Huge Rally, Tirupati, Three Capitals – మూడు రాజధానుల ఆకాంక్ష.. భారీ ర్యాలీతో బలంగా చాటిన తిరుపతి

తరాల తరబడి అన్ని విధాలుగా వెనకబాటుకు గురైన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికై వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులను వెంటనే ఏర్పాటు చేయాలంటూ ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో భారీ ర్యాలీ జరిగింది. మూడు రాజధానుల ఆకాంక్షను స్థానిక ప్రజలు, విద్యార్థులు, మేథావులు బలంగా చాటారు. దాదాపు పదివేల మంది ర్యాలీలో పాల్గొని మూడు రాజధానులకు మద్ధతుగా నినాదాలు చేశారు. మూడు రాజధానులు కావాలంటూ విద్యార్థులు నినదించారు. వి వాంట్‌ జస్టిస్‌ అంటూ గళమెత్తారు. అడుగులో అడుగు వేస్తూ.. తిరుపతి నగర వీధుల్లో కదం తొక్కారు. అభివృద్ధి వికేంద్రీకరణకు స్వాగతమంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

మూడు రాజధానులను తక్షణమే ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో రాయలసీమ మేథావుల ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన తిరుపతిలో రాయలసీమ చైతన్య సభను నిర్వహించ తలపెట్టారు. ఈ సభకు బుధవారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నుంచి అనుమతి కూడా లభించింది. ఈ సభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ రాయలసీమ మేథావుల ఫోరం అధ్యక్షుడు మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి ఆధ్వర్యంలో ఈ భారీ ర్యాలీ జరిగింది. తిరుపతి నగరంలోని వివిధ కాలేజీల విద్యార్థులు, అధ్యాపకులు, వివిధ సంఘాల నేతలు, ప్రజా సంఘాలు, స్థానిక ప్రజలు పది వేల మంది ఈ ర్యాలీలో పాల్గొని తమ ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేశారు.

మూడు రాజధానులను అమరావతి ప్రాంతంలోని కొంత మంది రైతులు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, సీపీఐ, జనసేన పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. మూడు రాజధానులు వద్దని, అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి జేఏసీ ఉద్యమం చేస్తోంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి జేఏసీ, టీడీపీ దాదాపు 200 పిటిషన్లు హైకోర్టులో దాఖలు చేశాయి. విచారణ జరుగుతుండగా.. సాంకేతికపరమైన లోపాలను సరిదిద్ధి మళ్లీ బిల్లు పెట్టేందుకు మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన చట్టాలను ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

Also Read : మూడు రాజధానులకు మద్ధతుగా తిరుపతిలో ఫ్లెక్సీలు.. చించివేసిన అమరావతి రైతులు

మరో వైపు అమరావతి జేఏసీ న్యాయ స్థానం నుంచి దేవస్థానం పేరుతో అమరావతిలోని హైకోర్టు నుంచి తిరుపతికి పాదయాత్ర చేసింది. పాదయాత్ర తిరుపతికి చేరుకున్న సమయంలో.. వారికి స్వాగతం చెబుతూ.. మూడు రాజధానులు కావాలని స్థానికులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని అమరావతి పాదయాత్రలోని వారు చించిపడేయడం గమనార్హం. ఆ యాత్ర ఈ నెల 14వ తేదీన ముగిసింది. అమరావతియే ఏకైక రాజధానిగా ఉంచాలనే డిమాండ్‌తో రేపు తిరుపతిలో పాదయాత్ర ముగింపు సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఇతర పార్టీల నేతలు హాజరవబోతున్నారు. ఈ సభ ముగిసిన మరుసటి రోజే.. రాయలసీమ మేథావుల ఫోరం తలపెట్టిన రాయలసీమ చైతన్య సభ జరగబోతోంది. ఆ సభ ఎలా జరగబోతోందో.. తాజాగా జరిగిన ర్యాలీ చాటి చెబుతోంది.

Show comments