకి అధ్యక్షులను నియమించారు. పార్లమెంట్ జిల్లా అధ్యక్షులతోపాటు ఇతర పదవులను కూడా ఆ ప్రాతిపదికనే భర్తీ చేశారు. 2019 ఎన్నికలకు దాదాపు రెండేళ్ల ముందు నుంచి ఈ తరహాలో జగన్ పని చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రతిపాదనకు కార్యరూపం ఇచ్చారు. జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉన్నతాధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. కోవిడ్, స్థానిక సంస్థల ఎన్నికల వల్ల కొంత ఆలస్యం జరగ్గా.. ఎట్టకేలకు కొత్త జిల్లాల ఏర్పాటు కార్యరూపం దాల్చింది.
వాస్తవం ఇలా ఉంటే.. సోము మాత్రం ఈ ప్రణాళిక మాదేనంటూ కొత్త జిల్లాల ఏర్పాటును తమ ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడే కాదు.. ఆ మధ్య ఎంపీడీవోలకు డీడీలుగా పదోన్నతలు కల్పించేలా జగన్‌సర్కార్ నిర్ణయం తీసుకుంటే.. అది నావల్లే అంటూ సోము చెప్పుకున్నారు. మండలిలో తాను ప్రస్తావించడం వల్లే వారికి ప్రమోషన్లు వచ్చాయనేది సోము భావన. ఇక ఆన్‌లైన్ జూదం విషయంలోనూ ఇదే తీరును కొనసాగించారు. ఆన్‌లైన్ జూదాన్ని సర్కార్ నిషేధించినప్పుడు కూడా.. తాను సీఎం జగన్ ను కలిసి వినతిప్రతం ఇచ్చినందువల్లనే నిషేధం విధించారని నిస్సంకోచంగా చెప్పుకున్నారు. మరి రాబోయే రోజుల్లో సోము వారి క్రెడిట్ హైజాక్‌లు ఇంకా ఎన్ని ఉండబోతున్నాయో..? చూడాలి.