Idream media
Idream media
జనవరి 22, అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి. నట జీవితం, విజయాల గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు కానీ, ఒక్కోసారి జీవితం కంటే మరణం గురించి ఎక్కువ మాట్లాడాలి. క్యాన్సర్ అని ప్రెస్‌మీట్లో ANR చెప్పిన తీరు నన్నే కాదు, అభిమానులందరినీ ఆశ్చర్యపరిచింది. మృత్యువు దేహపు పొలిమేరల్లో ఉందని స్పష్టంగా తెలిసినా కళ్లలో ఎక్కడా అధైర్యం లేదు. భయం లేదు. మరణాన్ని ఆయన ఎదుర్కొన్న విధానం జీవితం కంటే గొప్పది.
చిన్నప్పుడు ANR కంటే NTR నచ్చేవాడు. అయితే ఇంట్లో వాళ్లతో పాటు ANR సినిమాలకు కూడా వెళ్లాల్సి వచ్చేది. ఆత్మీయులు సినిమాలో మొదట గుమ్మడి హత్యని చూసి భయంతో కేకలు వేస్తే సినిమా నుంచి తీసుకొచ్చేశారు. అక్కినేని అంటే ఇష్టపడడానికి ప్రేమనగర్, దసరాబుల్లోడు కారణం. ఎక్కడ విన్నా అవే పాటలు. బంగారు బాబులో చెంగావి రంగు చీర పాట సూపర్ హిట్. దాంట్లో హెలికాప్టర్ ఫైట్ కూడా ఉంది. అందుకే నచ్చాడు.
మా చిన్నాన్న ANRకు ఉత్తరం రాస్తే, ఆయన సంతకంతో రిప్లై వచ్చింది. అప్పటి నుంచి మా చిన్నాన్నకి ANR స్నేహితుడని నమ్మేవాన్ని. మా చిన్నాన్న కూడా ఎంతగా నమ్మేవాడంటే తాను మద్రాస్ వెళితే నాగేశ్వరరావు సినిమా చాన్స్ ఇస్తాడని అనుకునేవాడు.
79లో ఇంటర్ చదువుకంటే సినిమాలే ముఖ్యం కావడంతో ANR అభిమాన సంఘంతో పరిచయాలు. వీళ్లంతా పగలు పబ్లిక్ లైబ్రరీ చెట్టు కింద, సాయంత్రం లలితకళాపరిషత్ వెనుక ఉన్న మున్సిపల్ పార్కులో సమావేశం అయ్యేవాళ్లు. వీళ్లలో నాలాంటి స్టూడెంట్స్ మినహాయిస్తే మిగతా వాళ్లంతా స్వల్పమైన ఆదాయంతో బతికేవాళ్లు.
జోగులు మున్సిపల్ ఆఫీస్‌లో కాలువలు వూడ్చే కూలి. ఆనంద్ ఒక లాడ్జీలో బాయ్, తర్వాత ఈయన ఇడ్జీ వ్యాపారంలో ఫేమస్. వెంకటేశ్వర్లు స్కూల్ వాచ్‌మన్, కృష్ణమూర్తి బండిపై బజ్జీలు వేసేవాడు. మూర్తి రఘువీరా టాకీస్ వద్ద మెస్ నడిపేవాడు. రమణ టవర్‌క్లాక్ వద్ద వక్కలు అమ్మేవాడు. శేఖర్ ఆర్ట్స్ కాలేజి స్టూడెంట్, ఇలా చాలా మంది.
వీళ్లు చేసే పని ఏమంటే ANR సినిమాలు మొదటి రోజు చూడడం. సినిమా మొదలైన రోజు నుంచి , చివరి వరకూ థియేటర్ దగ్గర సమావేశమై కలెక్షన్లు చూడడం, ఒకవేళ అవసరమైతే వీళ్లే పది టికెట్లు కొని హౌస్ ఫుల్ బోర్డు పెట్టించడం.
వీళ్లతో మరీ గాఢమైన అనుబంధం కాదు కానీ, సినిమా గురించి వినడం, మాట్లాడ్డం పిచ్చి కాబట్టి తరచూ కలిసేవాన్ని. వీళ్లలో కొందరు ANRలా నడుస్తూ మాట్లాడేవాళ్లు.
ఎంత అమాయకమైన మూర్ఖపు అభిమానమంటే వీళ్లకి ఎవరికీ మంచి బట్టలు వుండేవి కావు, కాళ్లకి అందరికీ చెప్పులుండేవి కావు. ANR పేరు చెబితే పూనకం. తిండి లేకపోయినా ఆయన పాట వింటే కడుపునిండేది. తొలి రోజుల్లో నాగార్జునకి నటన రాకపోయినా , నిలబడ్డానికి వీళ్లే కారణం. అనంతపురంలోనే కాదు కాకినాడ, కడప, తాడేపల్లిగూడెం ఏ వూళ్లో చూసినా వీళ్లు వుండేవాళ్లు. ఇంత మంది అభిమానం పొందాడు కాబట్టి ANRకి అంత మనో నిబ్బరం.
ANR నవ్వితే ఈ అభిమానులు నవ్వారు. ఏడిస్తే ఏడ్చారు. తెరమీద ఆయన మరణిస్తే కన్నీళ్లతో తడిసిపోయారు. తెరమీద ఆయన ప్రేమ వీళ్లది, కష్టం వీళ్లది. మనుషులు ఎంతో అదృష్టం చేసుకోవాలి దీనికి.
ANR మరణించినా జీవించే వుంటాడు. అనంతపురంలో ఈ రోజు ఆయన సినిమాలు చూసిన థియేటర్లు లేవు. కలిసి చూసిన మనుషులు లేరు. జ్ఞాపకాలు మాత్రమే వుంటాయి. ANR అందమైన కలలాంటి జ్ఞాపకం.