Idream media
Idream media
ఏపీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మరణవార్తతో సినీ రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. అటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి సిఎంలు, పలువురు మంత్రులు, ప్రతిపక్ష నేతలు, గౌతంరెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే పలు అధికారిక, వినోద కార్యక్రమాలను రద్దు చేస్తూ ప్రకటనలు వస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. నేడు నిర్వహించాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేశారు.
ఈ మేరకు చిత్ర యూనిట్ నుంచి ప్రకటన వచ్చింది. రేపు యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చిత్ర నిర్మాత ప్రకటన చేశారు. ఇక పలు కార్యక్రమాలను కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో రద్దు చేశారు. ఏపీలో రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. ఏపీ… బీసీ కార్పొరేషన్ చైర్మన్ల సమీక్షా సమావేశం కూడా రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. అలాగే తెలంగాణాలో కొన్ని కొన్ని అధికారిక కార్యక్రమాలను వాయిదా వేశారు. పలువురు మంత్రుల అధికారిక కార్యక్రమాలు రద్దు అయ్యాయి.
ఇక ఆయన మృతదేహాన్ని నెల్లూరు స్వగృహానికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక సిఎం వైఎస్ జగన్ హైదరాబాద్ వెళ్లి కుటుంబ సభ్యులను కాసేపట్లో పరామర్శించే అవకాశం ఉంది. అటు తెలంగాణా కాంగ్రెస్ నాయకులు కూడా ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించడమే కాదు జూబ్లీహిల్స్ లోని మంత్రి నివాసానికి వెళ్ళారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి మరణం పట్ల పత్రికా ప్రకటన చేశారు.
“శ్రీ గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణం దిగ్భ్రాంతికరం. అంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. రాష్ట్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించాల్సిన తరుణంలో కన్నుమూయడం బాధాకరం. విద్యాధికుడైన ఆయన ప్రజాజీవితంలో హుందాగా వ్యవహరించారు. శ్రీ గౌతమ్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆయన తండ్రి శ్రీ రాజమోహన్ రెడ్డి గారికి, కుటుంబ సభ్యులకు నా తరపున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు.