బ‌ల‌ప‌రీక్ష‌కు షిండే సిద్ధంగాలేరా? ఫిరాయింపు నిరోధక చట్టం నుంచి త‌ప్పించుకోవాలంటే బీజేపీలో విలీనం త‌ప్ప‌దా?

ఎమ్మెల్యేలు వెంటున్నారు, బ‌ల‌ప‌రీక్ష‌కు రెడీ అని శివ‌సేన అంటోంది. మ‌రి ఎందుకు ఏక్ నాథ్ షిండే వెన‌క‌డుగువేస్తున్నారు? శివ‌సేన కూట‌మి ప్ర‌భుత్వాన్ని కూల్చొచ్చుగా? ఇక్క‌డే ట్విస్ట్ ఉంది. అసెంబ్లీలో కావాల్సింది నెంబ‌ర్ మాత్ర‌మేకాదు. అన‌ర్హత వేటుప‌డ‌కుండా ఉండాలంటే, ఏక్ నాథ్ కు రెండు మార్గాలున్నాయి. ఒక‌టి, బీజేపీలో చేరిపోవ‌డం. లేదంటే శివ‌సేన చీలిపోయింద‌ని నిరూపించ‌డం.

శివసేన మాజీ నేత‌ ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు బావుటా ఎగురేసి, ఐదురోజుల‌వుతోంది. పార్టీలో ఎక్కువ‌మంది ఎమ్మెల్యేలు త‌న వెంటే ఉన్నారు. అయినా, సీఎం ఉద్ధవ్ థాకరే తన మెజారిటీని, సభా వేదికపై నిరూపించుకోవాల‌ని ఇటు షిండే తిరుగుబాటు వర్గంకాని, అటు అసెంబ్లీలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా గ‌వ‌ర్న‌ర్ ను డిమాండ్ చేయ‌డంలేదు. ఇక్క‌డ రాజ‌కీయం, న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు. ఈ రెండూ క‌ల‌సి షిండే వ‌ర్గానికి నిద్ర‌లేకుండా చేస్తున్నాయి.

రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌కు 2003లో చేసిన‌ సవరణను ఫిరాయింపుల నిరోధక చట్టంగా చెబుతారు. ఇప్పుడు షిండే త‌న వెనుకున్న ఎమ్మెల్యేల‌ను తీసుకొని మరో పార్టీలోకి విలీనం చేయ‌కుండా, అనర్హత నుండి తప్పించుకోవడం కష్ట‌మేన‌ని నిపుణులు అంటున్నారు. అంత‌కుముందు వ‌ర‌కు అంటే 2003కి ముందు, మూడింట రెండు వంతుల సభ్యులు పార్టీని విడిచిపెట్టినట్లయితే ఫిరాయింపు నిరోధక చట్టం ఏం చేయ‌లేదు. కాని నిబంధనలు ఆ త‌ర్వాత కఠినతర‌మైయ్యాయి. షిండే వర్గానికి మూడింట రెండు వంతుల సభ్యులు ఉన్నా, వాళ్లు ఫిరాయింపుల చ‌ట్టం నుంచి త‌ప్పించుకోలేరు. మ‌రేం చేయాలి? విలీనం.

విలీనం అనుకున్నంత సులువేంకాదు. ఇది చ‌ట్ట‌ప‌ర‌మైన స‌మ‌స్య‌కాదు, రాజ‌కీయ ప‌ర‌మైంది. 2019లో బిజెపితో బంధాన్ని తెంచుకుని, కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవ‌డం అస‌హ‌జ‌మ‌ని షిండే చెబుతోంది. అలాగ‌ని బీజేపీలో విలీనమైతే సేన రాజ‌కీయ పార్టీ గుర్తింపును కోల్పోతుంది. అప్పుడు శివ‌సేన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అగ్ర‌హిస్తారు. అక్క‌డ నుంచి రాజ‌కీయం ఏం జ‌రుగుతుందో ఇప్పుడే అంచ‌నావేయ‌లేం. ఇంకో కార‌ణం, ఇప్ప‌టిదాకా శివ‌సేన నేత‌లుగా పేరున్న‌వాళ్లు ఒకేసారి బీజేపీలో చేరితే, రాజ‌కీయంగా వాళ్ల భ‌విష్య‌త్తు ముగిసిపోవ‌చ్చున‌న్న‌ది కొంద‌రి అనుమానం. అందుకే తిరుగుబాటు చేసినంత ఉత్సాహంగా త‌దుప‌రి చ‌ర్య ఏంటో షిండే టీం చెప్ప‌లేకపోతోంది.

ఫిరాయింపుల నిరోధక చ‌ట్టం

రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఎమ్మెల్యేల‌ ఫిరాయింల‌పై అనర్హత వేటు వేసింది. ఈ వేటు నుంచి త‌ప్పించుకోవాలంటే ఒక‌ మినహాయింపు ఉంది. అదే విలీనం. పదో షెడ్యూల్‌లోని పేరా 4 (1) ప్రకారం, ఒక పార్టీ త‌రుపున‌ సభకు ఎన్నికైన సభ్యులు, మరొక పార్టీలో విలీనమైతే అనర్హులుకారు. కాని, ఆ విలీనం చెల్లుబాటు కావాలంటే, శాసనసభా పక్ష సభ్యులలో మూడింట రెండు వంతుల మంది విలీనానికి అంగీకరించాలి.

షిండే మాట‌లను బ‌ట్టి, అత‌ను చూపించిన ఫోటోలు, వీడియోల‌ను బ‌ట్టి, ఆయ‌న‌కు మూడింత రెండొంతుల బ‌ల‌ముంది. కాని శివ‌సేన మాది అని, బీజేపీలో విలీనానికి సిద్దంగా ఉన్నామ‌ని స్పీకర్, ఎన్నికల కమిషన్ ముందు నిరూపించుకోవాలి. ఇక్క‌డ స్పీక‌ర్ శివ‌సేన కూట‌మి వ్య‌క్తి.

శివ‌సేన లాంటి పార్టీని నిలువునా చీల్చ‌డం రాజ‌కీయంగా ఉద్రేకాల‌ను రెచ్చ‌గొట్టే చ‌ర్య‌. కార్పొరేట‌ర్ల నుంచి ఎంపీల వ‌ర‌కు అంద‌రినీ చీల్చాల్సి ఉంది. ఇదేమంత సులువుకాదు. ఒక‌వేళ బీజేపీ నేత‌లు కోరుకొంటున్న‌ట్లు షిండే విలీన‌మైతే? శివ‌సేన సైద్ధాంతిక మీద అత‌నికి ఎలాంటి హ‌క్కూ ఉండ‌దు. బాల్ థాక‌ర్ శిష్యుడిగా ఒక‌మీదట చెప్పుకోలేడు. అంతేనా? ఇకమీద తానొక బీజేపీ ఎమ్మెల్యేగా మిగిలిపోతాడు. ఫ‌డ్నావీస్ లాంటి నేతున్న‌చోట సీఎం కాలేడుక‌దా! ఇది శివ‌సేన అంచ‌నా.

 

Show comments