Idream media
Idream media
వచ్చే నెలలో గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే ప్రచారం మోతెక్కిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉన్నవి నలభై అసెంబ్లీ స్థానాలే కావడంతో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని పార్టీలు యోచిస్తున్నాయి.గెలుపు గుర్రాల కోసం వెదుకులాట చేస్తున్నాయి. అభ్యర్థుల పూర్వపు చరిత్ర కాకుండా.. ప్రస్తుతమున్న వ్యక్తిగత మైలేజీని పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా బీజేపీ గోవా ఎన్నికల ఇన్‌ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఎవరో ఒక నాయకుడికి కొడుకు అయినంత మాత్రాన టికెట్ ఇవ్వలేమని, గోవా దివంగత సీఎం మనోహర్ పారికర్ కుమారుడన్న కారణంగా మాత్రమే ఉత్పల్ పారికర్‌కు టికెట్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు.
గోవాలోని పనాజీ సీటుపై ఉత్పల్ పారికర్ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ సీటుపై బీజేపీ తన వైఖరిని స్పష్టం చేసింది. ఉత్పల్ పారికర్ డిమాండ్‌ను తోసిపుచ్చిన బీజేపీ గోవా ఎన్నికల ఇన్‌ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్, ఎవరో ఒకరి నాయకుడి కొడుకు అనే కారణంగా తమ పార్టీ టిక్కెట్లు ఇవ్వదని ధృవీకరించారు. దీనికి అర్హతే ప్రథమ ప్రాధాన్యత ఉంటుందన్నారు.
దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. ‘అమిత్ షాతో జరిగిన సమావేశంలో ఏం చర్చ జరిగిందో నాకు తెలియదు. సమాచారం వచ్చిన తర్వాతే నా అభిప్రాయం తెలియజేస్తాను. 2019 లో తన తండ్రి అకాల మరణం తరువాత, ఉత్పల్ పారికర్ పనాజీలో తదుపరి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలనే తన కోరికను బహిరంగపరిచాడు. అయితే సిద్ధార్థ్ కుంకలింకర్‌కు బీజేపీ టిక్కెట్టు ఇచ్చిందని’ వివరించారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు కొనసాగుతుందన్నారు. అధిష్టానంతో చర్చించి అభ్యర్థుల జాబితాపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
పనాజీ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని మనోహర్ పారికర్ పెద్ద కుమారుడు భావించారు. అయితే, మనోహర్ పారికర్ జీవించి ఉన్నంత కాలం ఉత్పల్ రాజకీయాలపై ఆసక్తి చూపలేదని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పుడు అతను హఠాత్తుగా తన తండ్రి రాజకీయ వారసత్వంగా టికెట్ ఆశించినంత మాత్రాన ఇవ్వలేమని బీజేపీ స్పష్టం చేసింది. తనకు పనాజీ సీటు రాకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఉత్పల్ గతంలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీజేపీ తన నిర్ణయం స్పష్టం చేయడంతో ఉత్పల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.