Idream media
Idream media
ప్రజలే ముందు.. అనే లక్ష్యంతో పాలన సాగిస్తున్న వైఎస్ జగన్..ప్రజల పట్ల తన వైఖరిని మరోమారు చాటుకున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్.. మన దేశంలోనూ సునామిలా విరుచుకు పడుతుందనే నిపుణుల అంచనాల నేపథ్యంలో.. దాన్ని ఎదుర్కొనేందుకు జగన్ సర్కార్.. ముందస్తుగా అన్ని ఏర్పాట్లను సిద్దం చేసుకుంటోంది. ప్రస్తుతం ఉన్న కోవిడ్ ల్యాబ్‌ల ద్వారా ఒమిక్రాన్ వైరస్‌ను గుర్తించలేని పరిస్థితి. జీనోమ్ సీక్వెన్సీ ల్యాబ్ ద్వారానే ఒమిక్రాన్‌ను గుర్తించగలం. ఈ ల్యాబ్‌లు హైదరాబాద్, పూణేలలో ఉన్నాయి. ఏపీకి సంబంధించిన శాంపిళ్లను హైదరాబాద్ లేదా పుణేలకు పంపించాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి వల్ల ఫలితాలు ఆలస్యంగా వెల్లడవుతాయి. ఆలస్యమయ్యే కొద్దీ బాధితులకు, వారిని కలిసిన వారికి ముప్పు ఏర్పడుతుంది. వైరస్ వ్యాప్తి జరుగుతుంది.
ఈ పరిస్థితి లేకుండా ఉండేందుకు.. ఆంధ్రప్రదేశ్‌లోనే జీనోమ్ సీక్వెన్నీ ల్యాబ్‌ను జగన్ సర్కార్ ఏర్పాటు చేసింది. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్ సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. కేరళ తర్వాత జీనోమ్ సీక్వెన్నీ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకున్న రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ప్రస్తుతం విదేశాల నుంచి వస్తున్న వారి శాంపిళ్లను తీసుకుని, కొవిడ్ పరీక్షతోపాటు ఒమిక్రాన్ సోకిందా..? లేదా..? అనే విషయాన్ని తేలుస్తున్నారు. ఆ శాంపిళ్లను ఇకపై హైదరాబాద్, పుణేలకు పంపించాల్సిన పరిస్థితి తప్పింది. ఇకపై విజయవాడలోనే ఒమిక్రాన్ పరీక్షలు నిర్వహించనున్నారు. వైరస్ సోకిన వారికి వేగంగా చికిత్స అందించేందుకు, వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ ల్యాబ్ ఏర్పాటు ఉపకరించనుంది.
ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే 33,750 కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారికే ఒమిక్రాన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశంలో ఇప్పటి వరకు దాదాపు 1700 మందికి ఒమిక్రాన్ సోకింది. ఆఫ్రికా, అమెరికా, యూరప్ దేశాలలో ఒమిక్రాన్ వ్యాప్తిగా అధికంగా ఉంది. మరో రెండు, మూడు నెలల్లో భారత్‌లోనూ ఒమిక్రాన్ తన పంజాను విసురుతుందని అంచనాలున్నాయి. రోజుకు 16 నుంచి 20 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో.. ఏపీ సర్కార్ ముందుగానే అన్ని ఏర్పాటు చేసుకుంటోంది. జీనోమ్ సీక్వెన్నీ ల్యాబ్‌లు విజయవాడతోపాటు గుంటూరు, తిరుపతి, విశాఖ నగరాల్లోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేస్తోంది. ల్యాబ్‌ల ఏర్పాటుతోపాటు సిబ్బందికి శిక్షణ ఇస్తోంది. మరికొద్ది రోజుల్లో మూడు ల్యాబులు అందుబాటులోకి రానున్నాయి.
కోవిడ్ మొదటి, రెండో వేవ్‌లలోనూ జగన్‌సర్కార్.. అధిక సంఖ్యలో పరీక్షలు చేసింది. వైరస్ సోకిన వారిని గుర్తించడం, వారికి చికిత్స అందించడం వల్ల.. ప్రాణ నష్టం తక్కువగా నమోదైంది. టెస్ట్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్.. అనే విధానాన్ని అవలంభించిన జగన్ సర్కార్.. ఏపీలో ఉంటే కోవిడ్‌ను ఎదుర్కొనవచ్చనే ధీమాను ప్రజల్లో కల్పించింది. ఉచిత పరీక్షలు, వైద్యం, పౌష్టికాహారం అందించి.. కోవిడ్ వల్ల ప్రజలు ఆర్థికంగా నష్టపోకుండా కాపాడింది. వ్యాక్సినేషన్ విషయంలోనూ ప్రజలే ముందు అనే విధానంతో.. కేంద్ర ప్రభుత్వ విధానంలో లోపాలు ఎత్తి చూపి, ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్‌ను అందించింది. ఇప్పుడు మూడో వేవ్ హెచ్చరికల నేపథ్యంలో.. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తోంది.