1971 భారత్ – పాకిస్తాన్ యుద్ధం ముందు అదిరిపోయే ట్రైలర్ గరీబ్ పూర్ పోరాటం

1971లో భారత, పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన బంగ్లాదేశ్ విమోచన యుద్ధం అని చెప్పబడే యుద్ధం అధికారికంగా డిసెంబర్ 3న మొదలై 16న పాకిస్తాన్ సైన్యం లొంగిపోవడంతో ముగిసినా, అంతకు కొన్ని రోజుల ముందు నుంచే ఇరు పక్షాల మధ్య చెదురుమదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. తూర్పు పాకిస్తాన్, భారత సరిహద్దులో జరిగిన ఇలాంటి సంఘటనలో ఇరు దేశాల యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. గరీబ్ పూర్ పోరాటం అని పిలవబడే ఈ ఘటన నవంబర్ 21 తెల్లవారుజామున మొదలై మద్యాహ్నానికి ముగిసింది. తన ట్యాంకుల, యుద్ధ విమానాల సామర్థ్యం ఎలాంటిదో ఈ పన్నెండు గంటల వ్యవధిలో పాకిస్తాన్ జట్టుకి గట్టిగా రుచి చూపించింది భారత సైన్యం.

నేపథ్యం

ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన తూర్పు పాకిస్తాన్ పార్టీ అవామీ లీగ్ నాయకుడు ముజిబుర్ రెహమాన్ కి అధికారం అప్పగించకుండా, పాకిస్తాన్ సైనిక ప్రభుత్వం అతన్ని అరెస్టు చేసి, నిరసన తెలియజేసిన ప్రజల మీద ఉక్కుపాదం మోపి అణచివేతకు గురి చేయడంతో తూర్పు పాకిస్తాన్ ప్రజలు తిరుగుబాటు చేసి, ముక్తివాహిని పేరిట గెరిల్లా పోరాటానికి దిగారు. అప్పుడు సైన్యం తన అరాచకాన్ని మరింత పెంచడంతో వేలాది మంది ప్రజలు శరణార్ధులుగా భారతదేశంలో ప్రవేశించసాగారు. అప్పటివరకూ ముక్తివాహిని దళాలకు ఆయుధ సహాయం చేస్తూ వచ్చిన భారతదేశం నేరుగా యుద్ధంలోకి దిగాల్సి వచ్చింది. తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలు తగ్గిన వెంటనే యుద్ధం ప్రారంభం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు ఇరు పక్షాల సైన్యాలు చేయడం మొదలు పెట్టారు.

1947లో దేశ విభజన సమయంలో భారత ఉపఖండంతో ఏమాత్రం పరిచయం లేని సిరిల్ రాడ్ క్లిప్ గీసిన సరిహద్దు రేఖలు భారత, తూర్పు పాకిస్తాన్ సరిహద్దులో చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. చాలా చోట్ల తూర్పు పాకిస్తాన్ భూభాగం భారతదేశంలోకి చొచ్చుకు వచ్చింది. అలా వచ్చిన ఒక ప్రాంతం గరీబ్ పూర్. మూడు వైపులా భారత భూభాగం ఉన్న ఈ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం తన బలగాలను మోహరిస్తే, యుద్ధం మొదలయ్యాక అక్కడ నుంచి భారత సైన్యాన్ని దెబ్బ తీయడం పాకిస్తాన్ కు తేలిక అవుతుందన్న భయంతో ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడానికి అనుమతి కోరింది అక్కడ ఉన్న భారత సైన్యం. ఈ పని చేయడానికి భారత బలగాలు అంతర్జాతీయ సరిహద్దు ఉల్లంఘనకు పాల్పడవలసి వస్తుంది కాబట్టి ఆ అభ్యర్ధన అప్పటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ వద్దకు చేరింది.

ఆమె తన సలహాదారులతో చర్చించి నవంబర్ 18న అనుమతి ఇచ్చింది.గరీబ్ పూర్ స్వాధీనం చేసుకునే బాధ్యత 14వ పంజాబ్ బెటాలియన్ మీద పడింది. తేలికపాటి PT-14 రకం ట్యాంకులు, లైట్ మెషీన్ గన్స్ తో నవంబర్ 20 అర్ధరాత్రి దాటాక, 21 తెల్లవారుజామున పాకిస్తాన్ సైన్యం ఏమరుపాటుగా ఉన్న సమయంలో దాడిచేసి, వారిని తరిమికొట్టాలని కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ ఆర్. కే. సింగ్ నిర్ణయించి, అవతలి వైపు పాకిస్తాన్ సైనికులు ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారో తెలుసుకుని, వ్యూహం పన్నడానికి వీలుగా కొంతమందితో ఒక చిన్న బృందాన్ని పంపించాడు. అనుకోకుండా వీరికి సరిహద్దులో గస్తీ కాస్తున్న పాకిస్తాన్ సైనికులు ఎదురయ్యి, ఇరుజట్ల మధ్య ఎదురు కాల్పులు జరిగి, భారత సైన్యం దాడి చేస్తున్న విషయం తెలిసిపోయింది.

ప్రత్యర్థికి అనుమానం రాకుండా ఆకస్మికంగా దాడి చేయాలన్న ప్రయత్నం దెబ్బతినడంతో, ఇక ఆలస్యం చేయకుండా తన బలగాలతో నవంబర్ 21, తెల్లవారుజామున మూడు గంటలకు అంతర్జాతీయ సరిహద్దు దాటి గరీబ్ పూర్ లో ప్రవేశించాడు ఆర్. కే. సింగ్. అక్కడికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న జెస్సోర్ లో పాకిస్తాన్ సైనిక స్థావరం ఉంది. అక్కడ నుంచి తమమీద ఎదురుదాడి చేయడానికి పాకిస్తాన్ సైన్యం తన బలగాలను పంపిస్తుందని ఊహించి, ఎంత మంది, ఎంత వ్యవధిలో వస్తున్నారో తెలుసుకోవడానికి ఒక చిన్న బృందాన్ని ముందుగా పంపించాడు. దట్టమైన పొగమంచులో ముప్పై అడుగుల ముందు ఏముందో కనిపించకపోయినా, కొంతదూరం పోయాక గరీబ్ పూర్, జెస్సోర్ రోడ్డు మీద పాకిస్తాన్ సైన్యానికి చెందిన అమెరికా తయారీ M-24 ఛాఫీ ట్యాంకులు వస్తున్న ప్రకంపనలు తెలిశాయి ఆ జట్టుకి. వాళ్ళు వెంటనే రేడియోలో ఆ విషయం తెలియజేశారు.

ట్యాంకులతో హోరాహోరీ పోరాటం

ప్రత్యర్థి ట్యాంకులతో పోలిస్తే తన దగ్గర ఉన్న రష్యా తయారీ PT-14 ట్యాంకులు భూమి మీద, నీటిలో కూడా కదలదగ్గ శక్తి ఉన్నా,, వాటిలో వాడే గుండ్లు కానీ, వాటి రక్షణ కవచం కానీ తేలికైనవి అయినా ట్యాంకు దళం నాయకుడు మేజర్ దల్జీత్ సింగ్ నారంగ్ వాటిని తెలివిగా మొహరించి ప్రత్యర్థి రాకకోసం ఎదురు చూశాడు. ఉదయం ఆరుగంటలకు పాకిస్తాన్ దళం తన ట్యాంకుల పరిధిలోకి రాగానే ఫైరింగ్ మొదలు పెట్టాడు నారంగ్.

హోరాహోరీగా జరిగిన ఆ పోరాటంలో పాకిస్తాన్ సైన్యానికి చెందిన డెభ్బై మంది మరణించారు. మరో వందమంది గాయపడి, ఎనిమిది ట్యాంకులు ధ్వంసం కాగా, మూడు ట్యాంకులను భారత సైనికులు స్వాధీనం చేసుకున్నారు. భారత సైన్యం వైపునుంచి ఏడుగురు మరణించారు. ఇరవైరెండు మంది గాయపడగా, రెండు ట్యాంకులు ధ్వంసం అయ్యాయి. మరణించిన వారిలో మేజర్ నారంగ్ కూడా ఉన్నాడు. ఆయన చూపిన పోరాట పటిమకు గాను ఆయనకు తరువాత మహావీరచక్ర పురస్కారం ప్రధానం చేశారు.

రంగంలోకి యుద్ధ విమానాలు

చిన్న సైనిక దళం చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్తాన్ సైన్యం మరింతమంది సైనికులను పోరాటంలో దించే సాహసం చేయలేదు. తమ వైమానిక దళం సాయం కోరింది. అప్పటికి సమయం మద్యాహ్నం మూడు గంటలు అయింది. ఈ పిలుపు కోసం వేచి చూస్తున్న పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన అమెరికా తయారీ F-86 విమానాలు రాకెట్లు, మెషీన్ గన్స్ తో బయలుదేరాయి. పాకిస్తాన్ ఈ ఎత్తు వేస్తుందని ఊహించి ముందే సిద్ధంగా ఉన్న నాలుగు భారత యుద్ధ విమానాలు వాటిని అడ్డుకున్నాయి. శబ్ధవేగానికి కొంచెం తక్కువ వేగంతో ప్రయాణించే ఈ బ్రిటిష్ తయారీ ఫోలాండ్ విమానాలకు కందిరీగ అని మారుపేరు. చిన్న సైజులో వేగంగా వచ్చి దెబ్బతీసే సామర్థ్యం వల్ల ఆ పేరు వచ్చింది. కొద్ది నిమిషాల్లో ముగిసిన ఆ పోరులో మూడు పాకిస్తాన్ విమానాలు కూలిపోగా, నాలుగో విమానం దెబ్బ తిని వెనుతిరిగి పోయింది. కూలిన పైలట్లు ముగ్గురు పారాచూట్ల సాయంతో దూకి, భారత సైనికుల చేతికి యుద్ధ ఖైదీలుగా దొరికారు. ఈ పోరాటంలో పాల్గొన్న నలుగురు భారత పైలట్లకూ వీర చక్ర పురస్కారం ప్రకటించారు.

భారత సైన్యం సాధించిన ఘనవిజయం

డిసెంబర్ 3 నుంచి 16 వరకు జరిగిన యుద్ధంలో తూర్పు, పశ్చిమ పాకిస్తాన్ సరిహద్దులో భారత సైన్యం తిరుగులేని విజయాలు సాధించింది. 93 వేల మంది పాకిస్తాన్ సైనికులు లొంగిపోయి, భారత సైన్యం చేతికి యుద్ధ ఖైదీలుగా చిక్కారు. భారత సైన్యం పదిహేను వేల చదరపు కిలోమీటర్ల పాక్ భుభాగాన్ని చేజిక్కించుకుని, మరుసటి సంవత్సరం తిరిగి ఇచ్చింది.

ఈ యుద్ధం వల్ల తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్ పేరిట స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. తమ దేశం చీలిపోవడానికి భారత్ కారణమైందన్న కోపంతో అప్పటినుంచి భారత దేశం నుంచి కాశ్మీర్ ను విడదీయాలని పాకిస్తాన్ నానా కుట్రలు పన్నుతూ ఉంది. ఈ దొంగ యుద్ధం వలన కాశ్మీర్ లో శాంతి కరువైపోయింది.

ఒక ఆసక్తికరమైన సంఘటన

గరీబ్ పూర్ లో భారత సైన్యం చేతికి దొరికిన పాకిస్తాన్ పైలట్లలో ఒకరైన పర్వేజ్ మెహదీ ఖురేషి పాకిస్తాన్ వైమానిక దళంలో అంచెలంచెలుగా ఎదిగి 1996లో ఛీఫ్ అయ్యాడు. ఆ పోరాటంలో పాల్గొన్న భారత పైలట్ డోనాల్డ్ లాజరస్ కూడా అప్పటికి భారత వైమానిక దళంలో గ్రూప్ కెప్టెన్ అయ్యాడు. ఆ సందర్భంగా ఖురేషికి అభినందనలు తెలుపుతూ ఒక సందేశం పంపించాడు లాజరస్.

“మీరు పాకిస్తాన్ వైమానిక దళంలో అత్యున్నత పదవి చేపడుతున్నందుకు అభినందనలు. మన ఇద్దరి పరిచయం కొద్ది నిమిషాలు మాత్రమే. అది కూడా గగనతలంలో పోరాటం చేస్తుండగా జరిగింది. మీ కొత్త పదవిలో మీరు విశేషంగా రాణించాలని కోరుకుంటున్నాను” అని ఆ సందేశం. అయితే ఆశ్చర్యకరంగా ఖురేషి దానికి సమాధానం ఇచ్చాడు. లాజరస్ పంపిన సందేశానికి ధన్యవాదాలు తెలుపుతూ” మన పరిచయం జరిగిన ఆ కొద్ది నిమిషాల్లో మీరు, మీ సహచరులు చూపిన పోరాట పటిమ అద్భుతం “అని ప్రశంసించాడు.

అసలైన సైనికుడు తన ప్రత్యర్థి సైనికుల పోరాట పటిమ గుర్తిస్తాడని పర్వేజ్ ఖురేషి నిరూపించాడు ఈ సందర్బంలో.

🖋🖋🖋🖋🖋
సన్నపరెడ్డి కృష్ణారెడ్డి

Show comments