దేశంలోనే బెస్ట్ గా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ దేశంలోనే బెస్ట్ డీజీపీగా నిలిచారు. ఆయన ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు గానూ అత్యుత్తమ డీజీపీగా ప్రకటిస్తున్నట్లు ది బెటర్ ఇండియా సంస్థ తెలిపింది. 2021 సంవత్సరానికి దేశంలో ఉత్తమ సేవలు అందించిన 12 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల జాబితాను ది బెటర్ ఇండియా సంస్థ విడుదల చేసింది. గత రెండేళ్లలో కరోనా కారణంగా ఎదురైన అనేక కఠినమైన సవాళ్లను డీజీపీ సవాంగ్ ఎదుర్కొన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. కోవిడ్ సమయంలోనూ రాష్ట్ర ప్రజలకు డీజీపీ సవాంగ్ ఉత్తమ సేవలు అందించారని కొనియాడింది.

దిశా యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించడంలో డీజీపీ సవాంగ్ అందించిన సేవలను ది బెటర్ ఇండియా సంస్థ ప్రత్యేకంగా ప్రశంసించింది. దిశా యాప్‌లోని ఎస్‌వోఎస్‌ బటన్‌ ద్వారా అనేక మంది బాధితులకు సత్వరం రక్షణ కల్పించి అద్భుతాలు సాధించారని తెలిపింది. అత్యుత్తమ టెక్నాలజీతో కేసులను వేగంగా పరిష్కరిస్తూ ఏపీ పోలీస్ శాఖ చాలా బాగా పనిచేస్తోందని కొనియాడింది. దిశా మొబైల్‌ యాప్‌ కేవలం ఐదు నెలల్లోనే 12.57 లక్షల డౌన్‌లోడ్‌లను చేయడంతో రికార్డు సృష్టించారని పేర్కొంది.

ఏపీ పోలీసు శాఖ సేవ‌ల‌కు గ‌తంలోనూ ఎన్నో జాతీయ స్థాయి అవార్డులు ద‌క్కాయి. గ‌తంలోనూ జాతీయ స్థాయిలో ఉత్తమ డీజీపీ అవార్డును గౌతమ్ సవాంగ్ అందుకున్నారు. కానీ, ఏపీ ప్ర‌తిప‌క్షం మాత్రం పోలీసు శాఖ‌పై అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడల్లా ఆరోప‌ణ‌లు చేస్తూ వారిని నిరుత్సాహ‌ప‌రుస్తోంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడైతే త‌ర‌చూ లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. త‌మ రాజ‌కీయ ల‌బ్ధి కోసం పోలీసు శాఖ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ‌తీస్తున్నార‌ని ఎన్నోసార్లు ఉన్న‌తాధికారులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దేశంలోనే అత్యున్న‌త సేవ‌లు అందిస్తున్న డీజీపీగా మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కిన స‌వాంగ్ ప‌నితీరుపై బాబు ఇప్పుడేమంటారో?!

Show comments