ఒకేచోట చంద్రబాబుకు 200 ఎకరాలు.. వివాదాలు ఏమిటి..?

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వగ్రామం చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ఆయనకు చెందిన 38 సెంట్ల భూమి కబ్జాకు గురైందన్న వార్తలు రెండు రోజుల నుంచి హల్‌చల్‌ చేస్తున్నాయి. నిజానిజాలు తేల్చేందుకు చంద్రగిరి తహసీల్దార్‌ రంగంలోకి దిగారు. చంద్రబాబు భూమినే కబ్జాకు గురైందని, అదీ వైసీపీ నేతలే చేశారంటూ టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేయడంతో అందరూ ఏం జరిగిందా..? అని తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. తాజాగా వివాదం నేపథ్యంలో.. చంద్రబాబుపై గతంలో వచ్చిన భూ వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఆ సమయంలో ఏం జరిగిందనే విషయాన్ని చర్చించుకుంటున్నారు.

బలాయపల్లి భూములు భాగోతం..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చంద్రబాబుకు 200 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 1984–85 కాలంలో చంద్రబాబు కొనుగోలు చేశారు. అప్పట్లో కొన్న భూమి కావడంతో బినామీలపై పెట్టకుండా చంద్రబాబు కుటుంబ సభ్యుల పేరుపైనే రిజిస్ట్రేషన్‌ జరిగి ఉంది. 1985లో తొలిసారి గూడూరు నుంచి పోటీ చేసిన దివంగత బల్లి దుర్గాప్రసాద్‌ ఈ భూములకు సంబంధించిన మంచిచెడులు చూసుకునేవారు. న్యాయవాది అయిన బల్లి దుర్గాప్రసాద్‌కు 1985కు ముందే చంద్రబాబుతో మంచి సంబంధాలు ఉండేవి.

నారావారిపల్లిలో చంద్రబాబు కుటుంబానికి ఉన్న ఆస్తులు ఏమిటో అందరికీ తెలిసినదే. రెండు ఎకరాల భూమి చంద్రబాబు కుటుంబానికి ఉందని టీడీపీ నేతలే గొప్పగా చెప్పుకుంటారు. అలాంటిది రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే 200 ఎకరాల భూమి కొనుగోలు చేయడంతో చంద్రబాబుపై 1986లో పలు ఆరోపణలు వచ్చాయి. అప్పుడు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబు 1986 సెప్టెంబర్‌ మొదటి వారంలో తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఆ భూముల గురించి, తనపై వచ్చిన ఆరోపణల గురించి వివరణ ఇచ్చారు. తిరుపతిలో ఉన్న హోటల్‌ అమ్మగా వచ్చిన డబ్బుతో బలాయపల్లిలో ఎకరం రెండు వేల రూపాయల చొప్పన 200 ఎకరాలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. తనకు నాలుగైదు లక్షల రూపాయలు వెచ్చించి భూములు కొనుగోలు చేసే స్థోమత లేదా..? అంటూ నాడు విలేకర్ల సమావేశంలో చంద్రబాబు ప్రశ్నించారు.

చంద్రబాబు వివరణ ఇచ్చిన తర్వాత దాదాపు రెండు దశాబ్ధాల వరకు ఆ భూముల గురించి ఎవరూ ప్రస్తావన చేయలేదు. చాలాకాలం తర్వాత 2004 తర్వాత మళ్లీ ఆ రెండు వందల ఎకరాల భూములపై ఏకంగా అసెంబ్లీలోనే చర్చ జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్‌ ఇచ్చారు. ఆ పథకాన్ని చంద్రబాబు తన రెండు వందల ఎకరాల భూములకు వాడుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై అప్పట్లో సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో చంద్రబాబును నిలదీయగా.. అడ్డంగా దొరికిపోయారు. తప్పించుకునేందుకు సన్నాయి నొక్కులు నొక్కిన చంద్రబాబు.. ఆ వివరాలు తనకు తెలియవంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. ఒక వేళ ఉచిత విద్యుత్‌ను వాడుకుని ఉంటే అందుకు సంబంధించిన బిల్లులు చెల్లిస్తానని, ఇకపై ఉచిత విద్యుత్‌ వాడకుండా తన వాళ్లకు చెబుతానంటూ ఆ వివాదాన్ని ఎలాగోలా సద్దుమణిగేలా చేసుకున్నారు.

అమరావతి భూములు..

ఈ భూములపై కాకుండా రాష్ట్ర విభజన తర్వాత రాజధానిగా ఎంపికైన అమరావతిలోనూ భారీ ఎత్తున భూ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంలో చంద్రబాబు నేరుగా దూరకుండా.. తన బినామీల ద్వారా భారీ ఎత్తున తక్కువ ధరకే రైతుల వద్ద భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా వేల ఎకరాలు చంద్రబాబు, టీడీపీ నేతలు కొల్లగొట్టారని పలు ఆధారాలు కూడా లభించడంతో.. వాటిపై వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తోపాటు తమకు వచ్చిన ఫిర్యాదులపై సీఐడీ, ఏసీబీలు కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టడంతో.. టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నారు. బలాయపల్లి భూముల్లో వ్యవహరించిన మాదిరిగా కాకుండా అమరావతిలో చంద్రబాబు తెర వెనుక ఉండి కథ నడిపారని చర్చించుకుంటున్నారు.

Also Read : బాబు భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారా?

Show comments