అవరోధాలు ఆయనకు కొత్త కాదు, అధిగమించడంలో ఆయనకు పోటీ లేదు

అధికారాంతమందు చూడవలే..అయ్యవారి అసలు వేషం అని ఓ కవి అన్నట్టుగా ఓ నాయకుడు ఎలాంటి వాడన్నది తెలియాలంటే అధికారంలో ఉన్నప్పుడే బాగా అర్థమవుతుంది. విపక్షంలో ఉన్న సమయంలో ఎన్ని మాటలు చెప్పినా, పాలనలో వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారా లేదా అన్న దానిని బట్టే ఎవరినైనా అంచనా వేయగలం. వారి సామర్థ్యాన్ని, చిత్తశుద్ధిని పరీక్షించగలం. అంటే ప్రతీ నాయకుడికి అధికారమే అసలుసిసలైన పరీక్షాకాలం అని చెప్పవచ్చు.

వైఎస్ జగన్ ప్రారంభ రాజకీయాల్లో అధికార పక్ష నేతగానే ప్రారంభమయ్యింది. కానీ అనూహ్య పరిణామాలతో ఆ తర్వాత దాదాపు ఏడేళ్ల పాటు విపక్ష హోదాలో సాగారు. ప్రతిపక్ష నేతగా పట్టుదలను ప్రదర్శించారు. చివరకు ప్రజలు పట్టంగట్టడంతో అధికారం చేపట్టి ఏడాదిన్నర సమయం పూర్తయ్యింది. ఈ కాలంలో ఆయన ప్రజాపక్షపాతిగా నిరూపించుకునే పనిలో ఉన్నారు. ఆటంకాలను అధిగమిస్తూ పాలనలో పట్టు సాధించారు. ఎంతో పరిణతి చెందిన రాజకీయ నేతగా వ్యవహరిస్తున్నారు. పాలనాదక్షుడిగా పేరు సాధించేందుకు శ్రమిస్తున్నారు. సంక్షేమ చర్యలకు ఆటంకం రాకుండా, అభివృద్ధి కార్యక్రమాలకు అవకాశం ఉన్నంత మేరకు ప్రయత్నిస్తూ ఫలితాలు సాధిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా విపక్షాలకు పెద్దగా విమర్శించే అవకాశం లేకుండా తన పాలనా వ్యవహారాలను సాగిస్తున్నారు.

అధికారపక్షం నేతగా జగన్ పనితీరు ప్రజల్లో మంచి గుర్తింపు సాధిస్తోంది. విపక్ష నేతగా చెప్పిన మాటలను చేసి చూపిస్తూ జనహృదయ నేతగా తండ్రి బాటలో సాగుతున్నారు. వైఎస్సార్ ని తలపిస్తూ పాలన నడుపుతున్నారు. తండ్రి ఒక అడుగు వేస్తే తాను రెండడుగులు వేస్తానని చెప్పిన మాటను చేసి చూపిస్తున్నారు. తండ్రి తో పాటు తనను కూడా ప్రజలు గుర్తించే స్థాయిలో పరిపాలన చేస్తానని ప్రమాణస్వీకారం నాడు ఇచ్చిన హామీలను ఆచరణాత్మకంగా చూపిస్తున్నారు.

నాణానికి ఒకవైపు జగన్ పాలన అంతా సజావుగా సాగుతున్నట్టు, విపక్షాలు చేష్టలుడిగి చూస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ అంతర్గతంగా కథ వేరుగా ఉంది. అడుగడుగునా జగన్ కి ఆటంకాలే ఎదురవుతున్నాయి. ఓవైపు వివాదాలు సృష్టించడం, మీడియాలో వాటిని గోరింతలు కొండంతలుగా చూపడం, తద్వారా న్యాయస్థానాల ద్వారా ప్రభుత్వానికి అడ్డంకులు కలిగించే ప్రయత్నం చేయడమే పనిగా సాగుతోంది. చివరకు కోర్టుల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రణాళికాబద్ధంగా కొందరు న్యాయమూర్తులు వ్యవహరిస్తున్నారని సీఎం హోదాలో జగన్ ఫిర్యాదు చేసేటంతవరకూ వెళ్లింది. గతంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదుర్కోని విషమ పరీక్షను జగన్ ఈ రూపంలో ఎదుర్కొన్నారు. ఓవైపు ప్రభుత్వ వ్యవహారాలు నిర్వహిస్తూనే మరోవైపు పెద్ద సమస్యలను, సవాళ్లను అధిగమించాల్సిన స్థితి జగన్ కి ఎదురయ్యింది. అయినా మొక్కవోని తన మొండి పట్టుదలను మరోసారి ప్రదర్శించి వాటిని తుత్తునియలు చేసేందుకు జగన్ సమాయత్తమయినట్టు కనిపిస్తోంది.

రాజకీయాల్లో ఎత్తుపల్లాల గురించి బాగా ఎరిగిన జగన్ తన ఎదుగుదలకు వ్యవస్థలో ఉన్న కొన్ని శక్తుల ద్వారా అడ్డంకులు సృష్టిస్తున్న విషయాన్ని త్వరగానే గుర్తించారు. దానికి తగ్గట్టుగా వాటిని ఎదుర్కోవడంలో ఏమరపాటు లేకుండా సాగుతున్నారు. ఓవైపు న్యాయస్థానాల్లో తన నిర్ణయాలు ప్రతీది అడ్డంకులు సృష్టించే పనికి పూనుకున్నా తోట్రుపాటుకి గురికాలేదు. చివరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నా కాదన్నప్పటికీ చలించలేదు. పేదలకు ఇంగ్లీష మీడియం ప్రజలకు మేలు చేసేందుకు చేస్తున్న కృషిని ముందుకు సాగకుండా మోకాలడ్డుతున్నా ధీటుగా నిలబడేందుకు సంసిద్ధమై ఉన్నట్టు చాటుతున్నారు. మొత్తంగా వ్యవస్థలోని పలు సంస్థల నుంచి జగన్ కి సెగ పెట్టే ప్రయత్నాల్నింటినీ జగన్ ఎదుర్కొంటూ సాగుతున్నారు.

అదే సమయంలో మీడియా ద్వారా సాగుతున్న దుష్ప్రచారాన్నికూడా ఎదుర్కోవడంలో నిబ్బరంగా సాగుతున్నారు. నిలకడగా వ్యవహరిస్తూ నిలకడగల నేతగా చాటుతున్నారు. బహుశా జగన్ లాంటి పరిస్థితులు ఎవరికీ ఎదురయ్యే అవకాశం లేదు. అందులోనూ కరోనా వంటి విపత్తులు ఎదురయిన సమయంలో సాటి తెలుగు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సహకరించినా చేయలేనన్ని సంక్షేమ చర్యలను జగన్ చేసి చూపించారు.ఓవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పడిపోయి, జీఎస్టీ బకాయిలను కేంద్రం విడుదల చేయకపోయినప్పటికీ జగన్ మాత్రం తనదైన శైలిలో సాగుతున్నారు. ప్రజల పట్ల తమకున్న అభిమానానాకి, ప్రజా సంక్షేమానికి తన పట్టుదలకు నిదర్శనంగా పాలన సాగిస్తున్నారు. యువ ముఖ్యమంత్రిగా పాలనా బాధ్యతలు స్వీకరించిన తొలి ఏడాదిలోనే దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రుల్లో ఒక్కరిగా ఎదిగారు. సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఏకంగా ప్రధాని తర్వాత స్థానంలో నిలిచారు ఇలా తనదైన రీతిలో పాలనా పద్ధతుల్లో కొత్త పంథాకి శ్రీకారం చుడుతూ , ప్రజా సంక్షేమానికి మైలురాయిగా మారుతున్న పాలనలో జగన్ సీఎంగా రెండో పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. జనం మనసెరిగిన నేతగా మారుతున్న జగన్ మరిన్ని ఆనందదాయక పుట్టిన రోజులు జరుపుకోవాలని.. జనంలో చిరస్థాయిగా నిలిచిపోయే కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆశిద్దాం..

Show comments